క‌లెక్ట‌ర్ డ్రైవ‌ర్ గా  మారాడు… త‌న డ్రైవ‌ర్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికాడు..!

అది ఓ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం. రోజులాగే అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగులు త‌మ త‌మ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇంత‌లో ఆ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లోకి ఓ కారు వ‌చ్చి ఆగింది. అందులోంచి దిగాడు ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌. వెంట‌నే కార్ వెనుక డోర్ తీసి అందులో కూర్చున్న వ్య‌క్తిని సాదరంగా లోప‌లికి ఆహ్వానించాడు. ఇదంతా చూస్తున్న కలెక్ట‌ర్ కార్యాల‌య ఉద్యోగులు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే… కారు వెనుక డోర్ నుంచి దిగింది ఎవ‌రో కాదు, నిత్యం ఆ క‌లెక్ట‌ర్‌కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తే. అందుకే ఆ ఉద్యోగుల‌కు ఒక్క‌సారిగా ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. తీరా విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం వారి వంత‌వైంది. ఇంత‌కీ ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ఎందుక‌లా చేశారు..?

akola-driver

అది మ‌హారాష్ట్ర‌లోని అకోలా జిల్లా. ఆ జిల్లాకు మెజిస్ట్రేట్ (క‌లెక్ట‌ర్‌)గా విధులు నిర్వ‌హిస్తున్నాడు జి.శ్రీ‌కాంత్‌. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే డ్రైవ‌ర్ దిగంబ‌ర్ థ‌క్ మ‌రికొద్ది రోజుల్లో రిటైర్ అవుతున్నాడు. అయితే అందులో విశేష‌మేముందీ అంటారా..? అవును, దిగంబ‌ర్ థ‌క్ గురించి చెప్పుకోవాలంటే విశేష‌మే ఉంది. ఎందుకంటే అత‌ను గ‌త 20 సంవ‌త్స‌రాలకు పైనే డ్రైవ‌ర్‌గా ఆ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో దాదాపుగా 18 మంది క‌లెక్ట‌ర్ల వ‌ద్ద అత‌ను ప‌నిచేశాడు. అయితే త‌న స‌ర్వీస్‌లో దిగంబ‌ర్ థ‌క్ ఒక చిన్న యాక్సిడెంట్‌ను కూడా చేయ‌లేదు. అంత ప‌క్కాగా డ్రైవింగ్ చేశాడు మరి.

అయితే దిగంబ‌ర్ థ‌క్ గురించిన అస‌లు విష‌యం తెలుసుకున్న ఆ క‌లెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని భావించారు. అందులో భాగంగానే అత‌ను న‌డిపే కారును పెళ్లి కారులా ముస్తాబు చేయించాడు. అంతేకాదు, దిగంబ‌ర్ థ‌క్‌ను కారు వెన‌క సీట్లో కూర్చోబెట్టి, క‌లెక్ట‌ర్ శ్రీ‌కాంత్ తానే స్వయంగా కారు న‌డుపుకుంటూ అత‌న్ని క‌లెక్ట‌ర్ కార్యాలయం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చాడు. దీంతో అక్క‌డి ఉద్యోగులు మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయినా త‌రువాత విష‌యం తెలిసి దిగంబ‌ర్ థ‌క్‌కు వారు కూడా వీడ్కోలు చెప్పారు. అంతే క‌దా మ‌రి. ఏ రంగంలోనైనా ఏ మ‌చ్చా లేకుండా ప‌నిచేస్తే చివ‌రికి ఎవ‌రికైనా అలాంటి ఘ‌న‌మైన వీడ్కోలే ద‌క్కుతుంది..!

Comments

comments

Share this post

scroll to top