మాట జారితే చాలా అనర్థాలు వచ్చి పడతాయి,ఇది చాలా రోజులనుండి తెలిసిన విషయమే కానీ హీరోయిన్ ఛార్మీకి మాత్రం ఇప్పుడు బాగా అనుభవంలోకి వచ్చింది. ఊరికే నోరు పారేసుకుంటే మ్యాటర్ ఇంత దూరం పోతుందా అని షాక్ అయ్యే పరిస్థితి వచ్చి పడింది.
ఇటీవల పూరి జగన్నాథ్ , నితిన్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లాల్సిన చిత్రం కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా రద్దు అయ్యింది అని అటు పూరి,ఇటు నితిన్ ట్వీట్లు కూడా చేశారు. ఈ సినిమాను శ్రేష్ఠ్ మీడియా తో కలిసి ఛార్మీ కూడా నిర్మాతగా వ్యవహరించాలని చూసింది. ఈ శ్రేష్ఠ్ మీడియా నితిన్ వాళ్లది.
సినిమా రద్దు అని తెలుసుకున్న ఛార్మీకి బాగా కోపం వచ్చినట్టుంది. నిర్మాతల దగ్గర డబ్బులు లేకపోవడం వలన సినిమా ఆగిపోయిందని కామెంట్స్ చేసింది. తర్వాత తేరుకొని సారీ చెప్పింది, కానీ సదరు నిర్మాత మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నిర్మాతల మండలిలో ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ప్రొడ్యూసర్ ఛార్మిపై న్యాయపరమైన పోరాటం చేయాలనుకుంటున్నారు. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఛార్మిపై పోలీస్ కేసు కూడా పెట్టాలనుకుంటునారని సమాచారం.