ఈ ఏడాది దీపావళికి కొన్ని రోజుల ముందు ఢిల్లీలో పటాకులు పేల్చవద్దని, అమ్మవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై అనేక వివాదాలు కూడా చెలరేగాయి. అయితే నిజానికి ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏమిటంటే… కాలుష్యం. ఢిల్లీలో ఉపేక్షించడానికి వీలు లేని స్థాయిలో కాలుష్యం ఉంది. అందుకనే సుప్రీం కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. కాగా ఢిల్లీ సంగతి పక్కన పెడితే అసలు దీపావళి రోజున మన దేశంలో ఏ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందో తెలుసా..? అదే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి రోజున రాజస్థాన్‌లోని భీవాడిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది. అక్కడ దీపావళి రోజున గాలిలో ఒక క్యుబిక్ మీటర్‌కు 425 మైక్రోగ్రాముల కాలుష్య కణాలు ఉన్నట్టు సీపీసీబీ తెలియజేసింది. నిజానికి ఈ ప్రాంతం కూడా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోకి వస్తుంది. ఇక భీవాడి తరువాత స్థానంలో కోల్‌కతా నిలిచింది. అక్కడ గాలిలో ఒక క్యుబిక్ మీటర్‌కు 358 మైక్రోగ్రాముల కాలుష్య కణాలు ఉన్నట్టు గుర్తించారు. దాని తరువాత స్థానంలో ఆగ్రా నిలిచింది. అక్కడ 332 మైక్రోగ్రాముల కాలుష్య కణాలు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇవి సాధారణ స్థాయిల కన్నా చాలా ఎక్కువ కావడం గమనార్హం.
అయితే గతేడాది దీపావళి రోజున మాత్రం దేశంలోనే అత్యంత ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఆగ్రా మొదటి స్థానంలో నిలవగా ఇప్పుడది 3వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ అక్కడ కాలుష్యం పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ సారి పటాకులు కాల్చనప్పటికీ అక్కడ కాలుష్యం మాత్రం ఎక్కువగానే ఉంది. కానీ గతేడాది కన్నా అది తక్కువే. అయితే ఈ మధ్యే ఢిల్లీలో కాలుష్యం ఇంకా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ సరి, బేసి విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇదిలాగే కొనసాగితే దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ ఇలా త్వరలో సరి బేసి విధానం రావడం ఖాయం. అయినప్పటికీ మనం వినం కదా. ఇక ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు ఏకంగా మంచి గాలి పీల్చుకునేందుకు నిజంగా ఆక్సిజన్ సిలిండర్లను కొనాల్సి వస్తుందేమో..! అంత దాకా రాకుండా ముందే ఏవైనా చర్యలు చేపడితే బెటర్..!