ఇటీవలే జరిగిన మంత్రి నారాయణ కొడుకు నిషిత్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. అత్యంత సేఫ్టీ ఉన్న కారు అయినప్పటికీ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడపడంతో అది అదుపు తప్పి మెట్రో పిల్లర్‌కు ఢీకొట్టింది. దీంతో నిషిత్‌తోపాటు అతని స్నేహితుడు కూడా ఆ ప్రమాదంలో మృతి చెందాడు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ ప్రమాదం గురించే. కానీ అది రోడ్డు మీద కాదు, రేసింగ్ ట్రాక్ మీద జరిగింది. అది ఇక్కడ కాదు, ఇటలీలో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఆ రేస్‌లో పాల్గొన్న రేసర్‌కు ఏమీ కాలేదు.
ఇటలీలో జరుగుతున్న వరల్డ్ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌లో యుజెన్ లావెర్టీ అనే వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ఇంకా కొన్ని ల్యాప్‌లు అయితే రేస్ ముగుస్తుంది అనగా లావెర్టీ బైక్ ముందు చక్రంలో సమస్య వచ్చింది. దీంతో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే వెంటనే లావెర్టీ అప్రమత్తమై దాన్ని రేస్ ట్రాక్ నుంచి పక్కకు తప్పిస్తూ అదే క్రమంలో దానిపై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో బైక్ గ్యాలరీ వైపు దూసుకెళ్లి ఒక్క సారిగా పేలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా రేసర్ లావెర్టీకి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అతను కోలుకుని అభిమానులకు తాను బాగానే ఉన్నానని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా అతను గనక ఆ సమయంలో వెంటనే స్పందించి ఉండకపోతే ఆ మంటలకు అతను కూడా ఆహుతైపోయేవాడు. ఏది ఏమైనా ప్రమాదాలనేవి మనకు చెప్పి రావు కదా. చెప్పకుండానే వస్తాయి. అయితే అవి జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే లావెర్టీలా బతికి బయటపడవచ్చు. లేదంటే ఇక అంతే సంగతులు..!