దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట బాంబు పేలుళ్ల నిందితుల‌కు ఉరిశిక్ష‌..! వారికదే క‌రెక్ట‌న్న కోర్టు..!

అది 2013, ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ. ప్రాంతం దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌. సాయంత్రం అయింది. అప్ప‌డే చీక‌ట్లు అలుముకుంటున్నాయి. ఆఫీసులు, కాలేజీలు, పాఠ‌శాల‌ల నుంచి ఇండ్ల‌కు వెళ్లే వారు ఓ వైపు, బ‌య‌ట‌కు షాపింగ్‌కు వ‌చ్చిన వారు, తిండికోసం వ‌చ్చిన వారు, వేరే ఇత‌ర ప‌నుల కార‌ణంగా వ‌చ్చిన వారితో మ‌రో వైపు ఆ ప్రాంత‌మంతా జ‌న స‌మ‌ర్దంగా ఉంది. అంత‌లోనే హ‌ఠాత్తుగా బ‌స్‌స్టాప్ వ‌ద్ద ఓ పేలుడు. ఏం జ‌రుగుతుందో తెలిసే లోపే ఆ ప్రాంతానికి మ‌రి కొద్ది దూరంలో నిమిషాల వ్య‌వ‌ధిలో రెండో పేలుడు. దీంతో జ‌నాలు షాక్‌కు గుర‌య్యారు. అత్యంత భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యారు. జ‌నాలు హాహాకారాలు చేశారు. కొద్ది సేప‌టి క్రిత‌మే త‌మ కళ్ల ముందు ఉన్న తోటి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు బాంబు పేలుళ్ల‌కు బ‌ల‌వడంతో వారి కుటుంబీకులు ప‌డిన ఆవేద‌న అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆవేద‌న‌కు తుది తీర్పు ఇప్పుడు వచ్చింది. స‌ద‌రు బాంబు పేలుళ్ల నిందితుల‌కు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది.

dilsukhnagar-blasts

దిల్‌సుఖ్‌న‌గ‌ర్ బ‌స్టాండ్‌, అలీ మిర్చి సెంట‌ర్‌ల వ‌ద్ద 2013, ఫిబ్ర‌వరి 21న ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్ర‌వాదులు బాంబుల‌ను పేల్చిన విష‌యం విదిత‌మే. ఈ రెండు సంఘ‌ట‌న‌ల్లోనూ 22 మంది మృతి చెందారు. 138 మందికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో జంట బాంబు పేలుళ్ల కేసును ఎన్ఐఏ కు అప్పగించారు. వారు వెంట‌నే రంగంలోకి దిగి కేసును మూలల్లోకి ప‌రిశోధించారు. టిఫిన్ బాక్సును సైకిల్‌కు పెట్టుకుని వ‌చ్చిన ఓ వ్య‌క్తిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో ఆ వ్య‌క్తిని ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకుని విచార‌ణ చేయ‌గా అస‌లు విష‌యం తెలిసింది.

dilsukhnagar-blasts-1

ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్ర‌వాదులు అసదుల్లాహ అక్తర్, యాసిన్ భత్కల్, తహసిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్, యజాజ్ షేక్, రియాజ్ భత్కల్ లు ఈ పేలుళ్ల‌కు కార‌ణ‌మ‌ని ఎన్ఐఏ త‌న ద‌ర్యాప్తులో తేల్చింది. ఈ క్ర‌మంలో రియాజ్ భ‌త్క‌ల్ త‌ప్ప మిగిలిన ఐదుగురిని ఎన్ఐఏ ప‌ట్టుకోగ‌లిగింది. కానీ రియాజ్ మాత్రం పాక్‌కు పారిపోయాడు. దీంతో ఎన్ఐఏ అధికారులు స‌ద‌రు ఉగ్ర‌వాదుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టులో ప్రవేశ‌పెడుతూ, విచార‌ణ చేస్తూ చివ‌రికి ఆధారాల‌న్నీ సేక‌రించాక వారిని దోషులుగా ఎన్ఐఏ స్పెష‌ల్ కోర్టులో తాజాగా ప్ర‌వేశ‌పెట్టారు. ఈ క్ర‌మంలో కోర్టు ఆ ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అయితే నిందితుల‌ను మ‌రోసారి హైకోర్టులో ప్ర‌వేశ‌పెట్టి అక్క‌డ ఇదే శిక్ష ఖ‌రారు అయ్యాక దాన్ని అమ‌లు చేస్తామ‌ని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దీంతో బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి చెందిన కుటుంబ స‌భ్యులు ఇప్పుడు ఆనందంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు. అలాంటి నిందితుల‌కు ఉరి శిక్షే స‌రైంద‌ని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో వారికి శిక్ష అమ‌లు జ‌రిగే రోజు కోసం మ‌రిన్ని రోజులు వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top