పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించాలనుకుందే ఏమో.. ఉన్నట్టుండి ఓ మొసలి గోదావరి పుష్కరాల్లో కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద ప్రత్యక్షమైంది దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మొసలిని పట్టుకున్నారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు భక్తులు.
మరోవైపు భాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి పరిస్థితి దయనీయంగా మారుతోంది. పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజుతో పోల్చుకుంటే క్రమంగా గోదావరిలో నీటి మట్టం తగ్గుతోంది. పైభాగంలోని శ్రీరాంసాగర్లో నీటి విడుదల కొనసాగుతుండటంతో దాని ప్రభావం గోదావరిపై పడుతోందని సమాచారం. పుష్కర ఘాట్ల వద్ద నీరు ఎక్కువగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఘాట్లను వదిలి ఖాళీ ప్రదాశాలలోకి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు. గోదావరి ఒడ్డును బురద నీటిలోను సైతం స్నానాలు చేస్తుండటం గమనార్హం.