రేపిస్టు పోలీస్ అధికారికి జైలు శిక్ష పడేలా చేసిన ఆ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

అన్యాయం జరిగిందని బాధ పడడం కాదు, అందుకు కారణమైన వారికి తగిన శిక్ష పడేలా సమయస్ఫూర్తితో వ్యవహరించడమే నేడు బాధితులు చేయాల్సిన పని. నిందితులు ఎంత భయపెట్టినా, బెదిరింపులకు గురిచేసినా ధైర్యం కోల్పోకుండా అనుక్షణం న్యాయం కోసం పోరాడాలి. అంతేకానీ ఎట్టి పరిస్థితిలోనూ ఓటమిని అంగీకరించకూడదు. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని భావించి అదే నమ్మకంతో పోరాటం చేయాలి. సరిగ్గా ఇదే తెగువతో ఓ యువతి తనకు జరిగిన అన్యాయం పట్ల పోరాడింది. ఎట్టకేలకు న్యాయస్థానంలో విజయం సాధించి నిందితుడికి శిక్ష పడేలా చేసింది. అంతేకాదు తనలా అన్యాయానికి గురైన, గురవుతున్న ప్రతి ఒక్క యువతి, మహిళ ధైర్యంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ఆమే సాక్షి విద్యార్థి.

sakshi-vidyarthi

అది 2010వ సంవత్సరం. అప్పుడు సాక్షి విద్యార్థికి 15 ఏళ్లు. ఆమె తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. వారిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో. అక్కడే పోలీసు విభాగంలో డీఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్న అమర్‌జీత్ షాహి అనే వ్యక్తి సాక్షి కుటుంబానికి పరిచయమయ్యారు. అనంతరం అతను ఆ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలగసాగాడు. ఆ సమయంలో అతనికి ఓ భార్య కూడా ఉంది. ఆమెను కూడా సాక్షి కుటుంబానికి పరిచయం చేసి ఇంకా వారికి దగ్గరయ్యాడు. అయితే అప్పటికే సాక్షిపై షాహి కన్ను పడింది. ఈ క్రమంలో ఆ కుటుంబంతో ఉన్న పరిచయం దృష్ట్యా షాహి అదే ఏడాది నవంబర్ 8న సాక్షి ఇంటికి అదను చూసుకుని వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో సాక్షి ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఆ ఇంటికి వచ్చిన షాహి కుశల ప్రశ్నలు వేశాక టీ కావాలని సాక్షిని అడిగాడు. సాక్షి వెంటనే రెండు కప్పుల్లో టీ తెచ్చింది. తనకు ఒక గ్లాస్ వాటర్ కావాలని షాహి ఆమెను అడిగాడు. దీంతో ఆమె మరోసారి వంటింట్లోకి వెళ్లింది. అయితే షాహి అదే సమయాన్ని అనువుగా చూసుకుని ఓ కప్పులో మత్తు మందు కలిపాడు. ఇదేమీ తెలియని సాక్షి అతనికి నీరు తెచ్చిచ్చి, అనంతరం ఆ కప్పులోని టీని తాగింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. అప్పుడే షాహి ఆమెను వివస్త్రగా చేసి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటి సహాయంతో ఆమెను బెదిరిస్తూ తన కోరిక తీర్చాలని, లేదంటే వాటిని ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ చేస్తానని సాక్షిని అతను భయపెట్టాడు. దీంతో అందరు ఆడపిల్లల్లాగే సాక్షి అతనికి లొంగిపోయింది. అప్పటి నుంచి ఒక ఏడాది వరకు ఆమెను షాహి అలా బలాత్కారం చేస్తూనే వచ్చాడు. కాగా ఒక రోజు సాక్షి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే షాహి చేసిన పనిని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అప్పటి వరకు స్నేహంగా నటించిన షాహి అసలు స్వరూపం బయటకు తెలిసింది.

కాగా సాక్షి, అతని తండ్రి ధైర్యంగా నిలబడి షాహిపై కేసు పెట్టారు. ఓ క్రమంలో అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా కూడా అతను వారిపై తన వేధింపులను ఆపలేదు. గతంలో పోలీస్ అధికారి కావడంతో ఆ వృత్తి ద్వారా వచ్చిన సహజమైన బెదిరింపు గుణాన్ని వారిపై ప్రదర్శించాడు. కానీ వారు ఆ బెదిరింపులకు భయపడలేదు. ఎట్టకేలకు కోర్టులో కేసు నడవగా గత ఏడాది మే 18న షాహికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల ఫైన్ పడింది. చివరికు ఎలాగైతేనేం అన్యాయంపై న్యాయమే విజయం సాధించింది. అయితే సాక్షి అంతటితో ఊరుకోలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఏకంగా ఓ డాక్యుమెంటరీనే తీసింది. తనలాంటి బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని వారికి పిలుపునిస్తోంది. నిజంగా సాక్షి చూపిన తెగువకు, ధైర్యానికి మనం ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! అన్నట్టు ఇంకో విషయం. యువతులు ధైర్యంగా ముందడుగు వేయాలంటూ సాక్షి చూపుతున్న చొరవకు, ఆమె డాక్యుమెంటరీకి పలు సాహస అవార్డులు కూడా లభించాయి.

సాక్షి తీసిన డాక్యుమెంటరీని కింద వీక్షించవచ్చు…

Comments

comments

Share this post

scroll to top