రూ.5వేల కన్నా ఎక్కువ మొత్తంలో పాత నోట్ల‌ను ఇక‌పై అంత ఈజీగా బ్యాంకులో వేయ‌లేరు..!

మీ ద‌గ్గ‌ర రూ.5వేల క‌న్నా ఎక్కువ ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్ల‌ను బ్యాంకులో ఇంకా వేసుకోలేదా..? రేపో, మాపో లేదంటే… మోడీ చెప్పిన‌ట్టుగా డిసెంబ‌ర్ 30 లోపు బ్యాంకులో వేసుకుందామ‌ని ఆగారా..? అయితే… మీకు… ఇప్పుడు క‌ష్ట‌కాల‌మే వ‌చ్చిందని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే… న‌వంబ‌ర్ 8న నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆర్‌బీఐ అధికారులు రోజుకో కొత్త నిబంధ‌న‌ను చెబుతూ వచ్చారుగా, ఇప్పుడు కూడా అలాంటిదే ఓ కొత్త రూల్‌తో జ‌నాల‌కు కంగారు పుట్టిస్తున్నారు. అదేమిటంటే… మీ వ‌ద్ద రూ.5వేల క‌న్నా ఎక్కువ మొత్తంలో రూ.500, రూ.1000 నోట్లు ఉంటే గ‌న‌క వాటిని ఇక‌పై ఒకేసారి డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక‌సారి దాటాక మ‌ళ్లీ రూ.5వేల క‌న్నా ఎక్కువ మొత్తంలో డ‌బ్బును డిపాజిట్ చేస్తామంటే కుద‌ర‌దు. లెక్క‌లు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు అధికారుల‌కు స‌రైన వివ‌ర‌ణ ఇచ్చాక‌, కేవైసీ అన్నీ స‌మ‌ర్పించాక‌, వారికి సంతృప్తిక‌రంగా స‌మాధానం వినిపిస్తేనే… అప్పుడు ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసుకునేందుకు అనుమ‌తినిస్తారు.

deposits-problems

అయితే రూ.5వేల క‌న్నా ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి వేస్తున్నా అప్పుడు కూడా బ్యాంక్ అధికారుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే. స‌ద‌రు డ‌బ్బు ఎలా వ‌చ్చిందో చెప్ప‌క‌పోతే అస‌లు ఆ ఒక్క‌సారికి కూడా అనుమ‌తినివ్వ‌రు. ఆర్‌బీఐ ఈ రూల్‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. మ‌రో 10 రోజుల పాటు అంటే డిసెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఈ రూల్ అమ‌లులో ఉంటుంది. ఆ త‌రువాత ఏం చేస్తార‌నే దానిపై స‌మాచారం లేదు. కానీ ఇప్ప‌టికైతే రూ.5వేల పైబ‌డి ఉన్న బ్యాంక్ డిపాజిట్ల‌కు ఈ రూల్ వ‌ర్తిస్తుంది. అయితే ఏ వ్య‌క్తి అయినా రూ.5వేల లోపు డ‌బ్బును ఎంతైనా బ్యాంకులో వేసుకోవ‌చ్చు. దానికి ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ఎవ‌రైతే డ‌బ్బును బ్యాంకులో వేస్తున్నారో అత‌ని అకౌంట్‌లో అత‌నే స్వ‌యంగా డ‌బ్బులు వేసుకోవాలి. ఇత‌రులు వేసుకునేందుకు కుద‌ర్దు. ఒరిజిన‌ల్ ఖాతాదారుని ఆథ‌రైజేష‌న్ చూపిస్తే థ‌ర్డ్ పార్టీ వ్య‌క్తులు ఎవ‌రైనా ఇత‌రుల బ్యాంక్ అకౌంట్ల‌లో డ‌బ్బు వేయ‌వ‌చ్చు. అయితే ఒరిజిన‌ల్ ఖాతాదారుడు త‌న అకౌంట్‌లోనే రూ.5వేల క‌న్నా త‌క్కువ మొత్తంలో డబ్బులు వేసుకోవాల‌నుకుంటే అందుకు కూడా బ్యాంకుకు స‌రైన ఐడీ ప్రూఫ్ చూపించాలి. అప్పుడు డిపాజిట్ సాధ్య‌మ‌వుతుంది.

పైన చెప్పిన రూల్స్ అన్నీ డిసెంబ‌ర్ 19వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దుతో అవ‌స్థ‌లు ప‌డుతున్న సామాన్య ప్ర‌జానీకం మ‌రిన్ని ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ఈ 10 రోజుల్లో జ‌నాల ఇబ్బందులు ఎన్ని పెరుగుతాయో మాటల్లో చెప్ప‌లేం. కానీ న‌ల్ల‌బాబుల‌కు మాత్రం ఇవేవీ వ‌ర్తించ‌వు క‌దా. ఎందుకంటే ఇప్ప‌టికే చాలా మంది అక్ర‌మ మార్గంలో త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల ధ‌నాన్ని తెల్ల‌ధనంగా మార్చేసుకున్నారు క‌దా. అందుకు సంబంధించిన ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నాల‌ను మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తూనే వ‌చ్చాం. అయితే ఆర్‌బీఐ ఇప్పుడు తెచ్చిన కొత్త రూల్స్‌తో ఇంకా ఎంద‌రు న‌ల్ల‌బాబులు బ‌య‌టికి వ‌స్తారో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top