చిన్నప్పుడు రెండు కాళ్లు కోల్పోయిన లారీ డ్రైవ‌ర్ కొడుకు.. గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి తెలియ‌ని వారుండ‌రు. నిరుద్యోగ అభ్య‌ర్థులైతే ఆ కంపెనీలో జాబ్ చేయాల‌ని ఎంతో త‌హ త‌హ లాడుతుంటారు. అయితే అది వారు అనుకున్నంత సుల‌భం కాదు. అందుకు ఎంత‌గానో శిక్ష‌ణ పొందాల్సి ఉంటుంది. అన్ని సాఫ్ట్‌వేర్ కోర్సుల్లోనూ మెరిక‌ల్లా త‌యారు కావ‌ల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూల్లో క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్పి ఇంట‌ర్వ్యూల‌ను క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత క‌ష్టం కూడా ఆ విద్యార్థికి సులువే అయింది. ఎందుకంటే అత‌ని ప్ర‌తిభ అలాంటిది మ‌రి. పేద కుటుంబంలో జ‌న్మించినా, దుర‌దృష్ట‌వ‌శాత్తూ కాళ్లు కోల్పోయినా నేడు ఓ టాప్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. అత‌నే నాగ న‌రేష్‌.

naresh
నాగ న‌రేష్‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోదావ‌రి న‌ది ఒడ్డున ఉన్న ఓ మారుమూల గ్రామం. తండ్రి లారీ డ్రైవ‌ర్‌. త‌ల్లి గృహిణి. అయిన‌ప్ప‌టికీ వారు న‌రేష్‌ను బాగా చ‌దివించేవారు. ఈ క్ర‌మంలో న‌రేష్ కూడా త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా చ‌దువుల్లో అత్యంత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచే వాడు. అయితే ఓ సారి దుర‌దృష్ట‌వ‌శాత్తూ లారీపై నుంచి కింద ప‌డ‌డంతో అనుకోకుండా అత‌ని రెండు కాళ్లు పోయాయి. అయిన‌ప్ప‌టికీ న‌రేష్ బాధ‌ప‌డలేదు. చ‌దువుకోవాల‌నే నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఐఐటీ జేఈఈ ప‌రీక్ష‌లో ఆలిండియా వైడ్‌గా 992 ర్యాంకును, పీహెచ్‌సీ విభాగంలో 4వ ర్యాంకును సాధించి త‌న సత్తా చాటాడు. అయితే న‌రేష్ త‌న చ‌దువునంతా ప్ర‌భుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే కొన‌సాగించ‌డం విశేషం.

అలా న‌రేష్ ర్యాంకు తెచ్చుకుని మ‌ద్రాస్ ఐఐటీలో కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. ఈ క్ర‌మంలో అత‌నికి అయ్యే ఖ‌ర్చును భ‌రించేందుకు ఓ హాస్పిట‌ల్ ముందుకు వ‌చ్చింది. వారి స‌హాయంతో విద్య‌ను కొన‌సాగించాడు. కాలేజీలో తోటి విద్యార్థులు అత‌నికి ఎల‌క్ట్రానిక్ వీల్ చెయిర్‌ను కొనిచ్చారు. దీంతో అత‌నికి అన్ని చోట్ల‌కు వెళ్లేందుకు సౌక‌ర్యంగా ఉండేది. కాలేజీ అధికారులు అత‌ను మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు ప‌లు ఏర్పాట్ల‌ను కూడా అత‌ని కోసం చేయ‌డం విశేషం. దీంతో అంద‌రి స‌హ‌కారంతో న‌రేష్ ఐఐటీ విద్య‌ను పూర్తి చేసుకున్నాడు. అనంత‌రం అత‌నికి గూగుల్, మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీల నుంచి ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌చ్చాయి. త‌న‌కు కంప్యూట‌ర్ సైన్స్ అంటే ఇష్టం కావ‌డంతో గూగుల్‌లో అత‌ను జాబ్‌లో చేరిపోయాడు. అదీ న‌రేష్ అనే రియ‌ల్ స్టార్ గురించిన స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top