డెబిట్ కార్డు లావాదేవీల‌పై మ‌ళ్లీ చార్జిల మోత‌… కొంచెం చూసి వాడండి..!

నోట్ల రద్దు నేప‌థ్యంలో గ‌త నవంబ‌ర్ నెలలో కేంద్ర ప్ర‌భుత్వం డెబిట్ కార్డుల‌తో నిర్వ‌హించే లావాదేవీల‌పై చార్జిల‌ను ఎత్తివేసిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్ప‌టికీ చార్జిలు లేవ‌ని అనుకుంటూ ఎడా పెడా డెబిట్ కార్డుల‌ను వాడుతున్నారా..? అయితే ఆగండి. ఎందుకంటే చార్జిల‌ను ఎత్తివేసిన మాట వాస్త‌వ‌మే కానీ అది కేవ‌లం డిసెంబ‌ర్ 31, 2016 వ‌ర‌కు మాత్ర‌మే. 2017 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి డెబిట్ కార్డు చార్జిలు య‌థావిధిగా అమ‌లులోకి వ‌చ్చాయి. చాలా మందికి ఈ విష‌యం గురించి ఇంకా తెలియ‌దు.

debit-card-charge
నోట్ల ర‌ద్దు చేసిన అనంత‌రం ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఆర్‌బీఐ డెబిట్ కార్డు చార్జిల‌ను ఎత్తి వేసిన‌ట్టు ప్ర‌క‌టించింది క‌దా. క్రెడిట్ కార్డు చార్జిలు మాత్రం అలాగే ఉన్నాయి. గ‌తంలో అంటే నోట్ల ర‌ద్దుకు ముందు డెబిట్ కార్డుల ద్వారా నిర్వ‌హించే లావాదేవీల్లో రూ.1000 లోపు వాటికి 0.25 శాతం, రూ.2000 లోపు వాటికి 0.5 శాతం, రూ.2వేలు దాటితే 1 శాతం చార్జిని వ‌సూలు చేసేవారు. అయితే నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దీన్ని ఎత్తేశారు. కానీ క్రెడిట్ కార్డుల‌కు మాత్రం రూ.25 చార్జి వ‌సూలు చేస్తూనే ఉన్నారు. అయితే డిసెంబ‌ర్ 31, 2016 వ‌ర‌కు మాత్ర‌మే చార్జిల ఎత్తివేత ముగిసింది. ఈ ఏడాది నుంచి డెబిట్ కార్డుల‌కు ముందు చెప్పిన‌ట్టుగా చార్జిల‌ను వ‌సూలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చార్జిల ఎత్తివేత గురించి అంద‌రికీ ఆర్‌బీఐ తెలియ‌జేసింది కానీ మ‌ళ్లీ చార్జిలు ఎప్ప‌టి నుంచి ప‌డుతాయోనన్న విష‌యం మాత్రం చెప్ప‌లేదు. దీన్ని బ‌ట్టే మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు, జ‌నాల నెత్తిన చార్జిలు అనే మోత‌ను తెలియ‌కుండానే ఎలా పెడుతున్నారో.

దేశ ప్ర‌జ‌లంద‌రూ క్యాష్ లెస్ లావాదేవీలు నిర్వ‌హించాల‌ని అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు ఆర్‌బీఐ ఢంకా బ‌జాయించి మ‌రీ చెబుతోంది. నిజానికి చూస్తే ప్ర‌జ‌ల‌కు మాత్రం ఈ చార్జిల మోత త‌ప్ప‌డం లేదు. కొంద‌రు వ్యాపారులైతే పైన చెప్పిన చార్జి కాకుండా వినియోగ‌దారుల నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలోనే చార్జి వ‌సూలు చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇదేమ‌ని అడిగితే తాము బ్యాంకుల‌కు ఫీజు చెల్లించాల‌ని బుకాయిస్తున్నారు. కానీ వాస్త‌వాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. వ్యాపారులు ఒక ప‌రిమితి లోపు లావాదేవీలు చేస్తే మాత్ర‌మే బ్యాంకుల‌కు ఫీజు చెల్లించాలి. కానీ ప‌రిమితికి మించి లావాదేవీలు చేస్తే ఫీజు చెల్లించాల్సిన ప‌నిలేద‌ని చాలా బ్యాంకులు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో కార్డుల ద్వారా చేసే చెల్లింపుల‌కు విధించే చార్జిల పేరిట జ‌నాలు దోపిడీకి గుర‌వుతున్నారు. కానీ అటు చూస్తే మాత్రం డిజిట‌ల్ ఇండియా అని, క్యాష్‌లెస్ లావాదేవీలు అని చెబుతున్నారు. మ‌రి క్షేత్ర‌స్థాయిలో ఈ విధంగా ఉంటే జ‌నాలు న‌గ‌దు ర‌హిత లావాదేవీలు ఎలా చేస్తారు..? క‌్యాష్‌లెస్ వైపు ఎలా మొగ్గు చూపుతారు..? అప్పుడు మ‌ళ్లీ క‌థ మొద‌టికే వ‌స్తుంది క‌దా..! నిజంగా నేత‌ల‌కు, అధికారుల‌కు చిత్త‌శుద్ధి ఉంటే ముందు ఇలాంటి చార్జిలు లేకుండా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వ‌హించే వారికి ఊర‌ట క‌ల్పించాలి. అప్పుడే క్యాష్‌లెస్ దేశంగా మారుతుంది. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top