రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు ఎవరు వచ్చినా.. సాక్షాత్తూ దేవుడే దిగి వచ్చినా సరే ఆంబులెన్స్‌లకు కచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. ఇది మన భారత రాజ్యాంగంలోనే రాసి ఉంది. అత్యంత ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఆంబులెన్స్ కూడా ఒకటి. అయితే మన దేశంలో నగరాల్లో ఉండే ట్రాఫిక్ జాం ల కారణంగా సకాలంలో పేషెంట్లను హాస్పిటల్స్‌కు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇది విచారించదగిన విషయమే. అయితే హర్యానాలో ఆ ఆంబులెన్స్‌కు మాత్రం ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కాలేదు. ఓ స్థానిక లీడర్ కారణంగా ఆలస్యం అయింది. దీంతో 30 నిమిషాల పాటు ఆంబులెన్స్ ఆగిపోయింది. అప్పటికే అందులో ఉన్న రోగి చనిపోయాడు. నిజంగా హృదయాన్ని కలచివేసిన ఘటన ఇది.
అది హర్యానాలోని ఫతేహాబాద్ ప్రాంతం. అక్కడ సీతారాం సోనీ అనే వ్యక్తి తన తల్లితో కలిసి తమ్ముడు నవీన్ సోనీ (42)ని హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నాడు. నవీన్ చావు బతుకుల మధ్య ఉండడంతో ఆంబులెన్స్ డ్రైవర్ చాలా వేగంగా వాహనాన్ని పోనిస్తున్నాడు. అయితే ఆ తొందరలో స్థానిక బీజేపీ కౌన్సిలర్ అయిన దర్శన్ నాగ్‌పాల్ కార్‌ను ఢీకొన్నాడు. దీంతో ఆ కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. అంతే.. వెంటనే దర్శన్ నాగ్‌పాల్ ఆ ఆంబులెన్స్‌ను తన కారులో వెంబడించాడు. నిమిషాల వ్యవధిలోనే ఆంబులెన్స్‌కు ఎదురుగా వెళ్లి దాన్ని ఆపేశాడు.
తన కారుకు డ్యామేజీ అయిందని, నష్టపరిహారం చెల్లించాలని ఆంబులెన్స్ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆంబులెన్స్‌లో పేషెంట్ ఉన్నాడని, త్వరగా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్ చెప్పినా అతను వినలేదు. నష్ట పరిహారం చెల్లించాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో 30 నిమిషాల పాటు ఆంబులెన్స్ అక్కడే రోడ్డుపై ఆగిపోయింది. తరువాత పోలీసులు సర్ది చెప్పి ఆంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఈ క్రమంలో హాస్పిటల్‌కు వెళ్లే సరికి నవీన్ సోనీ చనిపోయాడు. ఒక్క 15 నిమిషాల ముందు తీసుకుని వచ్చి ఉంటే కాపాడే వారమని వైద్యులు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీతారాం సోనీ సదరు కౌన్సిలర్ దర్శన్‌పై కేసు పెట్టాడు. ప్రస్తుతం పోలీసులు కేసు విచారిస్తున్నారు. నిజంగా మీరే చెప్పండి. ఇలాంటి లీడర్లు మనకు అవసరమా..?