దొంగ‌ను షూట్ చేసిన ఢిల్లీ పోలీసులు…హాస్పిట‌ల్‌లో చేర్పించి ర‌క్తం ఇచ్చి కాపాడారు..!

అవును మ‌రి, పోలీస్ అన్నాక డ్యూటీ చేయాల్సిందే. క్రిమిన‌ల్స్ ప‌ని ప‌ట్టాల్సిందే. శాంతి భ‌ద్ర‌త‌లను, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిందే. అది వారి డ్యూటీ. క‌ర్త‌వ్యం. అందుకే వారిని ర‌క్ష‌క‌భ‌టులు అన్నారు. ఎవరికీ లేని కొట్టే అధికారాన్ని రాజ్యాంగం వారికి క‌ల్పించింది. అయితే ఢిల్లీలోని ఆ ప్రాంతానికి చెందిన పోలీసులు మాత్రం అంత క‌న్నా ఎక్కువే చేశారు. దొంగ‌ల బారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించారు. ఆ క్ర‌మంలో త‌మ వ‌ల్ల గాయ‌ప‌డిన దొంగ‌ల‌ను తిరిగి తామే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి, అవ‌స‌రం ప‌డితే వారికి రక్తం ఇచ్చి మాన‌వ‌త్వం చాటుకున్నారు. మొద‌ట పోలీస్ డ్యూటీ, ఆ త‌రువాత మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషి డ్యూటీ వారు చేశారు. దీంతో ఆ పోలీసు సిబ్బంది అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

అది దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 9 ప్రాంతం. అక్క‌డే ఉంది అహింసా విహార్ అపార్ట్‌మెంట్‌. అందులో ఇటీవ‌లే నితిన్‌, స‌ల్మాన్ అనే పేరున్న ఇద్ద‌రు దొంగ‌లు దొంగ‌త‌నానికి య‌త్నించారు. అందులో భాగంగా రాత్రి పూట వారు అపార్ట్‌మెంట్‌లోకి చొర‌బ‌డేందుకు య‌త్నిస్తుండ‌గా అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది వారిని చూశారు. అందులో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రామాశ్రేసింగ్‌, హెడ్ కానిస్టేబుల్ రాజేష్ కుమార్‌, కానిస్టేబుల్ అశోక్‌లు ఉన్నారు. వారు ముగ్గురూ నితిన్‌, స‌ల్మాన్‌ల‌ను వెంబ‌డించారు. దీంతో నితిన్‌, స‌ల్మాన్ ఇద్ద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న గ‌న్‌ల‌తో ఫైరింగ్ ప్రారంభించారు. దీన్ని చూసిన రామాశ్రేసింగ్‌, రాజేష్ కుమార్‌, అశోక్‌లు కూడా త‌మ స‌ర్వీస్ రివ్వాల్వ‌ర్లతో వారిపైకి కాల్పులు జ‌రిపారు. ఈ క్ర‌మంలో నితిన్ శ‌రీరంలోకి 5 బుల్లెట్లు దూసుకెళ్లాయి. 4 బుల్లెట్లు అత‌ని చేతులు, కాళ్ల నుంచి దూసుకెళ్ల‌గా ఒక బుల్లెట్ వీపులో తాకింది. దీంతో నితిన్ అక్క‌డే కుప్ప‌కూలాడు. అయితే చీక‌టిగా ఉండ‌డంతో స‌ల్మాన్ త‌ప్పించుకున్నాడు.

కాగా గాయ‌ప‌డ్డ నితిన్‌ను రాజేష్ కుమార్‌, అశోక్‌లు స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే నితిన్ బ‌తికేందుకు 3 నుంచి 4 యూనిట్ల ర‌క్తం అవ‌సరం ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌గా అప్పుడే అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న సీఐ ఎస్ఎస్ రాఠీ వెంట‌నే త‌న ర‌క్తం ఇచ్చాడు. ఆ త‌రువాత రాజేష్ కుమార్‌, అశోక్‌లు కూడా ర‌క్తం ఇచ్చారు. దీంతో పోలీస‌లు చేసిన ప‌నిని అంద‌రూ అభినందించారు. ఓవైపు దొంగ‌త‌నం బారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డ‌మే కాదు, త‌మ వ‌ల్ల గాయ‌ప‌డిన దొంగ‌కు ర‌క్తం ఇచ్చి వారు మాన‌వ‌త‌ను చాటుకున్నారు. అవును మ‌రి, పోలీసులుగా డ్యూటీ చేశారు, మాన‌వ‌త్వం ఉన్న మ‌నుషులుగా ర‌క్తం ఇచ్చి దొంగ‌ను కాపాడారు..!

Comments

comments

Share this post

scroll to top