రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మ‌ధ్య ముదురుతున్న నెట్ స్పీడ్ వివాదం.!?

రిల‌య‌న్స్ జియో..! వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చినప్ప‌టి నుంచి ఈ కంపెనీ అన్నీ సంచ‌నాల‌నే సృష్టిస్తోంది. ఉచిత డేటా, కాల్స్‌, ఎస్ఎంఎస్ ఆఫ‌ర్ తో దేశ‌మంతా ఉన్న మొబైల్ వినియోగ‌దారుల‌ను త‌న వైపుకు తిప్పుకుంది. దీంతో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు, దీనికి మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది. అయితే జియోకు కేవ‌లం ఎయిర్‌టెల్ మాత్ర‌మే ఆ రేంజ్‌లో పోటీ ఇచ్చింది. మిగ‌తావి అంత‌గా ముందుకు రాలేద‌నే చెప్ప‌వచ్చు. అయితే జియో, ఎయిర్‌టెల్ ల మ‌ధ్య పోటీ మొద‌ట్నుంచీ ఉంది. ఇప్పుడిది కాదు. కానీ… ఆ రెండింటి మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే దాకా తీవ్ర స్థాయిలో వివాదాలు న‌డుస్తున్నాయి. రెండింటికీ న‌డుమ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అదీ డేటా స్పీడ్ విషయంలో..!

ఓక్లా అనే సంస్థ తెలుసుగా. యూజ‌ర్లు వాడే బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ ఇంట‌ర్నెట్ ఎంత స్పీడ్ వ‌స్తుందో చెబుతుంది ఈ సైట్‌. దీనికి చెందిన ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. అయితే ఈ సంస్థ ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అదేమిటంటే… దేశంలో కేవ‌లం ఎయిర్‌టెల్ మాత్ర‌మే వేగవంత‌మైన మొబైల్ నెట్‌వ‌ర్క్ డేటాను, ఇంట‌ర్నెట్‌ను అందిస్తుంద‌ని ఈ సంస్థ చెప్పింది. అలా ఎందుకు చెప్పిందంటే… వినియోగ‌దారులు త‌మ త‌మ డివైస్‌ల‌లో నెట్ స్పీడ్ ఎంత వ‌స్తుందో ఈ సంస్థ‌కు చెందిన యాప్ ద్వారా చెక్ చేస్తారు క‌దా. అప్పుడు ఆ సంస్థ అలాంటి వివ‌రాల‌న్నింటినీ సేక‌రించింది. ఈ క్ర‌మంలో ఆ వివ‌రాల‌ను అన్నింటినీ విశ్లేషించి పై విధంగా ప్ర‌క‌ట‌న చేసింద‌ట‌. దీంతో జియోకు ఎక్క‌డో కాలింది..! వెంట‌నే ఎయిర్‌టెల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని Advertising Standards Council of India (ASCI) కి ఫిర్యాదు చేసింది.

వేగవంత‌మైన మొబైల్ ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్నామంటూ ఎయిర్‌టెల్ ప్రచారం చేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని, ఓక్లా అనే సంస్థ త‌ప్పుడు రిపోర్టుల‌తో ఎయిర్‌టెల్‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేవిధంగా తప్పుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని జియో ఆస్కి కి ఇచ్చిన కంప్లెయింట్‌లో తెలియజేసింది. భార‌త్‌లో మొబైల్ ఫోన్ వినియోగ‌దారులు చాలా మంది ఉప‌యోగిస్తున్న‌వి డ్యుయ‌ల్ సిమ్ ఫోన్ల‌ని, అలాంటి సిమ్‌ల‌లో జియోను రెండో సిమ్‌గా చాలా మంది వేసుకుని వాడుకుంటున్నార‌ని, ఆ ఫోన్ల‌లో ఓక్లా స్పీడ్ టెస్ట్ యాప్‌తో నెట్ స్పీడ్ చెక్ చేస్తే స‌హ‌జంగానే మొదటి సిమ్ కే అది రిపోర్ట్ చూపిస్తుంద‌ని, అప్పుడు మొద‌టి సిమ్‌లో ఉండే ఎయిర్‌టెల్‌కే ఆ రిపోర్టు అనుకూలంగా ఉంటుంద‌ని, అలాంట‌ప్పుడు ఆ కంపెనీని వేగవంత‌మైన మొబైల్ ఇంట‌ర్నెట్ ను అందిస్తున్న కంపెనీగా ఎలా ప్ర‌కటిస్తార‌ని జియో ప్ర‌శ్నించింది. దీనికి ఓక్లా స్పందిస్తూ… త‌మ రిపోర్టులు అంతా క‌రెక్ట్‌గానే ఉంటాయ‌ని, వాటిని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేద‌ని స‌మ‌ర్థించుకుంటోంది. మ‌రి… ఈ వివాదం ఇంకా ఎంత ముందుకు పోతుందో తెలియ‌దు. అయితే ఒక్క విష‌యం… మీరు గ‌మ‌నించారో లేదో… జియో సిమ్‌ల ద్వారా ఏవైనా కాల్స్ చేస్తే ఇత‌ర నెట్‌వర్క్‌ల‌కు అస‌లు కాల్స్ వెళ్ల‌డం లేదు క‌దా… ఎయిర్‌టెల్‌కు అయితే ఇక అస‌లు కాల్స్ క‌నెక్టే అవ‌డం లేదు..! అదీ… అసలు మ్యాట‌ర్‌… దాని వ‌ల్లే ఇప్పుడీ ర‌చ్చంతా జ‌రుగుతుంది కాబోలు…! ఏది ఏమైనా జియో రాక‌తో మొబైల్ యూజ‌ర్ల‌కు మాత్రం డేటా పండ‌గే పండ‌గ అవుతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top