పిల్ల‌ల‌కు కొనే తిను బండారాల ప్యాకెట్ల‌లో ఆట‌బొమ్మ‌లు ఉంటే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

చిరు తిండి అంటే చిన్నారులు ఎంత ఇష్టంగా తింటారో అంద‌రికీ తెలిసిందే. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌… ఇలా ఏది కొనిచ్చినా వారు ఆబ‌గా తినేస్తారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ అవి చీప్ క్వాలిటీతో త‌యారు చేస్తార‌ని మాత్రం త‌ల్లిదండ్రులు ఆలోచించ‌రు. దీంతో వారు అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. అయితే ఈ విష‌యం అటుంచితే… ఆ తినుబండారాల ద్వారా ఇచ్చే ప‌లు ఆక‌ర్షణీయ‌మైన ఆట వస్తువుల బారి నుంచి మాత్రం పిల్ల‌ల‌ను ర‌క్షించుకోవాల్సిందే. లేదంటే ఆ బాలుడికి జ‌రిగిన‌ట్టే జ‌ర‌గ‌వ‌చ్చు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. రాణీ నగర్‌కు చెందిన నిరీక్షణ్ డైమండ్స్ రింగ్స్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. రింగ్స్ తినే సమయంలో ప్యాకెట్‌లో కనిపించిన ప్లాస్టిక్ బొమ్మను సైతం తినే వస్తువు అనుకొని మింగేందుకు యత్నించాడు. దీంతో ఆ ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుంది. ఇంట్లో వాళ్లు గమనించి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిరీక్షణ్ మృతి చెందాడు.

కాగా బొమ్మ గొంతుకు అడ్డం పడడంతో ఊపిరి తీసుకోవడం కష్టమై నిరీక్షణ్ ప్రాణాలొదిలాడు. బిడ్డ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. డైమండ్ కంపెనీ నిర్వాహకులు పిల్లలను ఆకర్షించే విధంగా చేగోడీల ప్యాకెట్‌కు జతగా ఫ్రీ ఏమోజీ అంటూ చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలను ప్యాకెట్ లోపలే పెట్టి ఇస్తున్నారు. చిన్న పిల్లలు తినే ప్యాకెట్లలో బొమ్మలు పెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. డైమండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా… క‌నుక మీరు కూడా పిల్ల‌ల‌కు తిన‌బండారాలు కొనిచ్చేట‌ప్పుడు ఇలాంటి ఆట వ‌స్తువులు గ‌న‌క వాటిల్లో ఉంటే జాగ్ర‌త్త ప‌డండి. వాటిని తీసి ప‌క్క‌కు పెట్టండి. లేదంటే అది ప్రాణాల మీద‌కు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top