ఆ బాలుడికి రెండు క‌ళ్లు లేవు… అయినా రోబోటిక్స్ ఛాంపియ‌న్ అయ్యాడు..!

ప్ర‌తి మ‌నిషికి త‌న జీవితంలో అత్యంత క్లిష్ట‌మైన స‌మ‌యం, క‌ష్ట‌కాలం ఒక్క‌టే సారి వ‌స్తుంది. అది వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది అయితే కుంగి పోతారు. ఇంకొంద‌రు సూసైడ్ వంటివి చేసుకుంటారు. కానీ కొంద‌రు మాత్రం అలా కాదు. త‌మ‌కు వ‌చ్చిన క‌ష్టాలు ఎటువంటివైనా స‌రే అధిగ‌మిస్తూ ముందుకు సాగుతుంటారు. ఫ‌లితంగా విజ‌య తీరాల‌కు చేరుకుంటారు. ఇప్పుడు మేం చెప్ప‌బోతుంది  కూడా స‌రిగ్గా ఇలాంటి వ్య‌క్తి గురించే. ఎప్పుడో క‌లిగిన తీవ్ర‌మైన న‌ష్టానికి అత‌ను అంత‌గా దిగులు చెంద‌లేదు. త‌న‌ను శాసించిన విధిపై పోరాడుతూ, ప‌దే ప‌దే ఆ న‌ష్టం జ్ఞ‌ప్తికి వ‌స్తున్నా దాన్ని ప‌క్క‌కు నెట్టి ల‌క్ష్య సాధ‌న వైపే దృష్టి సారించాడు. ఇప్పుడు అంద‌రి దృష్టిలో హీరో అయ్యాడు.

bhavya-shah
అత‌ని పేరు భ‌వ్యా షా. వ‌య‌స్సు 15 ఏళ్లు. అత‌నికి 5 ఏళ్లు ఉన్న‌ప్పుడే రెటిన‌ల్ డిటాచ్‌మెంట్ అనే జ‌బ్బు కార‌ణంగా కంటి లోప‌లి రెటీనా పొర ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిపోతూ వ‌చ్చింది. దీంతో అత‌నికి 11 ఏళ్లు వ‌చ్చే స‌రికి ఆ పొర పూర్తిగా తొల‌గిపోయి అత‌ని రెండు క‌ళ్లు క‌నిపించ‌కుండా పోయాయి. ఎంతో మంది డాక్ట‌ర్ల‌కు చూపించినా ఫ‌లితం లేదు. దీంతో అత‌ను శాశ్వ‌తంగా అంధుడు కావ‌ల్సి వ‌చ్చింది. అయినా భ‌వ్యా షా దిగులు చెందలేదు. త‌న ల‌క్ష్య సాధన పైనే దృష్టి సారించాడు. ముంబైలోని గోపీ బిర్లా మెమోరియ‌ల్ స్కూల్‌లో విద్య‌ను అభ్య‌సించ‌డం మొద‌లు పెట్టాడు. అక్క‌డే స్థానికంగా ఉన్న జేవియ‌ర్ రీసోర్స్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో నాన్ విజువ‌ల్ డెస్క్‌టాప్ యాక్సెస్ (ఎన్‌వీడీఏ) అనే ప‌రిక‌రంతో సాధార‌ణ విద్యార్థుల్లాగే స్కూల్‌లో బోధించే పాఠ్యాంశాల‌ను నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలో అత‌ను అన్ని అంశాల్లోనూ ప‌ట్టు సాధించాడు. అయితే భ‌వ్యా షా కు రోబోటిక్స్ స‌బ్జెక్ట్ అంటే ఇష్టం ఉండ‌డంతో ఆ రంగంలో త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం మేర‌కు రోబోటిక్స్ అంశాల్లోనూ మెళ‌కువలు నేర్చుకున్నాడు.

అయితే భ‌వ్యా షా రోబోటిక్స్ నేర్చుకోవ‌డంతోనే ఆగిపోలేదు. ఎన్నో కాంపిటీష‌న్‌ల‌లో పాల్గొన్నాడు. చాలా రోబోటిక్స్ పోటీల్లో విజేత‌గా నిలిచాడు. టీసీఎస్ ఐటీ విజ్‌, ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మోడ‌ల్ యునైటెడ్ నేష‌న్స్ ఛాంపియ‌న్‌షిప్ కాన్ఫ‌రెన్స్‌, గ్లోబ‌ల్ ఐటీ చాలెంజ్ వంటి అనేక పోటీల‌తోపాటు ఈ మ‌ధ్యే జ‌రిగిన వ‌ర‌ల్డ్ రోబోటిక్స్ ఒలంపియాడ్‌లో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి సాధించి అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. పుట్టుక‌తో కాకున్నా మ‌ధ్య‌లో వ‌చ్చిన అంధ‌త్వంతో ఓ వైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే భ‌వ్యా షా రోబోటిక్స్ ఒలంపియాడ్‌లో గెల‌వ‌డం విశేష‌మే మరి. ఇందుకు గాను అత‌న్ని అభినందించ‌ని వారు లేరు. అంగ‌వైక‌ల్యం ఉన్నా సాధార‌ణ విద్యార్థుల‌తో పోటీ ప‌డి మ‌రీ అందులో అత‌ను ప్ర‌థ‌మంగా నిల‌వ‌డం ఆశ్చ‌ర్యమే మరి. అత‌ను ముందు ముందు కూడా ఇలాగే మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని, రోబోటిక్స్‌లో ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top