బెంగాల్ టీ ఎస్టేట్‌ల‌లో కార్మికుల ఆక‌లి కేక‌లు… తిండి దొర‌క్క ఆక‌లితో మృత్యువాత ప‌డుతున్న శ్ర‌మ‌జీవులు…

ఇల్లు, ఆఫీస్‌, హోట‌ల్… ఇలా ప్రాంత‌మేదైనా వేడి వేడి చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్ట‌డం మ‌న‌కు అల‌వాటు. కానీ ఆ చాయ్ త‌యారయ్యేందుకు కావ‌ల్సిన ముఖ్య ప‌దార్థాల్లో ఒకటైన తేయాకు పొడి ఎలా వ‌స్తుందో తెలుసా? నిత్యం య‌జ‌మానుల చేతుల్లో అన్ని ర‌కాల దోపిడీల‌కు గుర‌వుతూ, ప‌ట్టించుకునే వారు లేక‌, పూట గ‌డ‌వ‌ని స్థితిలో, ఆక‌లితో అల‌మ‌టిస్తూ, అనారోగ్యాల‌కు లోన‌వుతూ మృత్యువాత ప‌డుతున్న కార్మికుల శ్ర‌మ నుంచి ఆ పొడి త‌యార‌వుతోంది. కానీ మ‌న‌కు అవేవీ తెలియ‌వు. మ‌న‌కై మ‌నం స్వేచ్ఛ‌గా బ‌త‌కాల‌ని, మ‌న‌పై ఇత‌ర దేశాల వారు పెత్త‌నం చేయ‌వ‌ద్ద‌న్న కార‌ణంతో తెల్ల‌వాడి నుంచి స్వాతంత్ర్య‌మైతే తెచ్చుకున్నాం గానీ ఇప్ప‌టికీ ఆకలితో అల‌మటించే చావులు మాత్రం త‌గ్గ‌లేదు. బెంగాల్ టీ ఎస్టేట్స్‌లో చెప్ప‌లేని దీనావ‌స్థ‌లో బ‌తుకులు వెళ్ల‌దీస్తున్న తేయాకు కార్మికుల జీవితాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఆ మ‌హిళ పేరు దుఖ్ని (30). బెంగాల్ టీ ఎస్టేట్‌లో దిన‌స‌రి కార్మికురాలిగా ప‌నిచేసేది. ఆమె భ‌ర్త కూడా అదే ప‌ని చేసేవాడు. కాగా నిత్యం శ్ర‌మ దోపిడీకి గుర‌య్యే వీరికి స‌రైన ఆహారం అంద‌ని కార‌ణంగా దుఖ్ని అప్ప‌టికే చిక్కి శ‌ల్య‌మైంది. క‌నీసం మంచంపై నుంచి లేవ‌లేని స్థితికి చేరుకుందంటే ఆమె ప‌రిస్థితి ఏమిటో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఆ స‌మ‌యంలో వారి ఆహారం ఏమిటో తెలుసా. గుప్పెడు అన్నం, నాలుగు ఆలుగడ్డ‌లు మాత్ర‌మే. అవి ఇద్ద‌రికి ఎలాగూ స‌రిపోవు. దీనికి తోడు దుఖ్ని తీవ్ర‌మైన అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఆమెకు క‌నీసం రెండు యూనిట్ల ర‌క్తం అవ‌స‌ర‌మ‌ని, లేదంటే బ‌త‌క‌ద‌ని వైద్యులు చెప్పేశారు. కాగా ఇదే విష‌యాన్ని దుఖ్ని భ‌ర్త గ‌ద్గ‌ద స్వ‌రంతో చెప్ప‌డం అంద‌రినీ క‌ల‌చి వేసింది. త‌న భార్య‌కు వైద్యం అందించేందుకు కూడా డ‌బ్బులు లేవ‌ని, ఆమె ఇక బ‌త‌క‌ద‌ని అత‌ను అత్యంత దుఃఖ పూరిత‌మైన వ‌ద‌నంతో త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కాడు. అటు పిమ్మ‌ట దుఖ్ని ఎలాగూ బ‌త‌క‌లేదు. రాఠియా ఖారియా అనే మ‌రో వ్య‌క్తిది కూడా దాదాపుగా ఇదే ప‌రిస్థితి. టీ ఎస్టేట్స్‌లో చెల్లించే డ‌బ్బులు ఏ మాత్రం స‌రిపోక‌పోవ‌డంతో పూట గ‌డ‌వ‌డ‌మే అత‌నికి క‌ష్టంగా ఉండేది. ఈ క్ర‌మంలో దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు కేవ‌లం గంజి మాత్ర‌మే తాగాల్సి వ‌చ్చింది. దీంతో స‌రైన ఆహారం అంద‌క‌, ఆక‌లితో అల‌మ‌టిస్తూ అత‌ను మృతి చెందాడు.

bengal-tea-estates-workers

కేవ‌లం ఈ రెండు కుటుంబాలే కాదు, ఇలాంటి లెక్క‌లేన‌న్ని కుటుంబాలు బెంగాల్‌లోని జ‌ల్‌పయ్‌గురి, బంద‌పానీ టీ గార్డెన్‌లో అత్యంత దీనావ‌స్థ‌లో బ‌తుకులు వెళ్ల‌దీస్తున్నాయి. కొంత మందికి తిన‌డానికి బియ్యం, కూర‌గాయ‌లైనా దొరుకుతాయి, కానీ అధిక శాతం మంది ఆహారం ఏంటో తెలుసా? ఎలుక‌లు, పాములే. అవి కూడా ఇప్పుడక్క‌డ దొర‌క‌డం లేదట‌. దీంతో వారి ప‌రిస్థితి మ‌రింత హృద‌య విదార‌కంగా మారింది. 2000 నుంచి 2010వ సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో దాదాపు 1400 మంది కార్మికులు పౌష్టికాహార లోపంతో మృతి చెందార‌ని, కేవ‌లం 2015లోనే దాదాపు 80 మంది వ‌ర‌కు మృతి చెందార‌ని గణాంకాలు చెబుతున్నాయి.

బెంగాల్ టీ ఎస్టేట్స్‌లో ప‌ని చేసే కార్మికులంద‌రిదీ దాదాపు ఇదే ప‌రిస్థితి. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. వ్య‌వ‌సాయం ఆధారంగా ప‌నిచేసుకుని బతికే దిన‌స‌రి కార్మికుల‌కు క‌నీస వేత‌నం రోజుకు రూ.200 ఇవ్వాల‌ని చ‌ట్టాలు చెబుతున్నాయి. కానీ టీ ఎస్టేట్ కార్మికుల‌కు ద‌క్కుతోంది కేవ‌లం రూ.50 మాత్ర‌మే. అది కూడా కొంత మందికి స‌రిగ్గా అంద‌డం లేదు. దీనికి తోడు వారికి పీఎఫ్ ఉండ‌దు. సంవ‌త్స‌రంలో కేవ‌లం కొన్ని సీజ‌న్ల‌లో మాత్ర‌మే టీ ఎస్టేట్స్ న‌డుస్తాయి. ఇక మిగిలిన రోజులు వారు ప‌స్తులుండాల్సిందే. వైద్య స‌దుపాయాలు అస‌లే లేవు. వారు ప‌నిచేసే చోటు అత్యంత మారుమూల ప్రాంతం కావ‌డంతో అక్క‌డ హాస్పిట‌ల్స్ కూడా ఉండ‌వు. దీంతోపాటు వారికి వైద్యం కోసం ఇచ్చే ఆ కాసిన్ని రూపాయలు ప‌ట్ట‌ణంలోకి వెళ్ల‌డానికే స‌రిపోవు. ఈ నేప‌థ్యంలో ఇంకా ఎన్నో ఇలాంటి కార‌ణాల‌తో టీ ఎస్టేట్ కార్మికుల జీవితాలు నేడు అత్యంత ద‌య‌నీయ స్థితికి చేరుకున్నాయి. ఇప్ప‌టికైనా మ‌న నాయ‌కులు క‌ళ్లు తెర‌చి, వారి క‌ష్టాల‌ను తెలుసుకుని వారిని ఆద‌రిస్తార‌ని, ఆక‌లితో ఎవ‌రూ చ‌నిపోకుండా చూస్తార‌ని ఆశిద్దాం. చాయ్ పే చ‌ర్చ‌లా చ‌ర్చా కార్య‌క్ర‌మాలు కాకుండా టీ కార్మికుల జీవితాల‌ను బాగు చేసే ఏదైనా మంచి అంశంపై వారు చ‌ర్చించాల‌ని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top