ఏయే దేవుళ్ల‌కు ఏ ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే శుభం క‌ల్గుతుంది??

హిందూ సాంప్ర‌దాయాల‌ను పాటించే వారు, ఆ మ‌తానికి చెందిన వారు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా త‌మ ఇష్ట దైవాల‌ను పూజిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది ఇండ్ల‌లో ఆయా దైవాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పూజ‌లు చేస్తుంటారు. వారంలో దేవుడికి ఇష్టమైన రోజున పూజ చేసి అనంత‌రం నైవేద్యం పెడ‌తారు. అయితే వారంలో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని పూజించిన‌ట్టే ఆయా దైవాల‌కు పెట్టే నైవేద్యాలు కూడా వేరేగా ఉంటాయి. మ‌రి ఏ దేవుడికైనా లేదా దేవ‌త‌కైనా పూజ చేసిన‌ప్పుడు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. శ్రీ‌రాముడు
ఈయ‌న‌కు పాన‌కం, వ‌డ‌ప‌ప్పును నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అంతా మంచే జ‌రుగుతుంది. కోరుకున్నవి నెర‌వేరుతాయి. దంప‌తులు క‌ల‌సి పూజ చేస్తే ఇంకా మంచిది. వారి వైవాహిక జీవితం బాగుంటుంది.

2. శివుడు
శివున్ని సోమవారం భ‌క్తులు పూజిస్తారు. కోరిన కోర్కెల‌ను వెంట‌నే తీర్చే, పిలిచిన వెంటనే ప‌లికే బోళా శంకరుడిగా శివున్ని భ‌క్తులు ఆరాధిస్తారు. ఈయ‌న‌క ద‌ద్దోజ‌నం అంటే ఇష్టం. ఆ వంట‌కాన్ని నైవేద్యంగా పెట్టి పూజించాల్సి ఉంటుంది.

3. అయ్య‌ప్ప స్వామి
చాలా మంది భ‌క్తులు ఏటా అయ్య‌ప్ప మాల‌ను ధ‌రించి మాల తీయ‌డం కోసం శ‌బ‌రిమ‌ల వెళ్తుంటారు. కోరిన కోర్కెలు నెర‌వేర్చే దైవంగా అయ్య‌ప్ప స్వామిని భ‌క్తులు కొలుస్తారు. ఈయ‌న‌కు పేలాలు అంటే చాలా ఇష్టం. అందుకని పూజ చేసిన‌ప్పుడు నైవేద్యంగా పేలాలు స‌మ‌ర్పిస్తే భ‌క్తుల‌కు కోరుకున్నవి నెర‌వేరుతాయి.

4. శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడికి ఏ ఆహారం అంటే ఇష్ట‌మో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న‌ను భ‌క్తులు వెన్న దొంగ అని పిలుస్తారు క‌దా. అవును, వెన్న అంటే కృష్ణుడికి బాగా ఇష్టం. అందుకే ఆయ‌న్ను పూజించేట‌ప్పుడు వెన్న‌ను నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. దీంతో భ‌క్తులు కోరుకున్న‌వి నెర‌వేరుతాయి.

5. ఆంజ‌నేయ స్వామి
ఆంజ‌నేయ స్వామి గొప్ప రామ భ‌క్తుడు. రామున్ని ఆయన పూజించిన‌ట్టుగా ఎవ‌రూ పూజించ‌లేరు. ఈయ‌న‌కు బెల్లం లేదా ల‌డ్డూను నైవేద్యంగా పెట్టాలి.

6. ల‌క్ష్మీ దేవి
చాలా మంది కేవ‌లం శ్రావ‌ణ మాసంలోనే కాకుండా ప్ర‌తి శుక్ర‌వారం ల‌క్ష్మీదేవికి పూజ‌లు చేస్తారు. కొంద‌రు వ్యాపారులు రోజూ ఆ దేవిని కొలుస్తారు. అయితే ఈమెకు పూర్ణాలు లేదా బూరెల‌ను నైవేద్యంగా పెడితే దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది.

7. వినాయ‌కుడు
వినాయ‌క చ‌వితిని భ‌క్తులు ఏటా ఎంతో గొప్ప‌గా జ‌రుపుకుంటారు. న‌వ రాత్రులపాటు పూజ‌లు చేసి ఆయ‌న విగ్ర‌హాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిమ‌జ్జనం చేస్తారు. అయితే వినాయ‌కున్ని నిజానికి ఎప్పుడైనా పూజించ‌వ‌చ్చు. ఆయ‌న‌కు పూజ‌లు చేసిన‌ప్పుడు కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెడితే మంచిది. అనుకున్న ప‌నులు స‌కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతాయి.

Comments

comments

Share this post

scroll to top