హైద‌రాబాద్ వాసులారా.. ఆటోడ్రైవ‌ర్లు మీట‌ర్ రీడింగ్‌తో మోస‌గించారా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి.

హైదరాబాద్ మాత్ర‌మే కాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా వంటి అన్ని మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో కొంద‌రు ఆటోడ్రైవ‌ర్లు ఎంత హుషారు లెక్క‌లు చేస్తారో అంద‌రికీ తెలిసిందే. మీట‌ర్ వేసిన‌ప్ప‌టికీ దానిపై ఎక్స్‌ట్రా ఇవ్వాల‌ని అంటారు. కుద‌ర‌దు అంటే బెదిరించ‌డానికైనా వెనుకాడ‌రు. ఇది ఒకెత్త‌యితే మీట‌ర్ ట్యాంప‌రింగ్ ఒకెత్తు. ఒక‌ప్పుడంటే అన‌లాగ్ మీట‌ర్లు ఉండేవి. వాటిని ట్యాంపరింగ్ చేసి మోసం చేస్తున్నార‌నే కార‌ణంతో వాటి స్థానంలో డిజిట‌ల్ మీట‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆటో డ్రైవ‌ర్లు య‌థేచ్ఛ‌గా ఆ మీట‌ర్ల‌ను కూడా ట్యాంప‌రింగ్ చేస్తున్నారు. అదెలాగో ఇక్క‌డ చూడండి..!

ఆటోల్లో బిగించే డిజిట‌ల్ మీట‌ర్‌ను ఎలా ట్యాంప‌ర్ చేస్తారో తెలుసుకోవాలంటే ముందుగా అస‌లు ఆ మీట‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసుకోవాలి. అవి ఎలా అంటే… ఆటో ట్రాన్స్‌మిష‌న్‌కు కేబుల్స్‌ను బిగించి వాటిని డిజిట‌ల్ మీట‌ర్‌కు అనుసంధానం చేస్తారు. ఆ కేబుల్స్ ఆటో న‌డిచిన‌ప్పుడు వ‌చ్చే ప‌ల్స్‌ను ప‌సిగ‌ట్టి ఎంత దూరం, ఎంత స‌మ‌యం ప్ర‌యాణం చేసింది మీట‌ర్లో రికార్డు చేస్తాయి. దాని ఆధారంగా ఆటోడ్రైవ‌ర్లు మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుంటారు. అయితే డిజిట‌ల్ మీట‌ర్ల‌ను ఎలా ట్యాంప‌ర్ చేస్తారంటే స‌ద‌రు కేబుల్స్‌కు ఓ స్విచ్‌ను పెడ‌తారు. అది ఆటోడ్రైవ‌ర్ సీటు కింద ఉంటుంది. మ‌న‌కు క‌నిపించ‌దు. ఈ క్ర‌మంలో ఆటోడ్రైవ‌ర్ ఆ స్విచ్ నొక్క‌గానే ప‌ల్స్ రేట్ పెరుగుతుంది. దీంతో స‌హ‌జంగానే ఆటో ఎక్కువ దూరం తిరిగిన‌ట్టు రీడింగ్ న‌మోద‌వుతుంది. ఇలా ఆ మీట‌ర్లు ట్యాంప‌రింగ్ అవుతాయి. అయితే మ‌రో 3 విధాలుగా కూడా ఈ ట్యాంప‌రింగ్ జ‌రుగుతుంది. అది ఎలా అంటే…

1. ఆటో మీట‌ర్‌కు కింద ట్రాన్స్‌మిష‌న్‌కు ఉండే కేబుల్స్‌కు టూ వే స్విచ్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ స్విచ్ ఆటో స్పీడ్‌, అది ప్ర‌యాణించే దూరానికి అనుగుణంగా అప్పుడ‌ప్పుడు ప‌ల్స్ రేట్‌ను పెంచుతుంది. దీంతో మీట‌ర్‌లో ఎక్కువ కిలోమీట‌ర్లు న‌మోదు అవుతాయి. అయితే ఇలాంటి స్విచ్‌ల‌ను అవ‌స‌రం అనుకుంటే వెంట‌నే తీసేయ‌వ‌చ్చు కూడా. ఎవ‌రైనా ఆర్టీవో చెక్ చేస్తాడు అనుకుంటే డ్రైవ‌ర్లు వాటిని తీసేస్తారు.

2. కొన్ని ర‌కాల కెపాసిట‌ర్ల‌ను మీట‌ర్ల‌కు అమ‌ర్చ‌డం వ‌ల్ల కూడా వాటిని ట్యాంప‌ర్ చేస్తారు. దీంతో అవి ఎక్కువ రీడింగ్‌ల‌ను న‌మోదు చేస్తుంటారు. అది 10, 20, 80 శాతం ఎంతైనా కావ‌చ్చు.

3. ఆటో చ‌క్రాల‌ను ప‌లు ఆల్ట‌రేష‌న్ ప‌ద్ధ‌తుల్లో మార్చ‌డం వ‌ల్ల కూడా డిజిట‌ల్ మీట‌ర్ల‌ను ట్యాంప‌ర్ చేస్తారు.

అయితే ఎవ‌రైనా ప్రయాణికుల‌కు తాము ఆటో డ్రైవ‌ర్ల‌చే మోసం చేయ‌బ‌డ్డామ‌ని భావిస్తే, లేదంటే వారు బెదిరింపుల‌ను ఎదుర్కొంటే సుల‌భంగా వారిపై ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే…

040- 27852482 ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబ‌ర్ కు 24 గంట‌ల్లో ఎప్పుడైనా కాల్ చేసి ప్ర‌యాణికులు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. లేదంటే హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు చెందిన అఫిషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీ https://www.facebook.com/HYDTP కి వెళ్లి మెసేజ్ చేయ‌వ‌చ్చు. అది కూడా వీలు కాద‌నుకుంటే మరిన్ని వివ‌రాల‌కు http://www.htp.gov.in/ సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top