ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్ వల్ల ఉండే సౌకర్యం మాటల్లో చెప్పలేం. పవర్ కట్ అయినా, ప్రయాణాల్లో ఉన్నా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నేటి తరుణంలో వస్తున్న ల్యాప్‌టాప్‌లు చాలా సన్నగా ఉండి, బరువు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో వాటిని మోసుకెళ్లడం కూడా చాలా సులభతరమవుతున్నది. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. మరి ల్యాప్‌టాప్‌లను కొనే విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, మన పనులకు సూట్ అయ్యే విధంగా ఎలాంటి కాన్ఫిగరేషన్, ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్‌లను తీసుకుంటే మంచిది..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్‌ప్లే సైజ్…
నేడు చాలా వరకు ల్యాప్‌టాప్‌లు 15.6 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌తో లభిస్తున్నాయి. మార్కెట్‌లో 14, 13.3, 12, 11, 10 ఇలా రకరకాల సైజ్‌లతో ఉన్నప్పటికీ 15.6 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ ఉంటేనే బెటర్. స్క్రీన్ పెద్దగా ఉంటేనే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికితోడు డెస్క్‌టాప్‌ను వాడిన ఫీలింగ్ వస్తుంది. కనుక 15.6 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ ఉన్న ల్యాప్‌టాప్‌లు అయితే బెటర్.

రిజల్యూషన్…
నేడు చాలా వరకు ల్యాప్‌టాప్ డిస్‌ప్లేలను ఫుల్ హెచ్‌డీ (1080 x 1920), క్వాడ్ హెచ్‌డీ (2560 x 1440) రిజల్యూషన్‌తో అందిస్తున్నారు. అయినప్పటికీ మీరు తీసుకునే ల్యాప్‌టాప్‌లో డిస్‌ప్లే రిజల్యూషన్ ఏ టైప్‌లో ఉందో చూసుకుంటే బెటర్. ఫుల్ హెచ్‌డీ, క్వాడ్ హెచ్‌డీ అయితే డిస్‌ప్లే చాలా కలర్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. దృశ్యాలు క్వాలిటీగా కనిపిస్తాయి.

ప్రాసెసర్, ర్యామ్…
సాధారణ ఆఫీస్ పనులకైతే ఏఎండీ, ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ సరిపోతుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ అవసరాల కోసం అయితే ల్యాప్‌టాప్‌లో కనీసం 8 లేదా 16 జీబీ ర్యామ్ ఉండాలి. అదేవిధంగా ప్రాసెసర్‌లు అయితే ఇంటెల్‌లో కోర్ ఐ5, ఐ7, ఏఎండీలో అయితే ఎఫ్‌ఎక్స్, ఫీనమ్, ఏ10, ఏ8 ప్రాసెసర్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ల్యాప్‌టాప్‌లో ఒకే సారి పలు అప్లికేషన్లను రన్ చేయవచ్చు.

గ్రాఫిక్స్ మెమొరీ…
మల్టీమీడియా, గ్రాఫిక్స్ పనులు, గేమ్స్ ఆడేవారు ల్యాప్‌టాప్‌లో డెడికేటెడ్ గ్రాఫిక్ మెమొరీ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆయా పనులను ఎలాంటి ల్యాగ్ లేకుండా, క్రాష్, హ్యాంగ్ కాకుండా వేగంగా చేసుకోవచ్చు. అందుకు గాను 2జీబీ, 4జీబీ, 8జీబీ, 16జీబీ గ్రాఫిక్స్ మెమొరీ ఉన్న ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గ్రాఫిక్ మెమొరీ కావాలనుకునే వారు తాము తీసుకుంటున్న ల్యాప్‌టాప్‌లో డెడికేటెడ్ గ్రాఫిక్ మెమోరీ ఎంత ఉందో కచ్చితంగా చూసుకోవాలి.

హార్డ్ డిస్క్…
ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లలో 512 జీబీ, 1 టీబీ (1024 జీబీ), 2 టీబీ కెపాసిటీ కలిగిన హార్డ్ డిస్క్‌లను ఇస్తున్నారు. అయితే ల్యాప్‌టాప్ తీసుకునే వారు కనీసం 1 టీబీ కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుంటే మేలు. అదే గ్రాఫిక్ పనులు చేసే వారైతే 2 టీబీ స్పేస్ ఉన్న హార్డ్ డిస్క్ తీసుకోవాలి. ఇక వీరు ఎస్‌ఎస్‌డీ అనబడే ప్రత్యేక స్టోరేజ్ డ్రైవ్‌లు ఉన్న ల్యాప్‌టాప్‌లను తీసుకుంటే ఇంకా బెటర్. దీంతో మరింత స్పేస్‌ను పొందవచ్చు.

పోర్ట్స్, ఇతర ఫీచర్లు…
ల్యాప్‌టాప్‌లకు ఈథర్‌నెట్, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు కచ్చితంగా ఉండాలి. దీంతోపాటు వాటికి హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన వెబ్ కెమెరా, వైఫై, బ్లూటూత్, ఆడియో జాక్, మైక్, డీవీడీ రైటర్, కార్డ్ రీడర్ వంటి ఫీచర్లు ఉండేలా చెక్ చేసుకోవాలి.

ఆపరేటింగ్ సిస్టమ్…
నేడు చాలా వరకు ల్యాప్‌టాప్‌లలో విండోస్ 10ను కంపెనీలు ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నాయి. ఇలా ఇన్‌బిల్ట్ ఓఎస్ ఉన్న ల్యాప్‌టాప్ అయితేనే బెటర్. లేదంటే DOS, LINUX వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లతో వచ్చే ల్యాప్‌టాప్‌లు తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాత తరం ఓఎస్‌లు అయిన విండోస్ 7, 8 వంటివి ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు డ్రైవర్స్ విషయంలో సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది.

బ్యాటరీ పవర్…
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా వరకు ల్యాప్‌టాప్‌లు 4 నుంచి 5 గంటల వరకు బ్యాకప్‌ను అందిస్తున్నాయి. కనుక ల్యాప్‌టాప్‌ను కొనేముందు అది బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో అడిగి తెలుసుకోండి. ఇక కొన్ని హై ఎండ్ ల్యాప్‌టాప్‌లలో గరిష్టంగా 6 నుంచి 7 గంటల వరకు బ్యాకప్‌ను ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నాయి.

ట‌చ్ ఫీచ‌ర్‌…
నేడు అనేక ల్యాప్‌టాప్‌ల‌లో ట‌చ్ ఫీచ‌ర్ కూడా ల‌భిస్తోంది. అయితే నిజానికి ట‌చ్ ఫెసిలిటీ ఉన్న వాటిలో ఫీచ‌ర్లు అంత ఎక్కువ‌గా ఏమీ ఉండ‌వు. దీంతోపాటు ట‌చ్ కొంత కాలానికి సరిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు కూడా. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను చాలా మంది ట‌చ్ ల్యాప్‌టాప్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్లు ఎదుర్కొంటున్నారు. క‌నుక ల్యాప్‌టాప్‌ల‌లో ట‌చ్ డిస్‌ప్లే ఉన్న వాటి జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌.

క‌న్వర్ట‌బుల్ లేదా 2 ఇన్ 1…
మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌ల‌లో డిస్‌ప్లే ఎటంటే అంటు వంచ గ‌లిగే ల్యాప్‌టాప్‌లు, లేదంటే ల్యాప్‌టాప్‌నే ట్యాబ్లెట్ పీసీగా వాడుకునేలా క‌న్వ‌ర్ట‌బుల్‌, 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కూడా మ‌న ద‌గ్గ‌ర అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. కానీ… వాటిని అవ‌స‌రం అనుకుంటే యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. కాక‌పోతే పైన చెప్పిన విధంగా ఫీచ‌ర్లు అన్నీ వాటిల్లో వ‌స్తున్నాయో లేదో చూసుకుని మ‌రీ కొనాలి. లేదంటే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Comments

comments

Share this post

scroll to top