ద‌స‌రా నాడు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి? జ‌మ్మి ఆకుతో ఆలింగ‌నాలెందుకు?

చెడుపై మంచి సాధించిన విజ‌య‌మే ద‌స‌రా ! ముఖ్యంగా తెలంగాణ లో అతిపెద్ద పండుగ ద‌స‌రా. అభ్యంగ‌ స్నానాలు, ఆయుధ‌పూజ‌లు, జ‌మ్మి తో అలాయ్ బ‌లాయ్ లు, పాల‌పిట్ట ద‌ర్శ‌నాలు, కొత్త ప‌నుల ప్రారంభాలు ఇవ‌న్నీ ద‌స‌రా పండుగ‌నాడు చేయడం శుభ‌సూచికంగా భావిస్తుంటారు. ఇలా మ‌న ప్ర‌తి సాంప్ర‌దాయం వెనుక ఓ కార‌ణం , ఓ ఐతిహ్యం ఉంటుంది.ఇప్పుడు అదేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

ద‌స‌రా నాడు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి?: పూర్వం పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని త‌మ రాజ్యానికి తిరిగి వస్తుండగా దారి మ‌ద్యలో వారికి ఓ పాలపిట్ట కనిపించిందంట..అలా ఆ పాల‌పిట్ట‌ను చూసింది మొద‌లు వారికి అన్నీ జయాలే క‌లిగాయ‌ట ! అలా పండుగ నాడు పాల‌పిట్ట‌ను చూడ‌డం శుభ‌ప్ర‌దం అనే న‌మ్మ‌కం క్ర‌మంగా కొన‌సాగుతూ వ‌చ్చింది, మొద‌ట్లో పురుషులు మాత్ర‌మే అడ‌విలోకి వెళ్ళి పాల‌పిట్టను చూసి వ‌చ్చేవార‌ట‌…క్ర‌మంగా ఇప్పుడు అంద‌రూ పాల‌పిట్ట ద‌ర్శ‌నానికి వెళుతున్నారు.!అంత‌టి విశిష్ట‌త క‌లిగిన పాల‌పిట్ట.. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా కూడ గుర్తించ‌బ‌డింది.

జ‌మ్మి ఆకుతో ఆలింగ‌నాలెందుకు?: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ శ్రీరామస్య ప్రియదర్శినీం శమీ శమయతే పాపం శమీ కంటకలోహితా ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ అని శ్లోకం క‌ల‌దు …దీని అర్థం- శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి కౌరవులపై విజయం సాధించారు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది న‌మ్మ‌కం. అందుకే త‌మ ఆత్మీయుల‌కు స‌దా జ‌యాలే క‌ల‌గాల‌ని ద‌స‌రా నాడు జ‌మ్మి ఆకుల‌ను అందించి వారి ఆశీర్వాదం పొందుతారు.

ద‌స‌రా నేప‌థ్యం: పూర్వం మ‌హిషాసురుడు ( దున్న‌పోతు త‌ల క‌ల‌వాడు ) అనే రాక్ష‌సుడు జ‌నాల‌ను బాగా పీడించేవాడు. దీంతో దేవ‌త‌లంద‌రూ క‌లిసి ఆ రాక్ష‌సుడిని సంహ‌రించ‌డం కోసం దుర్గా దేవిని వేడుకుంటారు. అయితే దుర్గా దేవిని చూసిన మ‌హిషాసురుడు ఆమె అందానికి ముగ్దుడై ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని కోరతాడు.దానికి దుర్గా దేవి త‌న‌తో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని ష‌ర‌తు పెడుతుంది. దీంతో మ‌హిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు సాగుతుంది. చివ‌ర‌కు 9వ రోజున దుర్గాదేవి మ‌హిషాసురుడి త‌ల న‌రుకుతుంది. దీంతో ప్ర‌జ‌లు సంబురాలు చేసుకుంటారు. ఆ 9 వ రోజునే మ‌నం ద‌స‌రా అని జ‌రుపుకుంటాం.!

 

Comments

comments

Share this post

scroll to top