వీధి వీధికి తిరిగిన ATM, ప్రజల డబ్బు కష్టాలను తీర్చడానికి కొత్త ఐడియా.

ఈ నెల 8వ తేదీన ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నోట్ల మార్పిడి కోసం ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున బ్యాంకులు, పోస్టాఫీసుల వ‌ద్ద బారులు తీరి మ‌రీ న‌గ‌దు డిపాజిట్ చేయ‌డం, పాత నోట్ల‌కు బ‌దులుగా కొత్త నోట్ల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. ఏటీఎంల వ‌ద్ద‌నైతే చూద్దామంటే ఖాళీ క‌నిపించ‌డం లేదు. చాలా వ‌ర‌కు ప్రైవేటు బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంలు మూత ప‌డే ఉంటున్నాయి. ఇక ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంల‌లోనైతే ర‌ద్దీ విప‌రీతంగా ఉంటోంది. చాలా వ‌ర‌కు ప‌నిచేయ‌డం లేదు కూడా. ఈ క్ర‌మంలో స‌గ‌టు పౌరుల‌కు క్యాష్ తీసుకోవ‌డం చాలా ఇబ్బంది అవుతోంది. రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఏటీఎంల వ‌ద్ద ర‌ద్దీ పెరుగుతోంది కానీ త‌గ్గ‌డం లేదు. ఇది ఒక్క మ‌న భాగ్య‌న‌గ‌రంలోనే కాదు, దేశ‌మంత‌టా ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌తోపాటు అన్ని గ్రామాల్లోనూ ఇలాగే ఉంది. ఇక ఐటీ న‌గ‌ర‌మైన బెంగ‌ళూరులో ఈ ఇక్క‌ట్ల‌పై ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

mobile-atm-bangalore

బెంగుళూరు న‌గ‌రంలో ఉన్న ఐటీ ఉద్యోగులే కాదు, స్థానిక ప్ర‌జ‌లు కూడా న‌గ‌దు విత్‌డ్రాకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అక్క‌డి ఎంజీ రోడ్ అనే ప్రాంతంలోనైతే ఎక్క‌డ చూసినా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఏటీఎంల వ‌ద్ద బారులు తీరి ఉంటున్నారు. మ‌రీ ఈ రెండు, మూడు రోజుల నుంచైతే ఈ లైన్ కిలోమీట‌ర్ల దాకా ఉంటోంది. దీన్ని గ‌మ‌నించిన అక్క‌డి కెన‌రా బ్యాంక్ జ‌న‌ర‌ల్‌ మేనేజ‌ర్ ఎంఎం చినివ‌ర్ ఓ చ‌క్క‌ని ఉపాయం చేశారు. అదేమిటంటే…

న‌గ‌దుతో కూడిన ఓ మొబైల్ ఏటీఎం బ‌స్‌ను ఎంజీ రోడ్‌లో ఉంచారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌స్‌ను ఎంజీ రోడ్‌లో పార్కింగ్ చేయ‌గా, అక్క‌డ ఏటీఎంల‌లో డ‌బ్బుల కోసం వేచి ఉన్న చాలా మంది స‌ద‌రు మొబైల్ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకుని న‌గ‌దును విత్ డ్రా చేసుకోవ‌డం కోసం ఆస‌క్తి చూపించారు. అలా దాదాపుగా 800 మంది క‌స్ట‌మ‌ర్లు రూ.8 ల‌క్ష‌ల న‌గ‌దు వ‌ర‌కు విత్ డ్రా చేసుకున్నారు. అంటే ఒక్కొక్క‌రికి రూ.1వేయి దాకా విత్ డ్రా అయింది. దేశంలో న‌గ‌దు విత్‌డ్రాకు ఇబ్బందిగా ఉన్న అలాంటి ఏరియాల‌ను గుర్తించి మొబైల్ ఏటీఎంల‌ను పెడితే దీంతో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగం క‌ల‌గ‌నుంది. అధికారులూ… వింటున్నారా..! ఇక‌నైనా ఏటీఎంల స‌మ‌స్య‌ను తీర్చ‌డం కోసం ఇలాంటి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేయండి. దాంతో కొంత‌లో కొంతైనా ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top