పాల‌కుల పాపాలు..లెక్క‌లేన‌న్ని కోట్లు

దేశానికి విముక్తి ల‌భించి 70 ఏళ్లు గ‌డిచినా అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న‌ది. ప్ర‌పంచంలో జ‌నాభా ప‌రంగా రెండ‌వ స్థానంలో ఉన్నా ..త‌రాలు గ‌డిచినా స‌గానికి పైగా జ‌నం ఆక‌లి కేక‌ల‌తో అల్లాడుతున్నారు. తాగేందుకు, సాగు చేసేందుకు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ల‌క్ష‌లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా..నేటికీ భ‌ర్తీ చేయలేక పోయాయి. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక కాలం దేశాన్ని ఏలింది. జ‌న‌తా పార్టీ, యుపీఏ, ఎన్టీఏ సంకీర్ణ ప్ర‌భుత్వాలు పాలించినా పాల‌న‌లో మార్పు రాలేదు. పాల‌కులు కాసుల‌ను కొల్ల‌గొట్ట‌డంలో ముందంజ‌లో ఉన్నారు. లెక్క‌లేన‌న్ని స్కాంలు, ప్ర‌భుత్వ బ్యాంకులు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్య‌మై పోయాయి. బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

పాల‌కుల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన న్యాయ వ్య‌వ‌స్థ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఓటు బ్యాంకుగా మార్చ‌డంతో రాజ‌కీయ నాయ‌కుల ఆట‌లు సాగుతున్నాయి. ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప్ర‌తిసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవాల‌ని కోట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఎన్నిక‌లై పోయాక జ‌నాన్ని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. లెక్క‌లేన‌న్ని నోట్ల క‌ట్ట‌లు క‌ట్ట‌ల కొద్దీ దొరుకుతున్నాయి. వాటిని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారే త‌ప్పా ..త‌ప్పు చేసిన వారికి శిక్ష ప‌డ‌టం లేదు. దీంతో త‌మ‌కేమీ లేద‌న్న ధీమాతో నిస్సిగ్గుగా కోట్లు త‌ర‌లిస్తున్నారు. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తున్నా లీడ‌ర్లు త‌మ బుద్ధిని మార్చు కోవడం లేదు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగి పోతోంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎక్క‌డ చూసినా మ‌ద్యం, డ‌బ్బులు ఏరులై పారుతున్నాయి.

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌దిత‌ర ప్రాంతాల్లో అత్య‌ధికంగా కోట్లు దొరుకుతున్నాయి. బ‌స్సుల్లో, రైళ్ల‌ల్లో, ఎయిర్‌పోర్టుల‌లో , చెక్ పోస్టుల ద‌గ్గ‌ర ఈజీగా ప‌ట్టుప‌డుతున్నాయి. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి త‌ర‌లిస్తున్నారో..ఎవ‌రు దీని వెనుక వుండి పంపిస్తున్నారో..ఎవ‌రు దీనికి సూత్ర‌దారులో తెలుసు కోవ‌డంలో పోలీసులు , ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు ప‌సిగ‌ట్ట‌లేక పోతున్నాయి. ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఎన్నిక‌ల్లో నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డిపోతున్నాయి. ఏకంగా 1,582 కోట్ల న‌గ‌దు, మ‌ద్యం వివిధ ప్రాంతాల‌లో దేశ వ్యాప్తంగా సీజ్ చేసిన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ప‌ట్టుబ‌డిన న‌గ‌దులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో నిలిచింది. 21.23 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. మొద‌టి ద‌శ‌లో ఇంత భారీ మొత్తంలో ప‌ట్టుబ‌డితే చివ‌రి విడ‌త పోలింగ్ మే 19 వ‌ర‌కు ఇంకెంత న‌గ‌దు, మ‌ద్యం ప‌ట్టుబ‌డుతుందో త‌లుచుకుంటేనే భ‌యం వేస్తోంది.

తెలంగాణ‌లో సైతం లెక్క‌లేన‌న్ని నోట్లు ప‌ట్టుబ‌డుతున్నాయి. బంజారా హిల్స్‌లో 3.59 కోట్లు సీజ్ చేశారు. హ‌బ్సిగూడ‌లో మ‌రో 49 ల‌క్ష‌లు ప‌ట్టుకున్నారు. త‌మిళ‌నాడులో ఆర్టీసీ బ‌స్సులో త‌ర‌లిస్తుండ‌గా పోలీసులుకు 3 కోట్ల 47 ల‌క్ష‌లు దొరికాయి. 377 కోట్ల న‌గ‌దు సీజ్ చేస్తే..ప‌ట్టుకున్న మ‌ద్యం విలువ 157 కోట్లు, మాద‌క ద్ర‌వ్యాలు 708 కోట్లు, బంగారం, వెండి విలువ 312 కోట్లుగా పేర్కొంది. రాష్ట్రాల వారీగా చూస్తే త‌మిళ‌నాడు రాష్ట్రంలో 127.84 కోట్లు, ఏపీలో 95.79 కోట్లు, మ‌హారాష్ట్ర‌లో 26.69 కోట్లు, యుపీలో 24.11 కోట్లు, క‌ర్ణాట‌క‌లో 31.92 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. గుజ‌రాత్‌లో 500 కోట్ల విలువ చేసే మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. పంజాబ్‌లో 116 కోట్లు, మ‌ణిపూర్‌లో 27.13 కోట్లు, త‌మిళ‌నాడులో బంగారం, వెండి 135 .6 కోట్లు, యుపీలో 60.29 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. కేసులు న‌మోదు చేశార‌ని, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారు, నోట్ల క‌ట్ట‌ల‌ను త‌ర‌లించే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది.

Comments

comments

Share this post

scroll to top