జాతీయ రహదారులే కాదు, అసలు ప్రధాన రహదారి పక్కన ఎక్కడ వైన్ షాపు ఉన్నా కొందరు డ్రైవర్లు అక్కడికక్కడే ఆగి, పూటుగా తాగి మరీ వెళ్తుంటారు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఈ మధ్య పలు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అవి అందరికీ తెలుసు కదా..! అదేనండీ… జాతీయ రహదారుల పక్కన ఉన్న వైన్ షాపులను వెంటనే తొలగించి వాటిని లోపలికి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది కదా..! అయితే సుప్రీం కోర్టు అలా ఆదేశాలు జారీ చేయడానికి కారణం ఎవరో తెలుసా..? హర్మాన్ సింగ్ సిద్ధు అనే వ్యక్తే అందుకు కారణం. ఇంతకీ ఆయన ఏం చేశాడు..? ఎందుకు సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులను ఇచ్చింది..?
అది 1996 అక్టోబర్ 24వ తేదీ. హర్మాన్ సింగ్ సిద్ధు తన ముగ్గురు స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ నుంచి చండీగఢ్ వెళ్తున్నాడు. కాగా ఓ కొండ ప్రాంతానికి చేరగానే అనుకోకుండా వారి కారు నడిపిస్తున్న డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఆ కారు కాస్తా లోయలో పడింది. అయితే అదృష్టవ శాత్తూ ఎవరూ చనిపోలేదు. అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. కానీ హర్మాన్ సింగ్‌కు మాత్రం వెన్నెముక బాగా దెబ్బతింది. దీంతో అతని శరీరంలో కింది భాగానికి పక్షవాతం వచ్చింది. అది అతన్ని వీల్ చెయిర్ కే పరిమితం చేసింది. అప్పుడు అతని వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. అయితే తమ కారు ప్రమాదానికి కారణం తాగి ఉన్న డ్రైవరేనని తెలుసుకున్నాడు హర్మాన్ సింగ్. వారు వస్తున్న దారిలో ఉన్న వైన్ షాపులో డ్రైవర్ మద్యం సేవించి కారు నడిపాడని అతనికి తెలిసింది. దీంతో హర్మాన్ ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే… దేశంలో ఎక్కడా జాతీయ రహదారుల పక్కన అసలు మద్యం షాపులు ఉండరాదని. అందుకోసం అతను సుప్రీం కోర్టులో ఓ పిల్ కూడా వేశాడు.
అయితే అలా పిల్ వేయడంతో అతనికి మద్యం మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా హర్మాన్ భయపడలేదు. ఎలాగైనా పిల్ నెగ్గేలా చేయాలనుకున్నాడు. ఓ వైపు వీల్ చెయిర్‌కే పరిమితమైనా తన లాయర్‌తో కలిసి ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులకు తిరిగాడు. అయితే ఓ దశలో పిల్ ఓడిపోతానని అతనికి అనిపించింది. అయితే ఎలాగైనా దాన్ని నెగ్గించాలనే నెపంతో అతను దేశంలో ఉన్న దాదాపు 55వేల కిలోమీటర్ల రహదారులలో ప్రయాణం చేశాడు. ఆ రహదారుల పక్కనే ఉన్న వైన్ షాపుల వివరాలను సేకరించాడు. దీనికి తోడు అలా మద్యం తాగడం వల్ల యాక్సిడెంట్ అయిన పలు కేసులకు చెందిన వివరాలను కూడా హర్మాన్ సేకరించాడు. ఆ వివరాలన్నింటినీ అతను తన పిల్‌కు అదనంగా సబ్మిట్ చేశాడు. దీంతో ఈ మధ్యే సుప్రీం కోర్టు ఆ పిల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దేశంలో ఉన్న జాతీయ రహదారుల పక్కన ఉన్న మద్యం షాపులను వెంటనే షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హర్మాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు తన లక్ష్యం నెరవేరినందుకు, పిల్ నెగ్గినందుకు అతను ఎంతగానో సంతోష పడ్డాడు. అయితే అతను ఇక్కడితో ఆగడట. రోడ్ సేఫ్టీపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తానంటున్నాడు. అతను అలా కూడా విజయం సాధించాలని ఆశిద్దాం..!