టెక్ట్స్ బుక్స్… నోట్ బుక్స్… వర్క్ బుక్స్… పెన్నులు, పెన్సిళ్లు, టిఫిన్, వాటర్ బాక్సులు… ఇలా చెప్పుకుంటూ పోతే నేడు స్కూల్ పిల్లలు తమ తమ బ్యాగుల్లో కేజీల కొద్దీ బరువును రోజూ స్కూల్‌కు మోసుకెళ్తున్నారు. ఒకప్పుడు మహా అయితే ఒకటి రెండు పుస్తకాలు, నోట్సులు మాత్రమే తీసుకెళ్లేవారు. కానీ కాలం మారింది కదా… అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగిపోయింది. దీంతో తమ పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారేమోనన్న భావనలో తల్లిదండ్రులు వారి చదువు పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆ పిల్లలు రోజూ చదువుకోసం మోసుకుపోయే పుస్తకాల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ చిన్నారులు నిత్యం ఎంత బరువు మోస్తున్నారో తెలుసా..? 6 కిలోలకు పైనే. అది హై స్కూల్ విద్యార్థులకైతే ఇంకా రెట్టింపు స్థాయిలో 12 కిలోలుగా ఉంది. ఇది మేం చెబుతోంది కాదు, ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలిన నిజమిది.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ చెబుతున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిత్యం కొన్ని కిలోల బరువును స్కూల్‌కు మోసుకెళ్తున్నారట. పైనే చెప్పాం కదా… అంతే స్థాయిలో బరువును వారు నిత్యం మోస్తున్నారు. దీంతో స్కూల్ అయిపోయేసరికి విపరీతంగా అలసిపోతూ ఆపైన అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిసింది. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్‌లోనే పిల్లలు అధిక సమయం ఉంటున్నారట. ఉదయం స్కూల్‌కు వెళితే మళ్లీ సాయంత్రమే వచ్చేది. అప్పుడు కూడా ట్యూషన్లు గట్రా ఉంటుండడంతో పిల్లలకు ఆడుకునేందుకు, తద్వారా శారీరకంగా, మానసికంగా ఉల్లాసం పొందేందుకు కూడా వీలుండడం లేదని సర్వేలో తెలిసింది.
పాఠశాలల్లో క్లాస్ టైమింగ్స్‌ను తగ్గించడంతోపాటు డిజిటల్ రూపంలో క్లాసులను చెబితే దాంతో పిల్లలకు కొంత ఊరట కలిగేందుకు అవకాశం ఉంటుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఏమంటున్నాయంటే… చాలా మంది విద్యార్థులు తమకు అవసరం ఉన్నా, లేకపోయినా, నిత్యం అన్ని పుస్తకాలను, నోట్సులను తీసుకువస్తారని, దీంతో వారి బ్యాగ్ బరువు కూడా పెరుగుతుందని వాదిస్తున్నారు. మరి… ఏదైనా ఒక చిన్న బుక్ తేకపోతేనే స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను దండిస్తారు కదా… ఇక అలాంటప్పుడు పిల్లలు అన్ని బుక్స్‌ను తీసుకెళ్లకుండా ఎలా ఉంటారు..? ఏది ఏమైనా ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్న కిలోల కొద్దీ బరువు మాత్రం వారిపై శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా ప్రభావం చూపుతోందనేది వాస్తవం. ఆ బరువు తగ్గించే దిశగా చర్యలు తీసుకోకపోతే పిల్లలు మరింత కుంగిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది..!