అంగ వైకల్యం ఉన్నా… ఎన్ని అడ్డంకులు ఎదురైనా… కృషి, పట్టుదల ఉంటే చాలు. వాటన్నింటినీ ఎదుర్కొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. ఓ వైపు పేదరికం, మరో వైపు అంధత్వం. ఇంకోవైపు వికలాంగుడనే వివక్ష, ఎక్కడికి వెళ్లినా అవమానాలు. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ అతను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు తనలాంటి సమస్యలున్న వారికి దారి చూపుతున్నాడు. అతనే శ్రీకాంత్ బొల్లా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో ఓ మారుమూల గ్రామంలో 1992లో శ్రీకాంత్ బొల్లా ఓ పేద కుటుంబంలో జన్మించాడు. అయితే అతనికి పుట్టుకతోనే అంధత్వం వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని వదిలించుకోమని అతని తల్లిదండ్రులకు చెప్పారట. అయినా వారు తమ కొడుకును పెంచుకోవాలనే నిర్ణయించారు. ఈ క్రమంలో తాము ఎంత పేదరికంలో బాధపడుతున్నా శ్రీకాంత్‌ను మాత్రం పెద్ద చదువులు చదివించాలని వారు తాపత్రయ పడ్డారు. అప్పట్లో వారి సంవత్సరాదాయం కేవలం రూ.20వేలు మాత్రమే. అంటే నెలకు దాదాపు రూ.1600 మాత్రమే. అయినప్పటికీ శ్రీకాంత్‌కు విద్యాబుద్ధులు చెప్పించడం కోసం వారు వెనుకడుగు వేయలేదు.

కాగా తన సంక్షేమం కోసం తల్లిదండ్రులు తీసుకుంటున్న శ్రద్ధను చూసి శ్రీకాంత్‌కు చదువుపై ఎంతో ఆసక్తి కలిగింది. అయితే అతన్ని తరగతి గదిలో ఎల్లప్పుడూ వెనుక బెంచిలో మాత్రమే కూర్చోబెట్టేవారు. ఎందుకని అడిగితే అతన్ని హేళన చేసేవారు. అయినా శ్రీకాంత్ వాటన్నింటినీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయాడు. అయితే శ్రీకాంత్ పరిస్థితిని అర్థం చేసుకున్న అతని తల్లిదండ్రులు శ్రీకాంత్‌ను వికలాంగుల పాఠశాలలో చేర్పించారు. కాగా అక్కడ కూడా చదువుల్లో శ్రీకాంత్ ఎల్లప్పుడూ ముందుండే వాడు. ఈ నేపథ్యంలోనే అతను 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. అయితే శ్రీకాంత్ కేవలం చదువుల్లోనే కాదు, క్రికెట్, చెస్ వంటి ఆటల్లోనూ అందరికన్నా ముందుండేవాడు.

విద్యలో అపారమైన తెలివితేటలను ప్రదర్శిస్తున్నా శ్రీకాంత్‌కు ఇంజినీరింగ్‌లో మాత్రం అంత త్వరగా అడ్మిషన్ లభించలేదు. ఐఐటీ, బిట్స్ పిలానీ వంటి ఎన్నో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ హాల్ టిక్కెట్‌ను కూడా తెచ్చుకోలేకపోయాడు. ఈ విషయంపై సదరు కాలేజీలను అతను ప్రశ్నిస్తే, అంధులకు తమ కాలేజీల్లో ప్రవేశం లేదని వారు తెగేసి చెప్పారు. దీంతో శ్రీకాంత్ కొద్దిగా నిరాశకు గురైనా వెంటనే తేరుకుని విదేశాల్లో విద్య కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రవేశం పొందాడు. అనంతరం ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశాడు.

అయితే కోర్సు ముగిసినా శ్రీకాంత్ మాత్రం అక్కడే ఉండిపోలేదు. మనదేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తనలాంటి మరెందరికో ఉపాధి కల్పించాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి అప్పటి మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో నిర్వహిస్తున్న లీడ్ ఇండియా ప్రాజెక్ట్‌లో పాలు పంచుకునేందుకు అవకాశం వచ్చింది. అనంతరం శ్రీకాంత్ వెనుదిరిగి చూడలేదు. కాలక్రమేణా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఓ కంపెనీకి సీఈవోగా మారాడు. అనంతరం అతను తనలా బాధపడుతున్న దాదాపు 3వేల మంది విద్యార్థులకు చేయూతనందించాడు. అంతేకాదు దాదాపు 150 మంది వికలాంగ నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించాడు.

ఇంత సాధించిన శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తే, ఇతరులకు సహాయం చేయడంలోనే గొప్ప మానవత్వం దాగి ఉందని, ప్రతి ఒక్కరు తోటి వారికి మంచి చేయాలని, తిరిగి ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుందని అంటాడు. ఇరుగు పొరుగు వారి మాటలను వినకుండా తల్లిదండ్రులు తనను ఇంతటి వాన్ని చేశారని, అందుకు వారికి తాను రుణపడి ఉంటానని అంటున్నాడు. ఈ ప్రపంచంలోని అందరిలోకెల్లా తన తల్లిదండ్రులే తనకు అత్యంత ధనవంతులుగా కనిపిస్తారని చెబుతున్నాడు.