జ‌నాల‌ను మ‌రింత బాదబోతున్న బ్యాంకులు. ఎందుకో తెలిస్తే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు..!

నోట్ల ర‌ద్దు.. జీఎస్‌టీ.. త్వ‌ర‌లో రానున్న ఎఫ్ఆర్‌డీఐ బిల్లు పుణ్య‌మా అని ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు బ్యాంకుల‌పైనే పూర్తిగా న‌మ్మ‌కం పోయింది. దీంతో వారు బ్యాంకుల క‌న్నా త‌మ ఇండ్లే సేఫ్ అని చెప్పి న‌గ‌దును పెద్ద ఎత్తున త‌మ త‌మ నివాసాల్లోనే దాచుకుంటున్నారు. ఇక కొంద‌రు ఇలా చేస్తుండడం వ‌ల్ల జ‌నాల‌కు ఏటీఎంల‌ల క్యాష్ దొర‌క‌డం లేదు. దీనికి తోడు బ్యాంకులు ఎడా పెడా విధిస్తున్న చార్జిలు కూడా ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు బ్యాంకుల‌న్నీ త్వ‌రలో మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకోనున్నాయి. అదేమిటంటే…

అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల ద్వారా చేసే లావాదేవీలు, కార్డుల ద్వారా చేసే లావాదేవీలపైనా సర్వీస్ ఛార్జి విధించాలని బ్యాంకులునిర్ణయించాయి. దీనికి కారణం జీఎస్‌టీయే. ఇప్పటి వరకు బ్యాంకులు అందిస్తూ వ‌స్తున్న‌ ఉచిత సేవలపైనా పన్ను కట్టాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ బ్యాంకులకు నోటీసులు కూడా అందించింది. ఈ సంవత్సరానికే కాదు.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని పన్నుల శాఖ నుంచి బ్యాంకుల‌కు నోటీసులు ఇచ్చాయి. ఇక ఆ ప‌న్ను మొత్తం అక్షరాల రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా.

అయితే బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించే ఖాతాదారులకు కొన్ని సేవ‌లు ఉచితంగానే ల‌భిస్తాయి. కానీ కనీస నిల్వ ఉంచ‌ని ఖాతాదారుల‌కు అందించే సేవలపై మాత్రం బ్యాంకులు సర్వీస్ ఛార్జి విధిస్తాయి. అయితే బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై సర్వీస్ ఛార్జి విధిస్తున్నట్లుగా భావించి పన్ను కట్టాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ (DGGST) కోరింది. నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోట‌క్ మ‌హింద్రా వంటి ప‌లు ముఖ్య‌మైన బ్యాంకులు ఉన్నాయి. కాగా ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జి వసూలు చేసినట్లు పరిగణిస్తున్నామ‌ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ నోటీసులు అందించటం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఆ నోటీసుల ప్ర‌కారం బ్యాంకులు రూ.6వేల కోట్ల వ‌ర‌కు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే గ‌న‌క జరిగితే.. ఇక నుంచి ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ వసూలుకి బ్యాంకులు సిద్ధం అవుతున్నాయి. ఇక నుంచి బ్యాంకుల్లో ఉచిత సేవ అనేది ఉండదు. కాగా మే నెలలో దీనికి సంబంధించి పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా రానున్న నెల‌ల్లో బ్యాంకుల మోత మ‌రింత బాగా ఉండ‌బోతుంద‌న్నది మాత్రం జ‌నాలు బాగా గుర్తు పెట్టుకోవాలి..!

బ్యాంకుల మరో దిమ్మతిరిగే షాక్ : ATM, చెక్స్, కార్డులపై సర్వీస్ ఛార్జ్

Comments

comments

Share this post

scroll to top