పేదపిల్లల చదువు కోసం తన జాబ్ ను వదిలి మరీ… కొత్త టెక్నిక్ తో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.

నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాల దిశగా లక్ష్య సాధన కోసం పనిచేస్తూ ఆ క్రమంలో ముందుకు సాగుతున్నారు. దీంతోపాటు సంపాదనపై కూడా దృష్టి పెడుతున్నారు. అయితే మైసూర్‌కు చెందిన ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. చదువుకు నోచుకోక పేదరికంతో అవస్థలు పడుతున్న చిన్నారుల జీవితాలను బాగుచేయడం కోసం, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పటికీ పేద చిన్నారుల కోసం తన జాబ్‌ను వదిలేశాడు. ఆ క్రమంలో సదరు చిన్నారులకు వినూత్న రీతిలో సరైన విద్యను అందిస్తూ తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తున్నాడు. పేద పిల్లల కోసమే ప్రత్యేకంగా ఓ పాఠశాలను నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. అతనే అనంత్ కుమార్.
KM1
కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన అనంత్ కుమార్ ఇంజినీర్‌గా పలు సంస్థల్లో దాదాపు 10 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ క్రమంలో 1992లో మైసూర్ శివారు ప్రాంతంలో ఉండే శ్రీరాంపుర అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను, అందులో కొనసాగుతున్న చిన్నారుల విద్యను అతను ఓసారి అనుకోకుండా పరిశీలించాడు. అప్పుడే ఆ చిన్నారులకు సరైన విద్య అందడం లేదని గుర్తించాడు. అయితే అప్పటికీ తన మనస్సులో పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన రాలేదు. అనంతరం కొంత కాలం తరువాత శ్రీ అరబిందో, వివేకానందుడి వంటి మహానీయుల జీవిత చరిత్రలను, వారి సూక్తులను చదివి బాగా ప్రభావితమయ్యాడు. ఈ నేపథ్యంలో తాను కూడా సేవ చేయాలనే తలంపుకు వచ్చాడు. అనుకున్నదే తడవుగా అదే శ్రీరాంపుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉదయం, సాయంత్రం ప్రత్యేకమైన క్లాసులు తీసుకునే వాడు. పాఠశాల అధ్యాపకులు కూడా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు అతనికి పాఠశాలలో కొంత స్థలాన్ని కేటాయించారు. క్రమంగా అతని మనసు ఇంకాస్త ప్రభావితమై, పేద పిల్లల కోసం ఓ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చేలా చేసింది. ఈ క్రమంలో అనంత్ కుమార్ 1999లో దివ్య దీప చారిటబుల్ ట్రస్ట్‌ను తన స్నేహితులు మరికొందరితో కలిసి ఏర్పాటు చేశాడు. అనంతరం 2005లో కలియువ మనె పేరిట ఓ పూర్తిస్థాయి పాఠశాలను ఏర్పాటు చేయగలిగాడు. అయితే ఇందుకోసం తన జాబ్‌ను అనంత్ కుమార్ వదిలేయడం విశేషం.
KM2
కాగా కలియువ మనె పాఠశాలలో మొదట కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. శ్రీరాంపుర నుంచి ఇద్దరు అందులో ఉన్నారు. వారిలో ఒకరు తన సొంత కుమారుడే కావడం విశేషం. అనంతరం అనంత్ కుమార్ భార్య కూడా ఆ పాఠశాలలో పూర్తి స్థాయి వాలంటీర్‌గా సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇతర పాఠశాలల్లో మాదిరిగా కాకుండా కలియువ మనెలో చిన్నారులకు విభిన్నమైన రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తారు. పాఠశాల కోసం చిన్నారులు అని కాకుండా, చిన్నారుల కోసం పాఠశాల అనే విధంగా తమ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో జాయిన్ అయ్యేందుకు పేద పిల్లల నుంచి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు. 12 సంవత్సరాల లోపు వయస్సున్న పేద పిల్లలకు మాత్రమే ఇందులో చదువుకునేందుకు అడ్మిషన్ లభిస్తుంది. అయితే పిల్లల్ని జాయిన్ చేసుకున్న వెంటనే వారికి అక్కడ పాఠాలు చెప్పరు. ముందుగా వారిని ఆ పాఠశాల ఆవరణలో స్వేచ్ఛగా తిరగనిస్తారు. వారు ఆసక్తి చూపుతున్న అంశాలకు అనుగుణంగా ఆ పిల్లలకు ఉపాధ్యాయులను కేటాయించి ఆ విద్యార్థులను టీంలుగా విభజిస్తారు. ఆ టీంలకు చేతన, చైతన్య, వివేకా వంటి పేర్లను పెడతారు. ఆ పేర్ల ప్రకారం ప్రతిభ గల విద్యార్థులను, ఇతరులను సులభంగా గుర్తిస్తారు. దీనికి తోడు విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ఇవ్వకపోవడంతో వారిలో వారికి ఎక్కువ, తక్కువ అనే భావన కూడా కలగదు. ఇది వారిని మరింత ప్రోత్సహించే అంశంగా చెప్పవచ్చు. అయితే ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి వారు చూపిన ప్రతిభ ఆధారంగా మళ్లీ టీంల వారీగా విభజిస్తారు. దీంతో పిల్లలకు విద్యాబోధనను సులభంగా అందించేందుకు వీలువుతుంది. కాగా ప్రస్తుతం ఆ పిల్లలకు కన్నడ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ వంటి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
KM4
ప్రస్తుతం 114 మంది పేద పిల్లలు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తుండగా, వారిలో నలుగురు ఇప్పటికే కాలేజీ విద్యను చదువుతున్నారు. మొత్తం 35 మంది పాఠశాలలో ఉంటూనే విద్యను నేర్చుకుంటుండగా, మిగతా వారు సమీప గ్రామాల నుంచి నిత్యం పాఠశాలకు వస్తుంటారు. మరీ దగ్గరగా గ్రామాలు ఉంటే అక్కడి నుంచి విద్యార్థులను తమ సొంత బస్సుల్లోనే ఆ పాఠశాల అధ్యాపకులు తీసుకువస్తారు. అయితే ఇందు కోసం వారు ఎలాంటి రవాణా చార్జీలను వసూలు చేయరు. కాగా ప్రస్తుతం ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఈ స్కూల్‌లో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది వాలంటీర్స్‌గా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. కేవలం కొద్ది మంది మాత్రమే నామ మాత్రపు జీతం తీసుకుంటున్నారు. అయితే పాఠశాలను ప్రారంభించిన తొలి నాళ్లలో అనంత్ కుమార్ సొంత ఖర్చులతో వ్యయాలను భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అతని చేయూతను అందించడం కోసం అనేక మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు.
KM3
ఇంత చేస్తున్న అనంత్ కుమార్‌ను పాఠశాల విషయమై ప్రశ్నిస్తే, కలియువ మనె అంటే హోమ్ ఫర్ లెర్నింగ్ అని అర్థం వస్తుందని, అంటే ఇతర స్కూళ్లలా మూస ధోరణిలో కాకుండా పూర్తి స్థాయిలో ఇంటి వాతావరణాన్ని తలపించేలా విద్యనందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని అంటారు. ఆర్థిక స్థితిగతులు బాగాలేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, బాల కార్మికులుగా మారిన వారు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు తమ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తున్నామని, తమ వద్ద విద్య నేర్చుకున్న పిల్లలు పరీక్షల్లో 100 శాతం ఫలితాలను సాధిస్తున్నారని గర్వంగా చెబుతున్నారాయన. 2010లో ఓ విద్యార్థి తమ వద్ద స్కూల్‌లో చదువు నేర్చుకున్నాడని, ఇప్పుడతను అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడై మంచి ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. అదేవిధంగా 1వ తరగతి మధ్యలో మానేసిన  మరో బాలుడు కూడా తమ పాఠశాలలో చదివి ఇప్పుడు ఓ గవర్నమెంట్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. పేద పిల్లల జీవితాల్లో వస్తున్న వెలుగులను చూస్తున్నప్పుడల్లా అలాంటి వారి కోసం ఇంకా ఏదో చేయాలనిపిస్తుందంటాడు అనంత్‌కుమార్. నిజంగా ఆయన చొరవకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top