ఆ బాలుడికి పుట్టుక‌తోనే రెండు చేతులు, కాళ్లు లేవు… అయినా ఆ పాఠ్యాంశంలో అత‌ని ప్ర‌తిభ అదుర్స్‌..!

దేవుడి శాప‌మో, మ‌రేదైన కార‌ణ‌మో తెలియ‌దు కానీ, కొంద‌రు పిల్ల‌లు పుట్టుక‌తోనే ఏదో ఒక లోపంతో జ‌న్మిస్తారు. ఆ లోపంతో బాధ‌ప‌డుతూనే జీవితం కొన‌సాగిస్తారు. అలాంటి వారిలో కొంద‌రు మాత్ర‌మే స‌మాజంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం కావాల‌ని ఆశించి ఏదో ఒక అంశంలో ప్రావీణ్య‌త సంపాదించి త‌మ స‌త్తా చాటుతారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ బాలుడి గురించే. అయితే ఆ బాలుడు ఏ రంగంలోనూ అంత చెప్పుకోద‌గ్గ నిపుణుడు కాదు కానీ, అలా అయ్యే సూచ‌న‌లు అత‌నిలో మెండుగా ఉన్నాయి. అవును మ‌రి.

tiyo

ఇండోనేషియా దేశానికి చెందిన టియో శాట్రియోకు పుట్టుక‌తోనే రెండు కాళ్లూ, చేతులూ లేవు. అయినా ఆ పిల్లాడిని త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గానే చూసుకుంటున్నారు. కాగా ఇప్పుడు అత‌నికి 11 సంవ‌త్స‌రాలు. ఇత‌ర పిల్ల‌ల్లాగే రోజుకు స్కూలుకు వెళ్తాడు. చ‌క్క‌గా పాఠాలు నేర్చుకుంటాడు. ఇంటికి వ‌చ్చి కొంత సేపు ఆడుకుని మ‌ళ్లీ చ‌దువుకుంటాడు. ఇదీ ఆ బాలుడి దిన‌చ‌ర్య‌. అయితే అత‌ను రాయ‌డం, ఆడ‌డం ఏం చేసినా నోటితోనే. అవును. పాఠాలు రాసుకోవాలంటే పెన్నును నోటితో ప‌ట్టుకుని చ‌క చ‌కా రాసేస్తాడు. అదే ఆటలైతే ప్లే స్టేష‌న్ ఉందిగా. దాని జాయ్ స్టిక్‌ను నోటితో ఆప‌రేట్ చేస్తూనే త‌న‌కు న‌చ్చిన ఆటలు ఆడ‌తాడు.

కాగా టియో గురించిన చెప్పుకోద‌గిన విశేష‌మేమిటంటే అత‌ను 2వ త‌ర‌గ‌తిలో ఉన్నా 4వ త‌ర‌గ‌తికి చెందిన లెక్క‌ల‌ను అల‌వోక‌గా చేసేస్తాడు. అవును, నిజ‌మే. అత‌నికి గ‌ణిత‌మంటే ఎంతో ఆస‌క్తి. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రులు కూడా అత‌న్ని ఆ దిశ‌గా ప్రోత్స‌హిస్తున్నారు. ఏదో ఒక రోజు టియో బాగా చ‌దువుకుని ఎంతో గొప్ప‌వాడ‌వుతాడ‌ని, అత‌ని లోపాలు అత‌న్ని ఏమీ చేయ‌లేవ‌ని త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కం. టియోను చూస్తుంటే వారి న‌మ్మ‌కం నిజ‌మ‌య్యే రోజు క‌చ్చితంగా వ‌స్తుంద‌ని అనిపిస్తుంది క‌దూ! ఆల్ ది బెస్ట్ టియో!

టియోకు సంబంధించిన వీడియోను కింద వీక్షించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top