అత‌ను ఇంట‌ర్‌లో టాప‌ర్‌. ఇంజినీరింగ్ చ‌దువుకు డ‌బ్బు లేక కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడు.

పేద విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు, వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయాల‌ను ఖ‌ర్చు పెడుతున్నాం అని ప్ర‌భుత్వాలు, నాయ‌కులు చెప్ప‌డం, ఆ మాట‌ల‌ను ఊద‌ర‌గొట్ట‌డం మామూలే. కానీ క్షేత్ర‌స్థాయికి వ‌చ్చి చూస్తేనే తెలుస్తుంది, నిజంగా పేద విద్యార్థులు నేడు చ‌దువు కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ మ‌ట్టిలో మాణిక్యం గురించే. అత‌ను ఈ మ‌ధ్యే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాశాడు. 98.6 శాతం మార్కుల‌ను తెచ్చుకుని టాప్ స్థానంలో నిలిచాడు. అయితే డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఇప్పుడు అత‌నికి ఐఐటీ కోచింగ్ తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ఐఐటీ చ‌దవాల‌నుకున్న అత‌ని కల క‌ల‌గానే మిగ‌ల‌నుంది. అది కాక‌పోయినా క‌నీసం వేరే ఏదైనా ఇంజినీరింగ్ కాలేజీలో చేరుదామ‌న్నా మార్కులు ఉన్నాయి కానీ చ‌దువుకునేందుకు అత‌ని వ‌ద్ద డ‌బ్బు లేదు. దీంతో అస‌లు అత‌ను ఇక ఉన్న‌త చదువులు చ‌దివే ప‌రిస్థితి దాదాపుగా లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆ విద్యార్థి స్పందించే ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూస్తున్నాడు.

అత‌ని పేరు ధ‌వేంద్ర కుమార్‌. చ‌త్తీస్‌గ‌డ్‌లోని బ‌లోద్ జిల్లా లౌండి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తాడు. త‌మ‌కు ఉన్న 2 ఎక‌రాల స్థలంలో అత‌ను కూర‌గాయ‌లు పండిస్తాడు. వాటిని కుటుంబ స‌భ్యులు అంద‌రూ రోడ్డు పక్క‌న అమ్మి డ‌బ్బు సంపాదిస్తారు. అప్పుడ‌ప్పుడు ధ‌వేంద్ర కూడా కూర‌గాయ‌లు అమ్ముతుంటాడు. అయితే ధ‌వేంద్ర అన్న కూడా ఒకప్పుడు టాప‌రే. కానీ డ‌బ్బులు లేక‌పోవ‌డంతో చ‌దువు ఆపేసి తండ్రికి స‌హాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ధ‌వేంద్ర ఆ రాష్ట్ర ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఏకంగా 500 మార్కుల‌కు గాను 493 మార్కులు సాధించి 98.6 శాతంతో టాప‌ర్‌గా నిలిచాడు. అత‌ను టెన్త్‌లో కూడా టాప‌రే. 90 శాతం మార్కుల‌ను అందులో సాధించాడు. అయితే ప్ర‌స్తుతం టాప‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ అత‌ను ఐఐటీ కోచింగ్‌కు దూర‌మయ్యాడు.

ఇంట‌ర్‌లో సాధించిన మార్కుల‌కు గాను జిల్లా విద్యాశాఖ అధికారులు అతనికి ప్రామిస్ చేశారు. అత‌ని ఐఐటీ కోచింగ్‌కు అవ‌స‌ర‌మైన రూ.1.30 ల‌క్ష‌ల‌ను అందిస్తామ‌ని చెప్పారు. దీంతో ధ‌వేంద్ర రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి కోచింగ్ నిమిత్తం వెళ్లాడు. అయితే ఎన్ని రోజుల‌కు అధికారుల నుంచి క‌బురు లేక‌పోవ‌డంతో ఇక అత‌ను చేసేది లేక సొంత గ్రామానికి వ‌చ్చి కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడు. అయితే ఐఐటీ కాక‌పోయినా క‌నీసం రాజ‌స్థాన్ బిట్స్ పిలానీ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుదామ‌న్నా అందుకు త‌గిన ఆర్థిక స్థోమ‌త అత‌ని వ‌ద్ద లేదు. దీంతో అత‌ను ఇక అస‌లు చ‌దువుకునే మార్గం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం త‌న‌కు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని అత‌ను చెబుతున్నాడు. స్పందించే దాత‌ల కోసం చూస్తున్నాడు..!

Comments

comments

Share this post

scroll to top