న‌మ‌స్కార్‌, ఆశీర్వాద్ లాంటి ప‌దాల‌కు హిందీలో స్పెల్లింగ్ రాని మ‌హిళ బీహార్‌లో స్కూల్ ప్రిన్సిపాల్ అట‌… హ‌త‌విధీ..!

ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ టాప‌ర్ స్కాం గుర్తుందిగా..! బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్ ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన ఇద్ద‌రు విద్యార్థుల‌ను మీడియా ప‌లు ప్ర‌శ్న‌లు అడ‌గ్గా అందుకు వారు త‌ల‌తిక్క స‌మాధానాలు చెప్పారు. దీంతో ఆ రాష్ట్ర స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్ పరీక్ష‌ల స్కాం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా ఆ ఇద్ద‌రు విద్యార్థుల‌తోపాటు ఆ స్కాం వెనుక ఉన్న ప‌లువురు వ్యక్తుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం పోయిన త‌మ రాష్ట్ర ప‌రువును నిల‌బెట్టుకునేందుకు అక్క‌డి విద్యావ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు న‌డుం బిగించింది. కాగా ఈ ప్రక్షాళ‌న ప్ర‌ణాళిక‌లో భాగంగా ప‌లువురు జిల్లా క‌లెక్ట‌ర్లే స్వ‌యంగా వెళ్లి త‌మ త‌మ ప్రాంతాల్లో ఉన్న పాఠ‌శాల‌ల‌ను, అక్క‌డి అధ్యాప‌కుల‌ను, విద్యార్థుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డం, త‌నిఖీలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో టాప‌ర్ స్కాం లాంటిదే మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే…

bihar-school-principal

బీహార్‌లోని బ‌క్స‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ర‌మ‌ణ్ కుమార్ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు త‌న జిల్లాలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌న్నింటినీ ఇటీవ‌లి కాలంలో క్షుణ్ణంగా త‌నిఖీలు చేయ‌డం మొద‌లు పెట్టారు. అందులో భాగంగా రాజ్‌పూర్ అనే ప్రాంతంలో ఉన్న ఓ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో తాజాగా త‌నిఖీలు చేశారు. కాగా ఆ పాఠ‌శాల‌కు ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్న రూబీ కుమారి ప్ర‌తిభ‌కు ర‌మ‌ణ్ కుమార్ అవాక్క‌య్యారు. ఆమెకు ఉన్న నాలెడ్జ్‌ని టెస్ట్ చేయ‌ద‌లిచిన ఆ క‌లెక్ట‌ర్ ‘న‌మ‌స్కార్‌’, ‘ఆశీర్వాద్’ అనే రెండు ప‌దాల‌ను హిందీలో బ్లాక్ బోర్డ్‌పై రాయ‌మ‌ని అడగ్గా, అందుకు రూబీ కుమారి త‌ప్పుగా జ‌వాబులు రాసింది. ఈ క్ర‌మంలో స‌రైన స‌మాధానం కోసం ఆమె ఎన్నో విధాలుగా రాసి చూసేందుకు య‌త్నించింది. కానీ అన్ని ప్ర‌య‌త్నాల్లోనూ విఫ‌ల‌మైంది. దీంతో ఆమె ప్ర‌తిభ‌ను చూసిన క‌లెక్ట‌ర్ ర‌మ‌ణ్ కుమార్‌కు షాక్ అవ‌క త‌ప్ప‌లేదు. కాగా త‌న వద్ద స‌హాయ‌కుడిగా ప‌నిచేస్తున్న మ‌రో వ్య‌క్తిని కూడా ఆ రెండు ప‌దాల‌ను హిందీలో రాసి చూప‌మ‌ని ర‌మ‌ణ్ కుమార్ అడిగారు. అత‌ను కూడా స‌రిగ్గా రాయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీన్ని బ‌ట్టి చూస్తే చాలు బీహార్‌లో విద్యావ్య‌వ‌స్థ ఎంత ప‌రిహాసంగా మారిందో తెలుస్తోంది. అక్క‌డి విద్యారంగంలో అవినీతి ఏ మేర‌కు వేళ్ల వ‌ర‌కు వ్యాపించిందో పైన చెప్పిన ఒక్క సంఘ‌ట‌న చాలు. అవినీతి ప‌రులు ఇచ్చే డ‌బ్బుల‌కు ఆశ ప‌డి అస‌లైన ప్ర‌తిభ ఉన్న వారిని గుర్తించ‌కుండా న‌కిలీ టాప‌ర్ల‌కు అవ‌కాశ‌మిస్తే పైన చెప్పిన స్కూల్ ప్రిన్సిపాల్‌లాగే అవుతుంది. కాగా ఆ స్కూల్‌కు చెందిన ఇంకో విష‌య‌మేమిటంటే అక్క‌డ ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న రేఖా కుమారి అనే మహిళ నెల‌లో కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే స్కూల్‌కు వ‌స్తుంద‌ట‌. అంటే మిగ‌తా రోజుల‌కు స్కూల్‌కు రాకుండానే నెల మొత్తం వ‌చ్చిన‌ట్టు మేనేజ్ చేసి నెలా నెలా జీతం తీసుకుంటున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. దీంతో ఆ పాఠ‌శాల‌లో ఉన్న మొత్తం 43 మంది విద్యార్థుల‌లో రోజూ కేవ‌లం 16 మంది మాత్ర‌మే స్కూల్‌కు వ‌స్తున్నార‌ట‌. ఈ సంఘ‌ట‌న ఒక్క‌టి చాలు, బీహార్ విద్యావ్య‌వ‌స్థ ఎలా న‌డుస్తుందో చెప్ప‌డానికి.

మ‌న దేశంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లంటేనే జ‌నాల‌కు న‌చ్చ‌వు. సౌక‌ర్యాలు ఉండ‌వు, చ‌దువు స‌రిగ్గా చెప్ప‌రనే కార‌ణాల‌తో ప్రైవేటు పాఠ‌శాల‌ల్లోనే త‌మ త‌మ పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాలు మారినా, నాయ‌కులు మారినా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ప‌రిస్థితిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. బీహార్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. కాక‌పోతే అక్క‌డ విద్యారంగంలో అవినీతి మ‌రీ పెచ్చ‌రిల్లిపోయింది. కాబ‌ట్టే ఒక్కో సంఘ‌ట‌న వెలుగులోకి వ‌స్తోంది. ఇంకా దేశంలో ఇలాంటి స్కూళ్లు ఎన్ని ఉన్నాయో, ఏమో! ఈ సంఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల్ని పంపే వారు మ‌రోసారి ఆలోచిస్తారేమోన‌నిపిస్తోంది. అంతే క‌దా, మ‌రి! చూసి చూసి త‌మ పిల్ల‌ల‌ను చ‌దువు కోసం న‌కిలీ ఉపాధ్యాయుల వ‌ద్ద‌కు ఎవ‌రు పంపుతారు చెప్పండి!

Comments

comments

Share this post

scroll to top