రిలయన్ Jio కు పోటీగా BSNL.!? నెల మొత్తం ఫ్రీ కాల్స్‌తో రెడీ అవుతున్న BSNL.

జియో 4జీ… సెల్‌ఫోన్ ప్ర‌పంచంలో ఇప్పుడిదొక సంచ‌ల‌నంగా మారిపోయింది. మొబైల్స్‌ను వాడుతున్న ఏ వినియోగ‌దారున్ని ప‌ల‌క‌రించినా వారి నోట జియో 4జీ అనే మాటే వినిపిస్తోంది. జియో 4జీ ఆఫ‌ర్‌ను పొందేందుకు గాను చాలా మంది త‌మ 3జీ ఫోన్ల‌ను తీసేసి ఏకంగా 4జీ  ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారంటేనే తెలుస్తోంది, ఆ సంస్థ ఎంత ప‌క‌డ్బందీ వ్యూహంతో మార్కెట్‌లోకి అడుగు పెట్టిందో. మొద‌ట్నుంచీ జియో అవలంబిస్తున్న విధానం కూడా ఒక్క‌టే. ఎలాగైనా మొబైల్ వినియోగ‌దారులంద‌రినీ త‌మ వైపుకు తిప్పుకోవాల‌ని. అయితే అందు కోసం చాలా పెద్ద ప్లానే వేయాల్సి ఉంటుంది. అస‌లే మ‌న దేశంలో ఉన్న మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఆవులిస్తే పేగులు లెక్క‌పెట్టే ర‌కం. టెలికాం కంపెనీలు ఎలాంటి చిన్న ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టినా వాటిని పూర్తిగా వాడుకునే తీరుతారు. అలాంటి క్ర‌మంలో ఉచిత ఇంటర్నెట్‌, కాల్స్, ఎస్ఎంఎస్ అంటూ ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెడితే ఊరుకుంటారా..? ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. దాని ఫ‌లితం ఏమిటో మ‌నం నిత్యం క‌ళ్లారా చూస్తూనే ఉన్నాం క‌దా. అయితే జియో ఇంత‌టి భారీ ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టింది సరే. మ‌రి ఇత‌ర టెలికాం కంపెనీలు దానికి పోటీగా వస్తేనో..? అంటే…

jio-vs-bsnlజియోకి పోటీగా రావాలంటేనే ఇప్పుడు ఇత‌ర టెలికాం కంపెనీలు చాలా జాగ్ర‌త్త‌గా ఆచి తూచి అడుగులేస్తున్నాయి. జియో 4జీపై ఆ సంస్థ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత నుంచి అటు ఎయిర్‌టెల్‌, ఐడియా ఇటు వోడాఫోన్ వంటి కంపెనీలు ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ వ‌చ్చాయి. కానీ అవేవీ జియో స్థాయిలో లేవనేది వినియోగ‌దారుల మాట‌. నీ ముక్కు ఏదిరా అంటే వేలిని త‌ల‌చుట్టూ తిప్పి తీసుకువ‌చ్చి ఇదిగో నా ముక్కు అన్న‌ట్టుగా ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్లు ఎన్ని ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టినా తిప్పి తిప్పి మ‌ళ్లీ ఏదో ఒక రీచార్జ్‌తోనో, లేదంటే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తోనో స‌ద‌రు ఆఫ‌ర్‌ను టెలికాం కంపెనీలు ముడిపెడుతున్నాయి. దీంతో వాటి తీరు ష‌రా మామూలే అన్న ధోర‌ణిలో వినియోగదారులు ప‌డిపోయారు. అయినా ఇప్ప‌టికైతే జియో సునామీ మాత్రం ఆగ‌డం లేదు. ఇక వీటి సంగ‌తి అలా ఉంచితే ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా త‌న వినియోగ‌దారుల‌ను చేజార్చుకోకుండా ఉండేందుకు గాను కొద్ది రోజుల కింద‌ట రూ.249కే అప‌రిమిత‌మైన ఇంటర్నెట్ అంటూ ఊద‌ర‌గొట్టి, తూచ్‌..! ఆ ఆఫ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగ‌దారుల‌కు అంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. మ‌ళ్లీ అలాంటిదే ఇంకోటేదో ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారులు ముందుకు వ‌స్తుంద‌ట‌. ఇంత‌కీ అదేం ప్లానబ్బా..?

నెల‌కు రూ.2 నుంచి రూ.4 చెల్లిస్తే చాల‌ట‌. దీంతో వినియోగ‌దారులు నెల మొత్తం వాయిస్ కాల్స్‌ను ఉచితంగా చేసుకోవ‌చ్చ‌ట‌. జియో ఆఫ‌ర్ కేవ‌లం 4జీ క‌స్ట‌మ‌ర్లకే కాగా, తాము అందించ‌బోతున్న ఈ ఆఫ‌ర్ 2జీ, 3జీ వినియోగ‌దారుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని బీఎస్ఎన్ఎల్ తెలియ‌జేసింది. మంచిది, ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఇంట‌ర్నెట్ మాటేమిటి..? అంటే దాని సంగతి ఎత్త‌డం లేదు స‌ద‌రు సంస్థ అధికారులు. స‌రే పోనీ… వాయిస్ కాల్స్ అయినా ఉచితంగా ఇస్తున్నారు. అదీ చాలా చాలా త‌క్కువ ధ‌ర‌కు సంతోషం. మ‌రి ఈ ఆఫ‌ర్ ఎప్ప‌ట్నుంచ‌య్యా అంటే జ‌న‌వ‌రి ప్రారంభం నుంచి అట‌. అది కూడా ముందుగా బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న కేర‌ళ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, ఒడిశా, పంజాబ్ ఉత్త‌ర‌ప్రదేశ్‌ల‌లోన‌ట‌. అక్క‌డ ప్లాన్ స‌క్సెస్ అయితే మిగతా రాష్ట్రాల్లోనూ ఆ ప్లాన్‌ను ప్రవేశ‌పెడ‌తార‌ట‌. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఎవ‌రైతే వినియోగ‌దారులు త‌మ త‌మ ఇండ్ల‌లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ క‌లిగి ఉన్నారో, వారికే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ట‌. ఇది ఎలా ఉందంటే… మేం అందిస్తున్న ప‌థ‌కాలకు ల‌బ్ది పొందాలంటే మీకు తెల్ల రేష‌న్ కార్డు ఉండాలి, బంగ‌ళా, కారు, బైక్‌, టీవీ లాంటి వ‌స్తువులు ఉండ‌కూడదు. ఇంకా… ఇంకా… అస‌లు ఆ ప‌థ‌కాలు పొందాలంటే చాలా చాలా పేద‌లై ఉండాలి… వారికి ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ ఉండాలి… కంప్యూట‌ర్ ఉండ‌కూడ‌దు… స్మార్ట్‌ఫోన్ ఉండాలి… అన్న‌ట్టుంది వారి వాల‌కం. బాబోయ్‌..! ఇక బీఎస్ఎన్ఎల్‌ను ఆ దేవుడే ర‌క్షించాలి మ‌రి..! ఆయ‌న‌కు కూడా ఫ్రీ కాల్స్, ఇంట‌ర్నెట్ గ‌ట్రా ఇస్తామ‌ని మోసం చేస్తారేమో… ఏమో… మాయ‌దారి టెలికాం ఆప‌రేట‌ర్లు..!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top