తూటాల్లాంటి మాట‌లు..ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌లు – బుర్రా సాయి మాధ‌వ్ ప్రత్యకం.!!

సినిమా పండాలంటే, బాక్సాఫిస్ బ‌ద్ద‌లు కొట్టాలంటే. రికార్డులు బ్రేక్ కావాలంటే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌లు ఉండాల్సిందే. సినిమాల‌కు డైలాగ్‌లే ప్రాణం. బ‌ల‌మైన పాత్ర‌లకు బ‌రువైన డైలాగ్‌లు వుంటే ఆ సినిమాలు కాసులు కురిపిస్తాయి. జ‌నాన్ని థియేట‌ర్ల వ‌ద్ద‌కు తీసుకు వ‌స్తాయి. తెలుగు సినిమా ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌ల‌తో అల‌రారుతోంది. మాట‌ల‌తో మంట‌లు రేపే డైలాగ్ రైట‌ర్స్‌కు ప్ర‌యారిటీ పెరుగుతోంది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త్రివిక్రం శ్రీ‌నివాస్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌, క్రిష్ లాంటి వాళ్లు త‌మ క‌లాల‌కు ప‌దును పెడుతూనే ఉన్నారు. ఇటీవ‌ల స్పీడ్‌గా దూసుకు వ‌చ్చాడు బుర్రా సాయి మాధ‌వ్ తెలుగు మూవీ రంగంలోకి. గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబ‌ర్ 16న 1973లో జ‌న్మించిన బుర్రా అద్భుత‌మైన ప‌దాల‌తో మంట‌లు పుట్టిస్తున్నారు.

burra sai madhav

రంగ‌స్థ‌ల న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, సినిమా సంభాష‌ణ‌ల రైట‌ర్‌గా అపార‌మైన అనుభ‌వం ఉన్న‌ది ఆయ‌న‌కు. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కృష్ణం వందే జ‌గ‌ద్దురుమ్ సినిమా విజ‌య‌వంతంగా న‌డిచింది. ఆ సినిమాకు సాయిమాధ‌వ్ డైలాగ్స్ రాశాడు. ప్రేక్ష‌కుల‌తో ఈల‌లు వేసేలా చేశాయి. జీవితంలో ఎదుర‌య్యే పాత్ర‌లు, సంఘ‌ట‌న‌లే మాట‌లు రాసేందుకు దోహ‌దం చేస్తాయంటారు ఓ సంద‌ర్భంలో ర‌చ‌యిత‌. ఒక్కో ద‌ర్శ‌కుడిది ఒక్కో టేస్ట్‌. వారి అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు మాట‌లు రాయడం చాలా క‌ష్ట‌మైన ప‌ని. బుల్లెట్ల కంటే వేగంగా బుర్రా రాసిన మాట‌లు మ‌న‌ల్ని తాకుతాయి. ఆలోచ‌నాత్మ‌కంగా వుంటాయి. అతడి ప్రతి అక్షరంలోనూ భావం పరిమళిస్తూనే ఉంటుంది. ఆ భావం ఆలోచనలను రేకెత్తించి కదిలిస్తూనే ఉంటుంది. మాట మనసును తాకటం ఒక ఎత్తయితే. కళ్లనుండి అశృవులు రప్పించడం మాధవ్ బుర్రాకే చెల్లింది. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే న‌క్ష‌త్రాలు కావు.ఉరకేలేసే సముద్రం లాంటివని నిరూపించాడు. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిలో ఆయ‌న క‌లం మ‌రింత రాటుదేలింది. ఈ దేశం ఉమ్మ‌డి కుటుంబం.గ‌ది గ‌దికీ మ‌ధ్య గోడ‌లుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాది అని కొట్టుకుంటాం. కానీ ఎవ‌డో వ‌చ్చి నా ఇల్లు అంటే ఎగ‌రేసి న‌రుకుతాం.

మీ మొండాల మీద మా జెండాలు ఎగ‌రేస్తాం, ఇది ఏ విప్ల‌వ ర‌చ‌యితో రాసిన మాట‌లు అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లే. దీనిని రాసింది సాయిమాధ‌వ్‌. ఇంకో పాత్రలో, మారావు అనుకున్నా గెలిచిన రాజ్యాలు మార‌లేదు. వ‌లిచిన ఇల్లాలు మార‌లేద‌ని రాశాడు. ప్ర‌తి మాట‌లో ఆత్మ‌విశ్వాసం ఉంటుంది. ఎక్క‌డ కూడా త‌గ్గ‌కూడ‌దంటాడు. అందుకే ప్ర‌తి ప‌దం శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుని ఉంటుంది. ఓడించా మార‌లేదు క్ష‌మించా మార‌లేదు వ‌ధించా.ఇక మారాల్సిన అవ‌స‌రం లేదని రాసిన డైలాగ్‌కు ఈల‌లు చ‌ప్ప‌ట్లు.

యుద్దానికి వెళ్లేట‌ప్పుడు తెగువ వుంటే స‌రిపోదు తెలివి వుండాలి .తెలిసి వుండాలి.క‌త్తి కాదు భ‌క్తితో బెదిరిస్తున్నారు. న‌మ్మ‌కాన్ని అమ్మ‌కంగా మార్చేస్తున్నారు. గ‌ర్భ గుడిలో వీధి కుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైల పోడు అని ఘాటుగా మాట‌లు రాశాడు. నాయ‌కుడంటే న‌మ్మించే వాడు కాదు. న‌డిపించే వాడు. ఉప‌వాసం అంటే ఆక‌లితో ఉండ‌టం కాద‌న్నా.దేవుడికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం. క‌ళంటే బ‌తుకునిచ్చేదే అనుకోకుబతుకు నేర్పేది కూడా. ఒక నాయ‌కుడు ఎలా వుండాలో. ఎలా ప‌రిపాలించాలో త‌న మాట‌ల‌తో మంట‌లు రేపాడు. మ‌మ‌కారం, అహంకారం. రెండూ లేని వాడే నాయ‌కుడు అవుతాడు. క‌థ‌లు మ‌నం చెప్పుకుంటే ఏం లాభం. మ‌న క‌థ‌ను ప్ర‌జ‌లు ఘ‌నంగా చెప్పుకోవాలి అని రాశాడు. ప్ర‌తి సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండేలా. మాట‌లు పేలేలా రాస్తూ వెళ్లారు. రంగ‌స్థ‌ల న‌టుడిగా ప‌ని చేయ‌డం వ‌ల్ల పాత్ర‌ల‌కు ఎలా రాయాలో తెలిసొచ్చింది. సినిమా ఇండ‌స్ట్రీలో బుర్రా సాయి మాధ‌వ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. త‌న మిత్రుల‌తో క‌లిసి అభ్యుద‌య క‌ళాసాహితీ అనే సంస్థ‌ను స్థాపించాడు. ప‌లు నాటిక‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు.

హ‌రిశ్చంద్ర నాట‌కంలో లోహితాశ్యుడి పాత్ర‌లో జీవించాడు. గ‌డియారం, క‌ళ్లు, అమ్మ‌కానికో అబ్బాయి, రేపేంది, ఈనాడు, వ‌ర‌విక్ర‌యం, చ‌రిత్ర పుట‌ల్లో చెర‌గ‌ని మ‌ర‌క‌లు, హిమ‌జ్వాల‌, మంచం మీద మ‌నిషి, పండ‌గొచ్చింది, నాకీ పెళ్లొద్దు, చెర‌సాల‌, పోస్ట‌ర్ నాట‌కాల్లో న‌టించాడు. దుర్యోధ‌నుడు, అల్లూరి సీతారామ‌రాజు లో ఏక‌పాత్రాభినం చేశాడు. బ్రోచేవారెవ‌రురా పేరుతో తానే రాసి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి న‌టించారు బుర్రా. అద్దంలో చంద‌మామ కూడా. రంగ‌స్థ‌లం నుండి సినిమాస్థ‌లంలోకి ఎంట‌ర‌య్యాడు. తాళిక‌ట్టు శుభ‌వేళ‌, హైటెకెట్ స్టూడెంట్‌, శ్రీ స‌త్య‌నారాయ‌ణ స్వామి , కృష్ణం వందే జ‌గ‌ద్గురుం సినిమాల‌కు పాట‌లు రాశాడు. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు క‌థాగానం చేశాడు. 2012లో క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 2012లో కృష్ణం వందే జ‌గ‌ద్దురుం సినిమాకు సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేశాడు. 2015లో గోపాల గోపాల‌, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, కంచె, రాజు గారి గ‌ది, దొంగాట‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి, ఖైదీ నెం 150, కిట్టుగాడు ఉన్నాడు జాగ్ర‌త్త‌, మ‌న‌స్సుకు న‌చ్చింది, మ‌హాన‌టి, సాక్ష్యం సినిమాల‌కు డైలాగ్స్ రాశాడు. ఇవ‌న్నీ పేలాయి. కాసులు రాల్చేలా చేశాయి. శ‌ర‌భ‌, ఎన్ టీ ఆర్‌, సైరా న‌ర‌సింహారెడ్డి కి కూడా మాట‌లు రాశాడు. చాలా టెలీ సీరియ‌ల్స్‌కు మాట‌లు రాసి ఔరా అనిపించారు.

సినిమా అన్న‌ది ప‌వ‌ర్‌ఫుల్ మాధ్య‌మం. ప్ర‌తిభ ఒక్క‌టే కాదు, ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌గ‌ల‌గాలి. లేక‌పోతే వెన‌క్కి వెళ్లిపోతాం. ఎంతో మంది వ‌స్తుంటారు. కొంత మంది అలాగే త‌మ బ్రాండ్‌ను కంటిన్యూ చేసుకుంటూ వెళ‌తారు. అలాంటి వారిలో సాయిమాధ‌వ్ ఒక‌రు. మ‌రిన్ని సినిమాల‌కు త‌న క‌లం బ‌లాన్ని చూపించాల‌ని కోరుకుందాం. తూటాలు ఒక్క‌సారే పేలుస్తాయి.మాట‌లు నిరంత‌రం గాయ‌ప‌రుస్తాయి. అందుకే తూటాల కంటే మాట‌లే గొప్ప‌వి క‌దూ.

Comments

comments

Share this post

scroll to top