ఈ సైట్లలో “బాహుబలి” టికెట్లు బుక్ చేస్తే మీ డబ్బులు పోయినట్టే..!

జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలి-2 మ‌రో మూడురోజుల్లో విడుద‌ల‌కానుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు బాహుబ‌లి గురించే చ‌ర్చించుకుంటున్నారు సినీజ‌నాలు. ఇదే క్రేజ్‌ను సొమ్ముచేసుకోవాల‌ని చూస్తున్నారు కొంద‌రు న‌కిలీగాళ్లు. ఇప్ప‌టికే కొన్ని థియేట‌ర్స్‌కు సంబంధించిన టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోగా… ఇంకా కొన్ని ప్ర‌ముఖ బుకింగ్ వెబ్‌సైట్ల‌లో టికెట్ల‌ను ఉంచ‌లేదు థియేట‌ర్ల యాజ‌మాన్యాలు. ఒక‌వేళ ఉంచినా అవి క్ష‌ణాల్లో అమ్ముడుపోవ‌డం ఖాయం.

ఇదే అదునుగా భావించిన న‌కిలీగాళ్లు న‌కిలీ బుకింగ్ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి ఆయా ప్రాంతాల థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న బాహుబ‌లి-2 సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఒక్కో టికెట్ రూ.120కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించే సైట్ల గురించి తెలియని వారు ఈ నకిలీ సైట్ల బారిన పడుతున్నారు. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో గూగుల్ లేదా ఇతర సెర్చ్ సైట్లు ఓపెన్ చేసి bahubali 2 movie tickets అని సెర్చ్ చేస్తే వాటిల్లో వచ్చే మొదటి పేజీల్లో దాదాపుగా మొత్తం నకిలీ సైట్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు ప‌లుదేశాల పేర్లు ఇచ్చి ఎవ‌రికైనా బాహుబ‌లి టికెట్స్ కావాలంటే త‌మ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సిందిగా ముందుగానే ప్ర‌చారం నిర్వ‌హించింది.దీంతో నిజంగానే టిక్కెట్లు ఉన్నాయని నమ్మిన ప్రేక్షకులు ఆ సైట్‌లో టిక్కెట్లను కొనుగోలు చేశారు.

ప్ర‌తీ చోటా బాహుబ‌లి-2కు సంబంధించిన థియేట‌ర్లు హౌజ్‌ఫుల్ అవ‌డం… ఎప్పుడూ విన‌ని వెబ్‌సైట్‌ల పేర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో కొంద‌రికి అనుమానం వ‌చ్చింది. దీంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు www.newtickets.in అనేది న‌కిలీ సైట్ అని తేల్చేశారు. మూడురోజుల ముందు విష‌యం బ‌య‌ట‌ప‌డింది కాబ‌ట్టి స‌రిపోయింది. అస‌లు సంగ‌తి తెలియ‌కుండా న‌కిలీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న‌వారు రిలీజ్ రోజున థియేట‌ర్లోకి వెళితే పెద్ద గొడ‌వ‌లు జ‌రిగేవ‌ని పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తున్న వారు పొర‌పాటున కూడా త‌మ డెబిట్, క్రెడిట్ కార్డు, ఈమెయిల్ వివ‌రాలు దుండ‌గులకు చెప్ప‌రాద‌ని హెచ్చ‌రిస్తున్నారు సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు.

Comments

comments

Share this post

scroll to top