బాహుబ‌లి 2 బెనిఫిట్ షోలు తెలంగాణ‌లో లేవు..! అధిక ధ‌ర‌ల‌కు టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తే ప్రేక్ష‌కులు ఫిర్యాదు చేయ‌వ‌చ్చిలా..!

బాహుబ‌లి 2 సినిమా… ఈ నెల 28వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీన్ని చూసేందుకు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చాలా మంది టిక్కెట్ల‌ను ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నారు. చాలా మంది థియేట‌ర్ల వ‌ద్ద ప‌డిగాపులు కాసి మ‌రీ టిక్కెట్ల‌ను కొంటున్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే… కానీ కొన్ని థియేట‌ర్లు మాత్రం బాహుబ‌లి 2 సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆస‌క్తిని క్యాష్ చేసుకోవాల‌ని చూశాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని మల్టీప్లెక్సుల్లో టిక్కెట్‌తోపాటు పాప్ కార్న్‌, కూల్ డ్రింక్స్ వంటి వాటిని కాంబో పేరుతో బ‌ల‌వంతంగా అమ్మ‌డం మొద‌లుపెట్టారు. ఇంకా కొన్ని థియేట‌ర్ల‌లో అయితే అనుమ‌తికి మించిన షోల‌ను వేస్తున్నారు. దీంతో తెలంగాణ స‌ర్కారు థియేట‌ర్ యాజ‌మాన్యాలపై సీరియ‌స్ అయింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఏ థియేట‌ర్ అయినా అనుమ‌తికి మించిన షోల క‌న్నా ఎక్కువ వేసుకోరాదు. బెనిఫిట్ షోల‌కు అస‌లు అనుమ‌తి లేదు. రోజుకు కేవ‌లం 5 ఆట‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అదేవిధంగా టిక్కెట్ ధ‌ర క‌న్నా ఎక్కువ‌కు విక్ర‌యించ‌రాదు. ఇత‌ర తినుబండారాలు క‌లిపి బ‌ల‌వంతంగా కాంబో టిక్కెట్లు అమ్మ‌రాదు. బ్లాక్ లోనూ ఏ థియేట‌ర్ యాజ‌మాన్యం టిక్కెట్లు అమ్మ‌రాదు. ఈ రూల్స్‌ను అతిక్ర‌మిస్తున్న‌ట్టు ప్రేక్ష‌కులు ఎవ‌రైనా గుర్తిస్తే వారు 1800-4253787 టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

అయితే శుక్ర‌వారం (ఏప్రిల్ 28) విడుద‌ల తేదీ క‌న్నా ముందు రోజే అంటే ఏప్రిల్ 27న కొన్ని థియేట‌ర్లు రాత్రి షోల‌ను వేస్తున్నాయి. వాటికి కూడా అనుమ‌తి లేద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విడుద‌ల తేదీ రోజే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో బాహుబ‌లి 2 సినిమా ఆడే ఏ థియేట‌ర్‌లో అయినా ప్రేక్ష‌కులు త‌మ‌కు అసౌక‌ర్యం క‌లిగితే పైన చెప్పిన నంబ‌ర్‌కు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఆగ‌డాలకు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు హెచ్చ‌రించారు. మీలో ఎవ‌రికైనా ఒక వేళ న‌ష్టం, ఇబ్బంది క‌లిగితే ఫిర్యాదు చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top