వివాహ వేడుకలో కానుకలు వద్దన్న పెళ్లి కూతురు… అందుకు బదులుగా ఆమె వరుడ్ని కోరిన కోరిక ఏమిటంటే..?

పెళ్లంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది కట్నాలు, కానుకలే. ఏ వర్గానికి చెందిన వారైనా వారి వారి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో వధూవరులు ఒకరికొకరు కట్నాలు, కానుకలు పెట్టుకుంటారు. కొన్ని చోట్ల వధువు తరఫు వారే మొత్తం కానుకలను సమర్పించే ఆచారం ఉంటే మరికొన్ని చోట్ల వరుడు తరఫు వారు వధువుకు కట్నాలు పెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఓ గ్రామంలో నిర్వహించిన పెళ్లి వేడుకలో వధువు వరుడి తరఫు వారిని కట్నాలకు బదులుగా ఓ విచిత్రమైన కోరిక కోరింది. ఆ కోరికను విన్న గ్రామస్తులు మొదట ఆశ్చర్యపోయినా ఆ వధులు చేసిన పనికి వారందరూ ఆమెను మెచ్చుకున్నారు. అంతేకాదు, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆ పెళ్లి కూతుర్ని అభినందిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆమె వారిని కోరింది ఏమిటి? తెలుసుకుందాం రండి!

bride-plants

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ ప్రాంతం కిషిపురా అనే గ్రామానికి చెందిన ప్రియాంక బడోరియా అనే 22 ఏళ్ల యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే వారి ఆచారం ప్రకారం వధువుకు ఆమె కోరిన వస్తువులను వరుడు తరఫు వారు కట్నాలుగా, కానుకలుగా ఇవ్వాలి. ఈ క్రమంలో ప్రియాంక బడోరియా తన అత్తింటి వారిని ఓ వింతైన కోరిక కోరింది. తనకు నగలు, వస్తువులు ఏవీ వద్దని, అందుకు బదులుగా ఓ 10వేల మొక్కల్ని నాటాలని వారిని అడిగింది. అయితే అందుకు ఆమె అత్తింటి వారు మొదట ఆశ్చర్యపోయినా ఆమె కోరిన కోరిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ప్రియాంక కోరిక మేరకు తమ ఇంటి వద్ద 5వేల మొక్కలను, ఆమె పుట్టింటి వద్ద మరో 5వేల మొక్కలను వారు నాటారు.

కాగా ప్రియాంక మొక్కలను నాటమని కోరడం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అదేమిటంటే తన తండ్రి కరువు కారణంగా తీవ్రమైన కష్టాలు పడుతుండడాన్ని ఆమె తన చిన్నప్పటి నుంచే గమనిస్తూ వచ్చింది. అయితే ఆమె అప్పటి నుంచే మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చింది. క్రమంగా అదే ఓ అలవాటుగా మారి పెళ్లిలో అలా వారిని మొక్కలు నాటించమని అడిగేలా చేసింది. కాగా ప్రియాంక వివాహం కూడా ఎర్త్ డే రోజునే జరగడం విశేషం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్పృహ ఉండాలే గానీ ఎలాంటి పని ద్వారానైనా దాన్ని సాధించవచ్చని ప్రియాంక నిరూపించింది. నిజంగా ఆమె చొరవను మనమందరం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top