తెలంగాణ కొత్త కేబినెట్‌లో కొలువు తీరేదెవ్వ‌రో .!

భారీ విజ‌యాల‌ను న‌మోదు చేసుకుని జోష్ మీదున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌కు కొత్త మంత్రి వ‌ర్గం ఎంపిక క‌త్తి మీద సాములా మారింది. ఎవ‌రిని తీసుకోవాలో.ఎవ‌రిని ప‌క్క‌న పెట్టాలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. దేనికైనా ముహూర్తాన్ని న‌మ్మే గులాబీ బాస్ కేబినెట్‌లో కీల‌క ప‌ద‌వులు ద‌క్కించుకుంటారోన‌ని గెలిచిన వారు ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. సీఎంకు ముందు నుండి న‌మ్మ‌కాలు ఎక్కువ‌. ఆయ‌న అప‌ర భ‌క్తుడు. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాలు అంటే గౌర‌వం.పంచ ప్రాణం కూడా. అన్నిటికంటే జ‌గ‌ద్గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి వారి ఆశీర్వాద బ‌లం లేకుండా ఏ ప‌నీ ముట్ట‌రు. చేయ‌రు కూడా. ఇది అందరికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఉద్య‌మ కాలం నుండి వెన్నంటి వున్న స్పీక‌ర్ గా ప‌నిచేసిన మ‌ధుసూద‌నాచారి , కుడి భుజంగా ఉన్న స్నేహితుడైన తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు ఓడిపోవ‌డం పెద్దాయ‌న‌కు కొంత బాధ క‌లిగించింది. అఖండ గెలుపును అందించిన ప్ర‌జ‌ల‌కు మ‌రింత గొప్ప‌గా.మెరుగైన పాల‌న అందించేందుకు కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు మ‌రింత ముందుకు తీసుకు పోవాల‌న్నా.గ్రామ స్థాయి వ‌ర‌కు అందాలంటే ప‌టిష్ట‌మైన .ప‌నిమంతులైన మంత్రులు ఉండాల్సిందే. ఈ విష‌యంలో సీఎం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో తానొక్క‌రే ఉంటార‌ని భావించిన గులాబీ నేత‌ల‌కు ఉన్న‌ట్టుండి ఆదిలోనే షాక్ ఇచ్చారు. త‌న‌కు ఆత్మీయుడైన మ‌హ‌మూద్ఆలీకి త‌న‌తో పాటు చోటు క‌ల్పించారు. కొన్నేళ్ల త‌ర్వాత ముస్లిం క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తికి అత్యంత శ‌క్తివంతంమైన హోం శాఖ‌ను అప్ప‌గించారు. దీంతో ఆ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు కేసీఆర్‌కు జై కొడుతున్నారు. కొత్తగా మంత్రి వ‌ర్గంలోకి ఎవ‌రెవ‌రు వ‌స్తార‌నేది చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎవ‌రికి వారే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

మ‌రికొంద‌రు నెంబ‌ర్ 2 గా ఉన్న కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ప్లానింగ్‌లో ప‌ర్ ఫెక్ట్ ప‌ర్స‌న్‌గా పేరొందిన నీళ్ల నిరంజ‌న్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంద‌ని అంచ‌నా. తాను, అలీతో పాటు మ‌రో ఏడు లేదా ఎనిమిది మందికి మాత్ర‌మే చోటు క‌ల్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పంచాంగం దృష్ట్యా .మ‌రికొంత మందికి త‌ర్వాత జ‌రిగే విస్త‌ర‌ణ‌లో చోటు క‌ల్పించే అవ‌కాశం ఉన్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. పాత వారికే చోటు ద‌క్క‌నుందా లేక కొత్త వారికి మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారో తెలియక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఎపుడు గులాబీ ద‌ళ‌ప‌తి నుండి త‌మ‌కు ఫోన్ వ‌స్తుందోన‌ని తెగ ఆరాట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు టెన్ష‌న్ త‌ట్టుకోలేక ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. ప‌ద‌వులు ఆశించిన వారంతా ఏడుకొండ‌ల శ్రీ‌నివాసుడి ఆశీస్సులు పొందేందుకు తిరుమ‌ల‌లో అగుపించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు అమ‌లు అవుతాయ‌ని జ‌నం గంపెడాశ‌లు పెట్టుకున్నారు. నిరుద్యోగులు త‌మ‌కు ఉద్యోగాలు లేక పోయినా నెల‌నెలా 3 వేల 16 రూపాయ‌ల పెన్ష‌న్ వ‌స్తుంద‌ని పూజ‌లు చేస్తున్నారు.

జిల్లాల వారీగా అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు గెలుపొంద‌డంతో ప్ర‌తి ఒక్క‌రు మంత్రి ప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌ద‌వుల కోసం సై అంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే మొద‌ట ప్ర‌క‌టించే ఆ ఏడులో ఎవ‌రుంటార‌నే దానిపై అంచ‌నాలు మించి పోయాయి. ఆదిలాబాద్ జిల్లా నుండి రేఖా నాయక్, బాల్క సుమన్ లేదా ఇంద్రకరణ్ రెడ్డి , కరీంనగర్ జిల్లా నుండి కేటీఆర్, ఈట‌ల రాజేంద‌ర్, కొప్పుల ఈశ్వ‌ర్, వ‌రంగ‌ల్ జిల్లా నుండి క‌డియం శ్రీ‌హ‌రి, రెడ్యానాయ‌క్ లేదా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉండొచ్చ‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా నుండి పోచారం లేదా వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఖ‌మ్మం జిల్లా నుండి తుమ్మ‌ల లేదా పువ్వాడ అజ‌య్, హైద‌రాబాద్ నుండి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, నాయ‌ని లేదా ప‌ద్మారావు , రంగారెడ్డి జిల్లా నుండి కోడంగ‌ల్ నుండి ఎన్నికైన న‌రేంద‌ర్ రెడ్డి, గాంధీ, మెద‌క్ జిల్లా నుండి హ‌రీష్‌, ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లా నుండి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి లేదా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నుండి ల‌క్ష్మారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి లేదా శ్రీ‌నివాస్ గౌడ్ ల‌కు చోటు ద‌క్క‌నున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా. గులాబీ బాస్ మ‌రి ఎవ‌రిని తీసుకుంటార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.

Comments

comments

Share this post

scroll to top