గత కొద్ది రోజుల క్రితం.. చంద్ర గ్రహణం ఏర్పడిన రోజు గుర్తుందా.. ఆ రోజు తరువాత హైదరాబాద్‌లో చిలుకానగర్‌లో ఓ ఇంటిపై 3 నెలల వయస్సున్న ఓ పాప తల కనిపించింది కదా. అవును, అదే. అయితే ఆ హత్య ఎవరు చేశారు అన్న దానిపై పోలీసులకు విచారణలో చుక్కలు కనిపించాయి. నిందితులను కనిపెట్టడం వారికి కష్టతరమైంది. కానీ ఎట్టకేలకు వారు కేసు మిస్టరీని ఛేదించారు. అయితే ఇంతకీ అసలు నిందితులు ఎవరో తెలుసా..? పాప తల ఉన్న ఆ ఇంటి పోర్షన్లో నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ఆ హత్య చేశాడు. అంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్‌లో నివాసం ఉండే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ భార్య లతకు ఆరోగ్యం బాగా ఉండేది కాదు. దీంతో వారు అనేక ప్రయత్నాలు చేశారు. డాక్టర్లకు చూపించారు. అయినా ఆమె అనారోగ్యం తగ్గలేదు. దీంతో వారు గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన మేడారం జాతరకు వెళ్లి ఓ కోయ దొరను కలవగా అతను.. పసిపాపను బలిస్తే దోషం పరిహారం అయి అనారోగ్య సమస్య నుంచి బయట పడవచ్చని చెప్పాడు. దీంతో వారు ఎలాగైనా ఆ పనిచేయాలని భావించారు. కానీ వారికి సమయం కలసి రాలేదు. దీనికి తోడు అంత తక్కువ వయస్సు ఉన్న పాపను ఎలా తేవాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే చివరకు వారు పాపను తెచ్చేశారు.
మొన్నా మధ్య జరిగిన చంద్ర గ్రహణం రోజున పాపను బలిస్తే అనుకున్నది నెరవేరుతుందని కోయ దొర చెప్పడంతో అంతకు ముందు రోజే రాజశేఖర్ పాపను ఎత్తుకొచ్చాడు. అర్ధరాత్రి వేళ బోయగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న దంపతులకు చెందిన మూడు నెలల పసికందును అతను తీసుకొచ్చాడు. అనంతరం చంద్రగ్రహణం రోజున అర్థరాత్రి చిలుకానగర్‌లో తన ఇంట్లో పూజలు చేస్తున్న రాజశేఖర్, లతలు ఆ పాపను బలిచ్చారు. ఆమె తల నరికారు. అనంతరం ఆమె మొండాన్ని రాజశేఖర్ సోదరుడు ప్రతాప్ సింగారం మూసీ నదిలో రాత్రి 2 గంటలకు పారవేశాడు.
ఇక ఇంట్లో భార్య లతతో కలిసి నగ్నంగా పూజలు చేసిన రాజశేఖర్ అనంతరం ఆ పాప తలను తెచ్చి తన ఇంటిపై నైరుతి దిశ వైపుగా పెట్టాడు. చంద్ర కిరణాలు పాప తలపై పడాలని కోయ దొర చెప్పడంతో అతను ఆ పనిచేశాడు. ఇక పూజ ముగియగానే ఇంట్లో ఉన్న రక్తం మరకలను అతను యాసిడ్‌తో 16 సార్లు కడిగాడు. అయినా కొన్ని చోట్ల అవి పోలేదు. ఇక చేసేదేం లేక అతను సైలెంట్ అయి తనపని తాను చేసుకుపోయాడు. ఈ క్రమంలో ఇంటిపై పడి ఉన్న పాప తల గురించి వచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించే పనిలో పడ్డారు.
అలా పోలీసులు రంగంలోకి దిగినా ఆ కేసును సాధించడం వారికి సవాల్ గా మారింది. అసలు ఆ పాప ఎవరు, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చంపి ఉంటారు అన్న అనుమానాలకు మొదట్లో ప్రశ్నలు కరువయ్యాయి. కానీ చివరకు పోలీసులు రాజశేఖర్ ఇంటిని జల్లెడ పట్టారు. అతని ఇంట్లో అణువణునూ పరిశీలించారు. ఈ క్రమంలో వారికి ఎండిపోయిన పలు రక్తపు నమూనాలు కనిపించాయి. వారు వాటిని తీసుకుని పరిశీలించగా, డీఎన్ఏ రిపోర్టులో ఆ రక్తం ఆ పాపదే అని తెలిసింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసే సరికి రాజశేఖర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఈ కేసులో 122 మంది కాల్ డేటా విశ్లేషణ, 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వంద సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. చివరకు DNA రిపోర్టు ద్వారా వీరి తతంగం బయటపడింది. కాగా నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను నిందితులు బండ్లగూడ మూసీ సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. ఇక రాజశేఖర్ కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెతోపాటు మొత్తం 6 మందిని (రాజశేఖర్ అతని భార్య లత సహా) పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య అనారోగ్యం కారణం వల్లే కోయదొర చెప్పిన మేరకు పాపను నరబలి ఇచ్చినట్లు రాజశేఖర్ ఒప్పుకున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి దారుణం చేసిన ఈ నిందితులను మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాల్సిందే..!