మ‌న రాష్ట్ర‌ప‌తి గుర్ర‌పు బండిని..పాకిస్థాన్ పై టాస్ లో గెలుచుకున్న‌దని మీకు తెలుసా?

భార‌తదేశ 14వ రాష్ట్ర‌ప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్రతిప‌క్షాల అభ్య‌ర్థి మీరాకుమార్‌పై ఎన్‌డీఏ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజారిటీ సాధించి గెలుపొందారు. దీంతో ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు. అయితే రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణ స్వీకారానికి ఎందులో వెళ్లారో తెలుసా..? గుర్ర‌పు బండిలో. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. గుర్ర‌పు బండిలోనే ఆయ‌న ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లారు. అయితే ఆయ‌న ఎందుక‌లా చేశారు..? కారులో వెళ్ల‌వ‌చ్చు క‌దా..! ఎందుకు వెళ్ల‌లేదు..? అనే క‌దా మీరు అడ‌గ‌బోయేది. అయితే అందుకు కార‌ణం ఉంది. అదేమిటంటే…

ప్ర‌స్తుతం రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర‌ప‌తిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లింది ఓ గుర్ర‌పు బండిలో అని తెలుసుకున్నాం క‌దా. అయితే అది ఈనాటిది కాదు, బ్రిటిష్ కాలం నాటిది. ఓ బ్రిటిష్ వైశ్రాయ్ దాన్ని వాడారు. అయితే అప్ప‌ట్లో.. అంటే మ‌న దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాక తెల్ల‌వారు పోతూ పోతూ ఇండియా, పాకిస్థాన్‌ల‌లో ఎవ‌రికి ఆ గుర్ర‌పు బండి ద‌క్కాలా అన్న సందిగ్ధంలో ఉండి ఇక చివ‌ర‌కు ఆ నిర్ణ‌యాన్ని రెండు దేశాల‌కు అప్ప‌గించారు. మీలో మీరే తేల్చుకోండి, ఎవ‌రికి ఆ గుర్ర‌పు బండి కావాలో.. అని వారు చెప్పారు. దీంతో ఈ స‌మ‌స్య‌ను భార‌త లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఠాకూర్ గోవింద్ సింగ్‌, పాకిస్థాన్ ఆర్మీ అధికారి ష‌హ‌బ్జాదా యాకుబ్‌ఖాన్‌లు రూపాయి కాయిన్ సాయంతో ప‌రిష్క‌రించుకున్నారు. అదెలాగంటే…

వారిద్ద‌రూ ఓ రూపాయి కాయిన్‌ను టాస్ వేసి బొమ్మ‌, బొరుసు కోరుకున్నారు. దీంతో ఆ టాస్‌లో భార‌త్ గెలిచింది. ఈ క్ర‌మంలోనే ఆ గుర్ర‌పు బండి మ‌న వ‌శ‌మైంది. అలా అప్ప‌టి నుంచి ఆ గుర్ర‌పు బండి మ‌న ద‌గ్గ‌రే ఉంది. అయితే 1984 వ‌ర‌కు ఈ బండిని అన్ని వేడుక‌ల‌కు రాష్ట్ర‌ప‌తి అధికారం వాహ‌నంగా ఉప‌యోగించేవారు. త‌ర్వాత భద్రతాపరమైన కార‌ణాల‌తో దీని వాడ‌కాన్ని త‌గ్గించారు. తిరిగి 20 ఏళ్ల తర్వాత 2014లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఈ బండిని ఉప‌యోగంలోకి తీసుకొచ్చారు. ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించారు. అందుకే ఆయ‌న తాజాగా జ‌రిగిన త‌న ప్ర‌మాణ స్వీకారానికి ఆ గుర్ర‌పు బండిలోనే వ‌చ్చారు. ఇక ఈ బండిలో మొద‌ట‌ ఇద్ద‌రు రాష్ట్ర‌ప‌తులు చెరో వైపున కూర్చుంటారు. కొత్త రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత వారిద్ద‌రూ గుర్ర‌పు బండిలో త‌మ త‌మ స్థానాల‌ను మార్చుకుంటారు. గుర్ర‌పు బండి గురించి చెప్పాలంటే ఇందులో భారత్, ఆస్ట్రియా దేశాల‌కు చెందిన‌ మిశ్రమజాతి గుర్రాలను ఈ బండి లాగడానికి ఉపయోగిస్తారు. అవీ ఈ గుర్ర‌పు బండి విశేషాలు..! భ‌లే ఆస‌క్తిగా ఉన్నాయి క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top