రిలయన్స్‌కు చెందిన జియో దెబ్బకు ఓ వైపు ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అంతా తమ తమ ప్లాన్లను మారుస్తూ కస్టమర్లు చేజారిపోకుండా ఉండేందుకు పథకాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లు పోటా పోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ జియోను ఢీకొట్టినంత పని చేస్తుండగా, ఆ కోవలోకి బీఎస్ఎన్ఎల్ కూడా వచ్చి చేరింది. అందరు ఆపరేటర్లు ఇస్తున్న మాదిరిగానే ఆ సంస్థ కూడా పలు ఆఫర్లను తాజాగా ప్రవేశపెట్టింది. వాటిలో అన్లిమిటెడ్ డేటా అన్నింటిలోనూ లభిస్తోంది. ఆయా ప్యాక్‌ల వివరాలు ఇలా ఉన్నాయి…
99, 149, 303 అని జియోలో ప్లాన్స్ ఉన్నాయి కదా… సరిగ్గా అచ్చం అవే ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ కూడా ప్రవేశపెట్టింది. కాకపోతే రూ.303కి బదులుగా రూ.339 ప్లాన్ చేర్చింది. దీంతో నెలరోజుల పాటు అన్ని నెట్ వర్క్‌లకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్యాక్ వల్ల యూజర్లకు రోజుకు గరిష్టంగా 2 జీబీ 3జీ డేటా లభిస్తుంది. అయితే కోటా అయిపోయినప్పటికీ నెట్ వస్తూనే ఉంటుంది. కాకపోతే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అంతే..!
ఇక రూ.99, రూ.149 ప్లాన్లతో యూజర్లు గరిష్టంగా రోజుకు 500 ఎంబీ వరకు 3జీ డేటాను వాడుకునేందుకు వీలుంది. వీటితో కూడా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే డేటాపై లిమిట్ ఉంటుంది. కాగా ఈ మూడు ప్లాన్లు కూడా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుండగా దేశంలో ఉన్న సర్కిల్స్‌ను బట్టి ఈ ప్లాన్స్ కొంచెం అటు, ఇటుగా ఉంటాయి. మరి బీఎస్ఎన్ఎల్ ఆఫర్ నచ్చి యూజర్లు ఆ నెట్‌వర్క్‌కు మారుతారో, లేదంటే ఇప్పటికే ఉన్నవారు ఆయా ప్లాన్లను వేసుకుంటారో లేదో వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా జియో దెబ్బ ఇతర నెట్‌వర్క్‌లకు బాగా గట్టిగానే తగిలినట్టుంది కదా..!