క్యా బాత్ హై..కుచ్ నహీ ..ఇక అంతేగా ..ఉన్నదేగా..ఐపీఎల్ -12 టోర్నీలో ఎప్పటి లాగే సీన్ మొదటికొచ్చింది. ఎం ఎస్ ధోనీ సారధ్యంలోని చెన్నై క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ప్లే ఆఫ్ కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అత్యుత్తమమైన ఆటతీరును ప్రదర్శించారు చెన్నై ఆటగాళ్లు. చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన డిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక రంగంలోకి దిగిన చెన్నై జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సుచిత్ వేసిన 4వ ఓవర్ రెండో బంతికే పంచ్ హిట్టర్ వాట్సన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ దశలో ఏ మాత్రం స్కోర్ చేయదన్న దశలో బరిలోకి దిగిన రైనా, డుప్లెసిస్ ల జోడి వికెట్లు పోకుండా ధాటిగా పరుగులు చేస్తూ వచ్చారు. వీరిద్దరు కలిసి 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చెన్నై జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అక్బర్ వేసిన అద్భుతమైన బంతికి డుప్లెసిస్ 39 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత సుచిత్ చేసిన మాయాజాలానికి సురేష్ రైనా 59 పరగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన జడేజా దూకుడు పెంచాడు. చివర్లో ధోనీ బ్యాటింగ్‌తో మెరిపించాడు. 44 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇక టార్గెట్‌ను ఛేదించే క్రమంలో మైదానంలోకి ఎంటర్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మాత్రం నిలదొక్కుకోలేక పోయారు. వెంట వెంటనే వికెట్లను పారేసుకున్నారు.
మరో వైపు చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ జట్టు కేవలం 16.2 ఓవర్లకే 99 పరుగులు చేసి ఆలవుట్ అయ్యింది. ఈ జట్టులో షా 4 పరుగులు చేయగా, ధావన్ 19 పరుగులు, అయ్యర్ 44 పరుగులు, పంత్ 5 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. చెన్నై జట్టు బౌలర్లు ఇమ్రాన్ తాహిర్ 4 వికెట్లు తీయగా, జడేజా 3 వికెట్లు, హర్బజన్ సింగ్ , చహార్ చెరో వికెట్ తీసి ..విజయంలో కీలక భూమిక పోషించారు. మొత్తం మీద జోరు మీదున్న చెన్నై జట్టు ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకు పోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇంకా ఏయే జట్లు ప్లే ఆఫ్ వరకు వస్తాయో ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తం మీద ఢిల్లీ చెన్నైకి చెక్ పెడుతుందని అనుకునన్న క్రికెట్ ఫ్యాన్స్ కు చివరకు చుక్కెదురైంది. ఎంతైనా ధోనీ..చెన్నై జట్టు కదూ. ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో అన్ని జట్లకంటే చెన్నై ముందంజలో కొనసాగుతోంది.