గాజులమ్ముకుని ఒకప్పుడు జీవనం సాగించిన ఆ బాలుడు ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయ్యాడు..!

కష్ట పడాలనే సంకల్పం మనసులో ఉండాలే గానీ ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇది అందరూ చెప్పే మాటే. అయితే దీన్ని పాటించే వారు మాత్రం కొంత మందే ఉంటారు. మహారాష్ట్రకు చెందిన రమేష్ గొలాప్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయినా అంగవైకల్యంతో బాధపడుతున్నా దేన్నీ లెక్క చేయకుండా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతోనే చిన్నప్పటి నుంచి పనిచేశాడు. ఎట్టకేలకు ఆ దిశగా విజయం సాధించాడు. పేద కుటుంబం నుంచి వచ్చినా చదువుకు అది ఏ మాత్రం అడ్డుకాదని చాటి చెబుతూ తన ప్రతిభతో ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బర్షి మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రమేష్ గొలాప్‌ను స్థానికంగా అందరూ రాము అని పిలిచే వారు. అతను చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతుండే వాడు. అయినప్పటికీ చదువుల్లో మాత్రం ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండేవాడు. అతని తండ్రి గోరఖ్ గొలాప్ సైకిల్ రిపేర్ షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. అయితే అతనికి ఉన్న మద్యపానం అలవాటుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. దీంతో రాము తల్లి విమల్ గొలాప్ చుట్టు పక్కల గ్రామాల్లో గాజులు అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునే వారు. ఆమెకు రాము, అతని తమ్ముడు కూడా సహాయం చేసే వారు. కాగా తమ గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే చదువుకునేందుకు వీలుండడంతో అతను తన బాబాయి దగ్గరికి వెళ్లాడు. అక్కడ కూడా అతను చదువుల్లో అందరు విద్యార్థులకన్నా ముందే ఉండేవాడు. అది 2005వ సంవత్సరం. అప్పుడు రాము 12వ తరగతి చదువుతున్నాడు. అప్పుడతనికి మోడల్ పరీక్షలు నడుస్తున్నాయి. కాగా అకస్మాత్తుగా ఒక రోజు అతనికి తన తండ్రి చనిపోయాడనే వార్త తెలిసింది. దీంతో హుటాహుటిన సొంత గ్రామానికి బయల్దేరాల్సి వచ్చింది. కానీ చేతిలో చిల్లగవ్వ లేదు. తాను ఉన్న ఊరు నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లాలంటే బస్ చార్జి రూ.7 అవుతుంది. కాకపోతే రాముకు బస్‌పాస్ ఉండడం వల్ల రూ.2 చెల్లిస్తే చాలు. బస్‌లో వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ ఆ డబ్బులు కూడా అతని వద్ద లేకపోవడంతో తన స్నేహితులు రాముకు సహాయం చేశారు. దీంతో రాము ఊరికి వెళ్లి తండ్రి అంత్య క్రియల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తండ్రి మరణం రామును మరింత కుంగదీసింది. తన తండ్రి మరణించిన తరువాత సరిగ్గా 4 రోజులకు కెమిస్ట్రీ మోడల్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. తల్లి బలవంతం మేరకు ఎలాగో ఆ పరీక్ష రాశాడు. కానీ మిగతా అన్ని మోడల్ పరీక్షలను రాయలేదు. కాగా అతను చదువుతున్న పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు రామును కలిసి ప్రోత్సహించడంతో ఎలాగోలా 12వ తరగతి పరీక్షలు రాసి విజయవంతంగా 88.5 శాతం మార్కులతో పాఠశాలను విద్యను పూర్తి చేసుకున్నాడు.

ramesh-gholap

అయితే తదుపరి చదువులు చదివేందుకు రాము వద్ద తగినన్ని డబ్బులు లేవు. దీంతో బాగా తక్కువ ఖర్చయ్యే డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) కోర్సును ఎంచుకున్నాడు. అది పూర్తి చేస్తేనన్నా స్కూల్ టీచర్‌గా జాబ్ సంపాదించి కుటుంబానికి అండగా నిలవచ్చని భావించాడు. ఈ క్రమంలో డీఎడ్‌తోపాటు ఓపెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కోర్సులో డిగ్రీని కూడా పూర్తి చేశాడు. అనంతరం 2009లో ఓ పాఠశాలలో టీచర్‌గా జాయిన్ అయ్యాడు. అయితే తాను కలగన్నది మాత్రం వేరే ఉంది. ప్రభుత్వ అధికారులు తమ లాంటి పేదలను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో రాము తన చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాడు. బీపీఎల్ స్కీం కింద ఇంటి కేటాయింపు విషయంలో, రేషన్ షాపుల వద్ద, తండ్రికి చికిత్స చేయించడం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తమతో ఎలా ప్రవర్తించారో అతను గమనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వారందరిపై అజమాయిషీ చలాయించాలంటే తహసీల్దార్ అయి ఉండాలని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. ఒక ఉపాధ్యాయుడి సహకారంతో రాము యూపీఎస్సీ ప్రవేశ పరీక్ష రాశాడు, కానీ అందులో విజయం సాధించలేకపోయాడు. అదే సమయంలో 2010లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన తల్లిని సర్పంచ్ పదవి కోసం పోటీగా నిలబెట్టాడు. కానీ అందులోనూ వారు గెలవలేకపోయారు. అప్పుడే రాము అలియాస్ రమేష్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సివిల్స్ పాసై ఐఏఎస్ ఆఫీసర్ అయిన తరువాతే తిరిగి తన గ్రామానికి వస్తానని అక్కడున్న వారితో శపథం చేసి మరీ వెళ్లాడు.

ఈ క్రమంలో రాము నిత్యం కష్టపడి చదివాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే 2012లో విజయవంతంగా యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. దేశ వ్యాప్తంగా 287 ర్యాంకును సాధించి తన సత్తా చాటాడు. అనంతరం తాను చేసిన ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకుని 2012, మే 12న తన స్వగ్రామానికి వచ్చి అక్కడ అందరి అభినందనలు అందుకున్నాడు. ప్రస్తుతం రాము అలియాస్ రమేష్ ఐఏఎస్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కాగా విధి నిర్వహణలోనూ అతను కఠినంగా ఉంటున్నాడు. తన చిన్నప్పుడు జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవినీతి ప్రభుత్వ అధికారులు తారసపడితే వారిపై సస్పెన్షన్ వేటు కూడా వేస్తూ వృత్తిలో తన నిబద్దతను చాటుకుంటున్నాడు. అంతేకాదు తనలా ఐఏఎస్ పాసవ్వాలని కలలు కంటున్న యువతకు ప్రేరణాత్మకమైన సందేశాలను ఇస్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా, అంగ వైక్యలం బాధిస్తున్నా ఉన్నత లక్ష్య సాధన దిశగా కష్టపడి చదివి దాన్ని విజయవంతంగా సాధించిన రాము అలియాస్ రమేష్ ఐఏఎస్‌ను నిజంగా మనం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top