బతుకు సారాన్ని అర్థం చేసుకోవాలన్నా.కాలం పోకడ .ప్రపంచ దారుల్లోకి ప్రయాణం చేయాలన్నా పుస్తకాలు తోడు కావాలి. అవి లేకుండా నేనుండలేను. శ్వాస పీల్చకుండా ఉండలేమో కానీ .పుస్తకాలు చదవకుండా.రాయకుండా .ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండడం చేతకాదు అంటారు ఓ సుప్రసిద్ధ తెలుగు కవి. పుస్తకాలు లేని గదులు ఆత్మలు లేని శరీరాల్లాంటివి. చిరిగి పోయిన దుస్తులు కట్టుకో పర్వాలేదు.కానీ ఓ మంచి పుస్తకం మాత్రం కొనకుండా ఉండకు అన్నారో సంఘ సంస్కర్త. టెక్నాలజీ పెరిగింది కాదనలేం. స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి.వాటిని అడ్డుకోలేం. ఇలా తాకితే అలా వాలిపోయే సమాచారం అమ్ముల పొదిలో ఉంటోంది.ఒప్పుకుంటాం.కానీ ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా .పత్రికల పఠనం ఆగలేదు. పుస్తకాలు కొనుగోలు పెరిగింది.
పాఠకులు గతంలో కంటే ఎక్కువయ్యారు. ఇందులో వ్యాపారం ఉంది. దాని వెనుక ఎన్నో మార్కెట్ మతలబులు ఉన్నాయి. అయినా పుస్తకాలు సూర్య చంద్రులున్నంత కాలం వెలుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మనుషుల్ని పక్కదారి పట్టకుండా కాపాడుకుంటూ వస్తాయి. అది ఆధ్యాత్మికమా.లేక సోషలిజమా.లేక కమ్యూనిజమా.లేక మార్క్సిజమా.లేదా కేపిటలిజమో ఏదైనా కానీ పుస్తకాలు ఏ కాలానికైనా అందివచ్చిన ఆయుధాలు. దట్టించిన తూటాల్లాంటివి కూడా ఉన్నాయి. మెదడుకు పదును పెట్టేవి.మనసుకు స్వాంతన చేకూర్చేవి. హృదయాలలో ప్రేమ విత్తనాలు నాటేవి.గుండెల్లో రక్తాన్ని చైతన్యవంతం చేసి.రోమాలు నిలిచేలా చేసే పుస్తకాలు కోకొల్లలు.
ప్రపంచంలో కాసింత మానవత్వం ఇంకా బతికే ఉందని అనుకుంటే అది మనుషుల వల్ల అనుకుంటే పొరపాటు పడినట్లే.కేవలం పుస్తకాల చొరవ వల్లనే ఇదంతా . పుస్తకాలు ఎన్నో.కానీ వాటి వెనుక ఎంతో శ్రమ. లెక్కలేనంత సారం దాగి ఉంటుంది. కుటుంబం మనల్ని ఎలా తోడ్పాటు అందిస్తుందో అంతకంటే పుస్తకాలు మనల్ని కాపాడతాయి. మెదళ్లకు మేత వేస్తాయి. ప్రశ్నించడం నేర్పుతాయి. జవాబులు ఇవ్వకుండానే మనల్ని పరీక్షిస్తాయి. కొందరు పుస్తకాలు లేకుండా ఉండలేరు. వారి జీవితమంతా పుస్తకాలను చదవడమే. ఆకళింపు చేసుకోవడమే.ఎక్కడ పుస్తకం కనిపించినా కొనుక్కోవడం.దాచుకోవడం.భద్రంగా ఆల్మారాలో ఉంచు కోవడం పరిపాటి. ఇదంతా యూనివర్శిటీలలో స్నేహితులు.ఉద్యోగులు.టీచర్లు, మేధావులు, ప్రోఫెసర్లు, కవులు, గాయకులు, రచయితులు, అధ్యాపకులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక, రాజకీయ వేత్తలు, బిజినెస్ టైకూన్స్ కూడా. వీరంతా ఏదో ఒక రోజు పుస్తకాలను చదివిన వారే. అవి లేకుండా బతలేని స్థితికి చేరుకున్న వారు ఎందరో . వీరందరి కోసం.పుస్తక ప్రియులను ఆకట్టుకునేందుకు.వారికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరికొన్ని పబ్లిషర్స్, పుస్తక ప్రియుల కోసం ఖర్చులు భరించి పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇంకా పుస్తకాల పట్ల ప్రేమను పెంచుతున్నాయి.
జీవిత చరిత్రలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్, సైకాలజీ, పిల్లల పుస్తకాలు ఇందులో కొలువై ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలను ప్రచురించే సంస్థలన్నీ ఈ మహోత్సవాల సందర్బంగా కొలువు తీరి ఉంటాయి. కావాల్సిందల్లా మనకు నచ్చిన వాటిని కొనుగోలు చేయడమే. పుస్తకాలను కొనడం, చదివించడం సాంస్కృతిక శాఖలు చాలెంజింగ్ తీసుకున్నాయి. స్టాళ్ల ఏర్పాటు విషయంలో కొంత ఖర్చు ఎక్కువగా ఉండడంతో చాలా మంది వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. విశాలాంద్ర, ప్రజాశక్తి , నలుపు, అలకనంద, ఎమెస్కో, తదితర సంస్థలు పుస్తకాలను ప్రింట్ చేస్తున్నాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చూస్తున్నాయి.తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతున్నాయి. పిల్లలు, పెద్దలకు కావాల్సిన ఏర్పాట్లు నిర్వాహకులు చేశారు. ఇంకొన్ని సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకాలను ఆవిష్కరించడం, కవులు, కళాకారులను సన్మానించడం, కవులతో కవితలు చదివించడం, జర్నలిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు విరివిగా జరుగుతున్నాయి. చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, కవులు ఎక్కువగా పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఇష్ట పడుతున్నారు. 311 స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీనిని ఉప రాష్ట్రపతి వెంకయ్య ప్రారంభించారు. ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవర్చు కోవాలని కోరారు. ప్రతి ఊరులో గ్రంథాలయం ఉండాలని సూచించారు. చదవడం వల్ల ఎంతో విజ్ఞానం అలవడుతుందన్నారు.
ప్రపంచాన్ని మార్చిన గొప్ప వ్యక్తులు, వారి విశేషాలు, జీవిత చరిత్రలతో పాటు పోరాటాలు, ఉద్యమాలు నడిపిన గొప్ప వీరుల గురించిన సాహిత్యం ఇందులో లభిస్తుంది. అంతేకాక రామకృష్న మిషన్, ఇస్కాన్, ఇషా లాంటి వారి పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. కార్ల్ మార్క్స్ దాస్ కేపిటల్, లెనిన్, క్యాస్ట్రో, హ్యూగో చావెజ్, చే గవేరా, బాబ్ మార్లే, బీబర్ లాంటి వాళ్ల పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. 10 రూపాయల నుండి 10 వేల రూపాయల దాకా పుస్తకాలు ఉన్నాయి. అనవసరంగా ఖర్చు చేసే కన్నా ఏదో ఒక మంచి పుస్తకాన్ని చదివితే జ్ఞానంతో పాటు పక్కదారి పట్టకుండా ఉండగలుగుతాం. పుస్తకాలు జీవితాన్ని ఆవిష్కరించే తలుపులు.ప్రపంచాన్ని చూపించే ద్వారాలు.!