MRP ధ‌ర క‌న్నా ఎక్కువకు వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తే… ఇక ఆ వ్యాపారులకు జైలే!

రూ.20 ఉన్న వాట‌ర్ బాటిల్‌ను రూ.30 పెట్టి మీరు కొంటారా..? చాన్సే లేదు. అస్స‌లు కొనం అంటారా..! అయితే స‌రే. రూ.10 ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను రూ.15 పెట్టి కొంటారా..? అబ్బే, అస‌లే కొనం… మ‌రి రూ.15 ఉన్న కూల్‌డ్రింక్‌ను రూ.25 పెట్టి అయితే కొంటారా..? కొనం గాక కొనం. అయినా ఇవ‌న్నీ ఎందుకు అడుగుతున్నారు అనే క‌దా మీ డౌట్‌. అయితే ఇది మీ కోస‌మే. ఎందుకంటే మీరు స‌ద‌రు ప‌దార్థాల‌ను ఎక్కువ రేటుకు కొనం గాక కొనం అంటున్నారు కానీ, సినిమా హాల్స్‌, మాల్స్‌, బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు వంటి ప్రాంతాల్లో క‌చ్చితంగా కొంటారు. ఎందుకూ అంటే మ‌న‌కు అప్పుడు ఉండే అవ‌స‌రం అలాంటిది మ‌రి. క‌చ్చితంగా కొని తీరాల్సిందే. వేరే ఆప్ష‌న్ ఉండ‌దు. కానీ ఇక‌పై అలా చెల్ల‌దు. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం వినియోగ‌దారుల చ‌ట్ట నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌నుంది.

goods-at-mrp

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలుసుగా… ఇటీవ‌ల ఢిల్లీలో నిర్వ‌హించిన 47వ ప్రపంచ ప్ర‌మాణాల దినోత్స‌వంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏం చెప్పారంటే మార్కెట్‌లో ఉన్న ఏ వ‌స్తువునైనా ఎంఆర్‌పీ ధ‌ర‌కు మించి అమ్మ‌కూడ‌ద‌ని. ఒక వేళ అలా ఎవ‌రైనా అమ్మితే వారిపై చట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. మొద‌టి సారి అలా చేస్తే రూ.25వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు జ‌రిమానా, రెండో సారి అయితే ఏకంగా జైలుకే పంపుతార‌ట‌. ఇలాంటి క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌ల‌ను త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

గతంలో ఓ మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యం ఓ వినియోగ‌దారుడికి వాట‌ర్ బాటిల్‌ను ఎక్కువ రేటుకి అమ్మింది. దీంతో ఆ వినియోగ‌దారుడు జిల్లా ఫోరాన్ని ఆశ్ర‌యించాడు. ఈ క్ర‌మంలో అస‌లు ధ‌ర క‌న్నా ఎక్కువ రేటుకి అమ్మినందుకు గాను స‌ద‌రు బాధితునికి రూ.25 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని వినియోగ‌దారుల ఫోరం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో స‌ద‌రు మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యం కోర్టు ప్ర‌కారం బాధితునికి అంత మొత్తాన్ని చెల్లించాల్సి వ‌చ్చింది. అయితే ఇది శాంపిల్ మాత్ర‌మే. ముందు ముందు ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డితే ఎంతటి వారిపైనైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఏది ఏమైనా స‌ర్కారు ఇప్ప‌టికైనా స్పందించి ఈ విష‌యంలో చొరవ చూపుతుండ‌డం అభినంద‌నీయం. కానీ దీన్ని నీరుగార‌నీయ‌కుండా ప‌కడ్బందీగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం మాత్రం ఎంతైనా ఉంది.

Comments

comments

Share this post

scroll to top