3 ఏళ్ల వ‌య‌స్సులో కంటి చూపును కోల్పోయాడు….కానీ, 12 ఏళ్ళ శ‌బ‌రి టాలెంట్ కు అబ్దుల్ క‌లాం, మోడీ, జ‌య‌ల‌లితలు సైతం శ‌భాష్ అన్నారు.

విజ‌యం, దాని వ‌ల్ల పొందే ఆనందం రెండూ నీలోనే ఉంటాయి. వీటిని ఒక అల‌వాటుగా మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి ప్ర‌తిబంధ‌కాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు దాటి వెళ్ల‌గ‌ల‌రు..! ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, ఉప‌న్యాస‌కురాలు హెలెన్ కెల్ల‌ర్ అన్న మాట‌లివి. స‌రిగ్గా ఆ బాలుడు కూడా ఈ మాట‌ల‌నే వంట బ‌ట్టించుకున్నాడు. క‌నుక‌నే అంగ వైక‌ల్యం బాధిస్తున్నా త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటుతున్నాడు. అంధ‌త్వంతో ఎదురైన ఇబ్బందుల‌ను అన్నింటినీ అత‌ను అధిగ‌మించాడు. ఈ క్ర‌మంలోనే త‌న‌లో ఉన్న నైపుణ్యాల‌కు మ‌రింత ప‌దును పెట్టాడు. ఇప్పుడు అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. ఆ బాలుడి పేరు శ‌బ‌రి వెంక‌ట్‌. వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు.

శ‌బ‌రి వెంక‌ట్‌ది త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ ప్రాంతం. అక్క‌డి పొల్లాచి అనే ఊర్లో అత‌ను త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌సి నివాసం ఉంటున్నాడు. అయితే వెంక‌ట్‌కు 3 ఏళ్ల వ‌యస్సు ఉన్న‌ప్పుడు అత‌నికి రెటినల్ డిచాట్‌మెంట్ అనే జ‌బ్బు వ‌చ్చింది. దీని కార‌ణంగా అత‌ని కుడి కంటిలో ఉండే రెటీనా ప‌క్క‌కు జ‌రిగింది. ఈ క్ర‌మంలో వెంక‌ట్‌కు కుడి క‌న్ను క‌నిపించ‌కుండా అయింది. ఎడ‌మ క‌న్ను ద్వారా అత‌ను పాక్షికంగా మాత్ర‌మే చూడ‌గ‌ల‌డు. స్ప‌ష్టంగా చూడ‌లేదు. అయినా త‌న వైకల్యం ప‌ట్ల వెంక‌ట్ బాధ ప‌డ‌లేదు. సాధారణ పిల్ల‌ల‌తో అన్నింట్లోనూ పోటీ ప‌డేవాడు. ఈ క్రమంలోనే వెంక‌ట్ మంచి ఉప‌న్యాస‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్న‌ప్ప‌టి నుంచే అత‌నికి టాకింగ్ ప‌వ‌ర్ ఎక్కువ‌గా ఉండేది. దీంతో త‌మిళ‌నాడు వ్యాప్తంగా అత‌ను ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు. అది కూడా వ్య‌క్తిత్వ వికాసంపై అత‌ను ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 150కి పైగానే ఉప‌న్యాసాలు ఇచ్చాడు. అందుకు గాను అత‌ను 30 అవార్డుల‌కు పైగానే అందుకోవ‌డం విశేషం.

అయితే వెంక‌ట్ కేవ‌లం ఉప‌స్యాసాలు ఇవ్వ‌డంలోనే కాదు, ఇత‌ర అంశాల్లోనూ ప్ర‌తిభ చూపేవాడు. అత‌ను చిన్న వ‌య‌స్సులోనే త‌న మాతృభాష త‌మిళ్‌తోపాటు ఇంగ్లిష్, సంస్కృతం భాష‌ల్లోనూ అమోఘ‌మైన ప్ర‌తిభ చూపేవాడు. ఆయా భాష‌ల‌లో అవ‌లీల‌గా మాట్లాడ‌డ‌మే కాదు, వాటిలో రాసేవాడు కూడా. మ‌ళ‌యాళం, బ‌డ‌గ అనే భాష‌లు కూడా అత‌నికి తెలుసు. త‌న కన్నా చిన్న పిల్ల‌ల‌కు మంచి క‌థ‌లు కూడా చెప్ప‌డం అల‌వాటు చేసుకున్నాడు. జంతువు, వాహ‌నాలు, మ‌నుషులను పోలిన గొంతుల‌ను మిమిక్రీ ద్వారా అనుక‌రించేవాడు. కీబోర్డ్ ప్లే చేయ‌డం కూడా నేర్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వెంక‌ట్ గురించి తెలుసుకున్న అప్ప‌టి మాజీ రాష్ట్ర‌ప‌తి, స్వ‌ర్గీయ అబ్దుల్ క‌లాం కూడా వెంక‌ట్‌తో చెన్నైలో కొంత సేపు గ‌డిపారు. భార‌త ప్ర‌ధాని మోడీ కూడా ఈ మ‌ధ్యే వెంక‌ట్‌ను క‌లిసి అత‌ని ప్ర‌తిభ‌కు మెచ్చుకున్నారు. ఇప్పుడ‌త‌ని వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలైనా… అతను చూపుతున్న ప్ర‌తిభ‌లో మాత్రం చాలా పెద్ద‌వాడే. వెంక‌ట్ ఇంకా ఇలాంటి ఎన్నో అంశాల‌లో రాణించి, ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top