బ్యాంక్ ఉద్యోగులకు సెల్యూట్… మనమూ కాస్త సహకరిద్దాం.!!

పిల్ల‌ల‌కు స్కూల్ ఫీజు క‌ట్టాల‌ని ఒక‌రు… పెళ్లి ఉంద‌ని ఇంకొక‌రు… హాస్పిట‌ల్ బిల్లు చెల్లించాల‌ని మ‌రొక‌రు… ఇలా గ‌త ఐదారు రోజులుగా దేశ‌మంత‌టా సామాన్య జనాలు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్క‌డ చూసినా పెద్ద ఎత్తున నోట్ల‌ను మార్పిడి చేసుకునేందుకు ప్ర‌జ‌లు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల‌నైతే లైన్ల‌లో నిల‌బ‌డ లేక వృద్ధులు సొమ్మ‌సిల్లిపోతున్నారు. అక్క‌డ‌క్క‌డా కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన పెద్ద నోట్ల‌ను ఏం చేయాలో తెలియ‌క ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ జ‌నాలు ప‌డుతున్న ఇక్క‌ట్లు. మ‌రి వారికి నోట్ల‌ను మార్పిడి చేసి ఇవ్వ‌డం, పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవ‌డం వంటి ప‌నులు నిర్వ‌హిస్తున్న బ్యాంక‌ర్లు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారో తెలుసా..?

queue-at-bank

ఈ నెల 8వ తేదీ అంటే ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌క‌ట‌న అనంత‌రం రెండో రోజు అంటే 9వ తేదీ నుంచి సెల‌వు దినాల్లో కూడా బ్యాంకింగ్ ఉద్యోగులు తీవ్రంగా శ్ర‌మిస్తూ నోట్ల మార్పిడి ప్ర‌క్రియ, డిపాజిట్లు స్వీక‌రించ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అవే కాదు, ఏటీఎంల‌లో క్యాష్ ఎప్ప‌టిక‌ప్పుడు అయిపోతున్నా వాటికి సంబంధించిన లావాదేవీలు నిర్వ‌హించ‌డం, జ‌నాల‌కు క్యాష్ అందుబాటులో ఉండేలా చూడ‌డం, నోట్ల మార్పిడి కి వ‌చ్చే జ‌నాల‌కు స‌మ‌స్య‌లు ఉన్నా, సందేహాలు వ‌చ్చినా వాటిని నివృత్తి చేయ‌డం, నిర‌క్ష‌రాస్యుల‌కు ఫామ్‌లు నింపి ఇవ్వ‌డంలో సాయం అందించ‌డం వంటి అనేక ప‌నులు చేస్తున్నారు. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 దాకా వారు గ్యాప్ లేకుండా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో అంత‌టి ఒత్తిడిని త‌ట్టుకోలేక ఓ బ్యాంక్ ఉద్యోగి కూడా మృతి చెందాడు.

అయితే తోటి జ‌నాల‌కే కాదు, బ్యాంక్ ఉద్యోగుల‌కు కూడా శ్ర‌మ క‌లిగించ‌కుండా ఉండాల‌న్నా, వారిపై ఒత్తిడి ప‌డ‌కుండా ఉండాల‌న్నా ప్ర‌తి ఒక్క‌రు ఎంతో సంయ‌మ‌నం పాటించాలి. నిజ‌మే, నోట్ల మార్పిడిలో, క్యాష్ విత్ డ్రాలో ఎవ‌రికైనా కొంత తొంద‌ర ఉంటుంది. కానీ అంద‌రూ మ‌నుషులే క‌దా. అంద‌రికీ తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఉంటుంది. కానీ ఓపిగ్గా వేచి ఉండి ప‌ని ముగించుకుంటే దాంతో ఎవ‌రిపై ఒత్తిడి ప‌డ‌దు. శ్ర‌మ అనిపించ‌దు. అందుకు ప్ర‌తి ఒక్క‌రు ఏం చేయాలంటే…

  • బ్యాంకులో ప్ర‌తి ఒక్క‌రు ఇత‌రుల ప‌ట్ల మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాలి. ఉద్యోగులు జ‌నాల ప‌ట్ల అయినా, జ‌నాలు ఉద్యోగుల ప‌ట్ల అయినా కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. అమర్యాద‌గా మాట్లాడ‌కూడ‌దు.
  • పొడ‌వైన లైన్ల‌లో ఎక్కువ సేపు ఉన్న‌ప్ప‌టికీ ఓపిగ్గా ఉండాలి. మీ స‌మయం ఎలాగూ వ‌స్తుంది, అప్పుడు ప‌ని ఎలాగో అయిపోతుంది. క‌నుక స‌హ‌నంతో వేచి ఉంటే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు.
  • దేశం మొత్తం అన్ని బ్యాంకుల్లోనూ ప‌రిస్థితి ఒకేలా ఉంటుంది క‌నుక ఆయా బ్యాంకుల‌కు చెందిన స‌ర్వ‌ర్లు, నెట్‌వ‌ర్క్స్‌, సాఫ్ట్‌వేర్ ఒక్కోసారి లోడ్ ఎక్కువై నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. క‌నుక ఓపికతో ఉంటే మంచిది. కంగారు ప‌డ‌కూడ‌దు. నెమ్మ‌దిగా ప‌నిచేసినా ఏదో ఒక స‌మ‌యానికి మీ ట‌ర్న్ వస్తుంది క‌దా.
  • ప్ర‌జ‌లంద‌రూ లైన్ల‌లో క్యూను పాటించ‌డం మంచింది. క‌ల‌గాపుల‌గం అయి గుంపులు గుంపులుగా వెళ్తే బ్యాంక్ ఉద్యోగుల‌కు సైతం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో వారి ప‌ని ఆల‌స్య‌మ‌వుతుంది. క‌నుక క్యూ లైన్ల‌లో వేచి ఉంటేనే మంచిది. ప‌ని తొంద‌ర‌గా అవుతుంది.
  • బ్యాంకుల‌కు అందరూ చ‌దువుకున్న వారే రారు. కొంద‌రు నిరక్ష‌రాస్యులు కూడా వ‌స్తుంటారు. అలాంటి వారికి చ‌దువుకున్న వారు స‌హాయం చేయాలి. అంద‌రికీ బ్యాంకు వారే హెల్ప్ చేస్తూ పోతే కొంత ఆల‌స్య‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
  • బ్యాంకులో మీ ప‌ని అయిపోగానే ఉద్యోగులకు థాంక్స్ చెప్ప‌డం మ‌రువ‌కండి. ఎందుకంటే ప్ర‌స్తుత త‌రుణంలో వారు ఎంత‌టి ప‌ని ఒత్తిడిలో ఉంటారో తెలుసు క‌దా. మీరు చెప్పే ఒక థాంక్స్ వారిలో ఉత్తేజాన్ని నింపుతుంది.

Comments

comments

Share this post

scroll to top