వ‌ర‌ద‌ల నుంచి కాపాడినందుకు కృత‌జ్ఞ‌త‌గా ఆ వ్య‌క్తి పేరును త‌మ పాప‌కు పెట్టుకున్నారు ఆ దంప‌తులు..!

మ‌తాలు, కులాలు అనేవి నిజానికి మ‌నిషి సృష్టించుకున్న‌వి. అంతేకానీ దేవుడు వాటిని సృష్టించ‌లేదు. కాబ‌ట్టి మ‌తం, కులంతో సంబంధం లేకుండా తోటి మ‌నుషుల‌కు స‌హాయం చేయ‌మ‌నే ఎవ‌రైనా చెబుతారు. ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా అలాగే అనుకున్నాడు. క‌నుక‌నే ఇద్ద‌రు దంప‌తుల‌కు స‌హాయం చేశాడు. వ‌ర‌ద‌ల్లో ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ఉన్న‌వారిని అత‌ను కాపాడాడు. అత‌ను కాపాడిన దంప‌తుల్లో మ‌హిళ నిండు గ‌ర్భిణి. ఈ క్ర‌మంలో అత‌ను వారిని కాపాడ‌డంతోపాటు ఆ మ‌హిళ‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించాడు. దీంతో ఆ మ‌హిళ ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ దంప‌తులు త‌మ‌ను కాపాడిన ఆ వ్య‌క్తికి ఏ విధంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారో తెలుసా..?

2015లో త‌మిళ‌నాడు రాష్ట్రం చెన్నైలో వ‌ర‌ద‌లు వ‌చ్చి జ‌న‌జీవ‌నం స్తంభించిపోయిన విష‌యం తెలిసిందే. అనేక చోట్ల నీరు వ‌ర‌ద‌లా వ‌చ్చే స‌రికి చాలా మంది ఆ నీటిలో చిక్కుకున్నారు. నగరంలోని ఉరప్పాకం ప్రాంతంలో నివాసం ఉండే మోహన్, అతడి భార్య చిత్ర కూడా ఆ వరదల్లో చిక్కుకున్నారు. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి తన మిత్రబృందంతో ఓ పడవ వేసుకొని వచ్చిన యూనస్ అనే ముస్లిం యువకుడు వీరిద్దరినీ చూసి ప్రాణాలకు తెగించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఆ సమయంలో చిత్ర నిండు గర్భిణిగా ఉంది. కాగా వరద తీవ్ర స్థాయిలో ఉండ‌డంతోపాటు చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనూ కరెంట్‌ లేదు. ఈ క్రమంలో నాలుగు గంటల పాటు కష్టపడి మోహన్‌తో కలిసి పెరుంగలతూర్‌లోని ఓ ఆసుపత్రిలో చిత్రను చేర్పించాడు యూనస్‌.

కాగా ఆసుపత్రిలో రెండు రోజుల పాటు కొట్టుమిట్టాడిన చిత్ర‌ చివరకు ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తమ ప్రాణాలను కాపాడిన యూనస్‌కు కృతజ్ఞతగా తమ బిడ్డకు యూనస్‌ అన్న పేరు పెట్టుకున్నారు చిత్ర, మోహన్‌ దంపతులు. వారు హిందువులు, ఆ పేరు ముస్లింది. అయినప్ప‌టికీ త‌మకు స‌హాయం చేసిన వ్య‌క్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ తాము ఆ పేరును త‌మ పాప‌కు పెట్టామ‌ని వారు చెబుతున్నారు. అయితే ఈ విష‌యం తెలిసిన యూన‌స్ ఏమంటున్నాడో తెలుసా..? ఒక మనిషికి సాయం చేయాలన్న ఆలోచనే ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకెళుతుంది అంటున్నాడు. అవును మ‌రి, అలాంటి ఆలోచ‌న ఉంటే చాలు, ఎవ‌రికైనా చేత‌నైనంత స‌హాయం చేసేందుకు దేవుడు దారి చూపుతాడు. అది అక్ష‌ర స‌త్యం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top