భారీ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్ అని పెట్టారు…! అదే “షో రూము”ల కొంపముంచింది..!

మనం ఎక్సిబిషన్ కో లేదా సేల్ జరిగే సంతకో వెళితే “రండి బాబు రండి…ఆలసించిన ఆశాభంగం” అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కాకపోతే వారు చిరు వ్యాపారులు. వారు అమ్మేవి అత్యంత ఖరీదైన వస్తువులు కాదు. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ ద్విచక్రవాహనాలు అమ్మేవారు కూడా పాటిస్తున్నారు. వారు పాటించేలా చేసింది సుప్రీమ్ కోర్ట్ తీర్పు.

BSI-3ఇంజిన్లు క‌లిగి ఉన్న వాహ‌నాల‌ను ఏప్రిల్ 1, 2017 నుంచి విక్ర‌యించ‌రాద‌న్న సుప్రీంకోర్టు తీర్పుతో వాహ‌న ధ‌ర‌ల‌ను తగ్గించి సేల్‌కు పెడుతున్నాయి ఆయా కంపెనీలు. ప్ర‌ముఖ ద్విచ‌క్ర‌వాహ‌న కంపెనీ హీరో BSI-3 ఇంజిన్ క‌లిగిఉన్న వాహ‌నాల‌కు భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. హీరో బైక్స్ పై ఏకంగా రూ.12వేల 500 త‌గ్గింపు ఇచ్చింది. దీనికితోడు ఉచిత బీమా క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తున్నాయి.

కంపెనీల దగ్గర లక్షలాది బైక్స్ కు భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. దీంతో షోరూమ్స్ దగ్గర ఉదయం నుంచి రద్దీ పెరిగింది. హీరో, బజాజ్, హోండా బైక్ షోరూమ్స్ దగ్గర సందడి నెలకొంది. కనీసం 3 నుంచి 22వేల రూపాయల వరకు ఆఫర్ ప్రకటించటంతో వేలాది మంది ఉదయం నుంచే క్యూ కట్టారు.

నాకూ డిస్కౌంట్ కావాలి :
బైక్ షోరూమ్స్ దగ్గర సరికొత్త చిత్రాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల క్రితం బైక్ బుక్ చేసుకున్న వారు ఇప్పుడు డెలివరీ తీసుకోవటానికి నో అంటున్నారు. BS-111 ఇంజిన్ బైక్ కదా.. మాకూ డిస్కౌంట్ కావాలని అని పట్టుబడుతున్నారు. వాటిని తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు. చివరి రోజుల్లో ఆఫర్ ఇచ్చి.. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఎందుకివ్వరు అని ప్రశ్నిస్తున్నారు. డిస్కౌంట్ ఇస్తేనే బైక్ డెలివరీ తీసుకుంటామని.. లేకపోతే వద్దని ఫైటింగ్ కు దిగుతున్నారు. దీంతో షోరూమ్స్ దగ్గర రచ్చ రచ్చ అవుతుంది.

డిమాండ్ తో డిస్కౌంట్ తగ్గించారు:
నిన్నటి వరకు బాబూ బైక్ కావాలా.. రూపాయి కూడా చెల్లించొద్దు.. మొత్తం ఫైనాన్స్ ఇస్తాం అని స్కీమ్స్ పెట్టినోళ్లు.. ఇప్పుడు మాత్రం నో స్టాక్ అంటున్నారు. డిమాండ్ పెరగటంతో నో స్టాక్ అంటున్నారు. కస్టమర్లను చూసి డిస్కౌంట్ తగ్గిస్తున్నారు. పాత మోడల్స్, ఫెయిల్ అయిన బండ్లకు మాత్రమే పూర్తి స్థాయిలో డిస్కౌంట్ ఇస్తాం అని చెబుతుండటంతో గొడవలకు దిగుతున్నారు. 22వేలు డిస్కౌంట్ అని.. ఇప్పుడు 18వేలు, 15వేలు అని చెప్పటంతో కొందరు ఆగ్రహంతో ఊగిపోయారు. అన్ని మోడల్ వెహికల్స్ కు ఆఫర్ ఇచ్చి.. షోరూంకి వస్తే కొన్నింటికే అని చెప్పటం ఏంటని నిలదీస్తున్నారు. ఈ గొడవలను భరించలేక… సోమాజిగూడలోని హోండా షోరూంను మూసివేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉన్న స్టాక్ కు బుకింగ్స్ తీసుకుని.. నో స్టాక్ బోర్డులు పెట్టారు.

Comments

comments

Share this post

scroll to top