ప్రజా ప్రతినిధులు అంటే అంతే.. అవును, వారికి ప్రజాధనం గురించి కించిత్ బాధ కూడా ఉండదు. ఎందుకంటే అది వారిది కాదు కదా. కనుక ఇష్టం వచ్చినట్టు ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి సొంత జేబులోంచి తీసేది కాదు కనుక ఇంక వారికి అడ్డు అదుపు ఏం ఉంటుంది చెప్పండి. అందుకే ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడరు. తిండి, బట్ట, విలాసాలు, ప్రయాణాలు… ఇలా వారు ప్రజా ధనాన్ని వృథా చేయని సందర్భం ఉండదు. అయితే తాజాగా ఆ రాష్ట్ర సీఎం కూడా ఇలా ప్రజాధానం ఖర్చు చేయడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ ఆయనెవరో తెలుసా..?
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. ఈయన గతేడాది మార్చి 18న ఉత్తరాఖండ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పదవిలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కానీ వివాదాల్లో చిక్కుకున్నారు. అది కూడా ఖర్చుల విషయంలో. ఈయన ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే అది నిజమేనా అంటే.. అవును, నిజమే. నైనిటాల్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోగా అందుకు అధికారులు సమాధానం ఇచ్చారు.
సదరు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఈ ఏడాది కాలంలో తన ఫలహారాల కోసం ఖర్చు చేసిన మొత్తానికి చెందిన సమాచారాన్ని ఆ కార్యకర్త సేకరించారు. దీంతో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ ఏడాదిలో ఆ సీఎం గారు తన ఫలహారాల కోసం ఏకంగా అరకోటి.. అంటే.. దాదాపుగా రూ.68,59,865 ఖర్చు చేశారట. ఏంటీ షాకింగ్‌గా ఉంది కదా. అవును, అది నిజమే. దీంతో ఈ విషయం తెలిసిన కొందరు సీఎం వృథా ఖర్చు చేస్తున్నారని ఆయన్ను విమర్శించారు. అయితే కొందరు సీఎంను పొగుడుతున్నారు. ఎందుకంటే… త్రివేంద్ర సింగ్ రావత్‌కు సహజంగానే మర్యాద స్వభావం ఎక్కువట. దీంతో ఆయన్ను కలిసేందుకు ఎవరు వచ్చినా వారికి టిఫిన్, కాఫీ, టీ పెట్టి గానీ పంపించరట. దీంతో ఖర్చు అలా పెరిగిపోయిందట. అయినా.. ఎంత మర్యాద చేసినా.. ఇలా ఇంత పెద్ద మొత్తం డబ్బు వృథా చేయడం ఏమీ బాగా లేదు కదా.