నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి సరస్సులో జలకన్య కనిపించడం. అసలు స్టోరీ ఏంటో మీరే చూడండి!
బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చాలాచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి.. అందులో నీరు చేరి.. చిన్నపాటి నీటి సరస్సులను తలపిస్తున్నాయి. ఈ వర్షాలకు నగరం రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఈ రహదారుల వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనిపై.. సామాజిక ఉద్యమకారుడు బాదల్.. తన స్నేహితురాలు, నటి సోనూ గౌడతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. రద్దీగా ఉండే ఎంజీ రోడ్డుకు సమీపంలో.. పరేడ్ గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న జంక్షన్లో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బాదల్ శుక్రవారం ఓ చిన్నపాటి సరస్సును చిత్రించాడు. అందులో చేప ఈదుతున్నట్టుగా.. నటి సోనూగౌడతో జలకన్యగా నటింపజేస్తూ.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. గుంతల కారణంగా ఇప్పటికే బెంగళూరులో ఐదుగురు చనిపోయారని.. తమ ప్రయత్నంతో ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చినా సంతోషమేనని బాదల్, సోనూ చెప్పారు. మరోవైపు.. బెంగళూరు ప్రజలు కూడా.. అధికారులు త్వరగా స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.