ఆమె 100 మంది రేపిస్ట్ ల‌ను ఇంట‌ర్వ్యూ చేసింది..! ఫైన‌ల్ గా ఏ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిందంటే….!??

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన జరిగి నాలుగేండ్లు..కానీ ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్లు గగుర్పోడుస్తుంది.నిర్బయ ఘటన జరిగిన తర్వాత అదే పేరుతో కఠిన చట్టం వచ్చినా అత్యాచారాలు పెరిగాయే కానీ తగ్గలేదు. అసలు రేప్ లు ఎందుకు జరుగుతున్నాయి.. అత్యాఛారాలకు పురిగొల్పుతున్న పరిస్థితులేంటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు 26 ఏళ్ల మధుమిత పాండే 2003లో నడుం బిగించారు. గత మూడేళ్లలో తీహార్ జైలులో అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 100 మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేశారు.ఇంటర్వ్యూలో ఆమె ఏం తేల్చారో తెలుసుకోండి..

రేప్ చేసే వాళ్లు అతి సామాన్యులు

‘‘సమాజం దృష్టిలో అత్యాచార నేరగాళ్లు నరరూపరాక్షసులు. మనిషన్న వాడు ఇలాంటి అకృత్యాలకు పాల్పడడన్నది దేశంలోని అత్యధికుల అభిప్రాయం. తీహార్‌ జైలులో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు. కొద్ది మంది మాత్రమే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అందరూ భావిస్తున్నట్లుగా వీరేమీ అసాధారణమైన వ్యక్తులు కాదు. అతి సాధారణ మనుషులు. వారు పుట్టిపెరిగిన వాతావరణం..ఆలోచనా ధోరణులే వారిని అలాంటి నేరాలకు పురికొల్పాయి’’అని మధుమిత తెలిపారు.

లైంగిక విద్యకు పిల్లలు దూరం 

‘‘దేశంలోని విద్యావంతుల కుటుంబాల్లోనూ మహిళలు సాంప్రదాయకమైన విధులకే పరిమితమవుతున్నారు. చాలా మంది మహిళలు తమ భర్తలను పేరు పెట్టి పిలవలేరు. ఇక పురుషులు తామేదో ప్రత్యేకమైనట్లు వ్యవహరిస్తారు. మహిళలు అణకువగా, లొంగి ఉండాలనే భావంతోనే పెరుగుతున్నారు. పిల్లల పెంపకంలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. లైంగిక విద్యకు పాఠ్యాంశాల్లో చోటులేదు. ఇంటి దగ్గర తల్లిదండ్రులూ చెప్పరు. అత్యాచారం అంటే ఏమిటో వివరించరు. జననాంగాలకు సంబంధించి ప్రతిదీ ఓ రహస్యంగానే ఉంచుతారు. ఈ పరిస్థితుల్లో మగపిల్లలకు లైంగికపరమైన అంశాల్లో విజ్ఞానం ఎలా అందుతుంది?’’ అని మధుమిత ప్రశ్నించారు.
‘‘జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లలో కొందరికి అత్యాచారం అంటే ఏమిటో తెలియదు. తాము అలాంటి నేరానికి పాల్పడ్డామన్న స్పృహ కొద్ది మందిలోనే ఉంది. శృంగారానికి మహిళ అంగీకారం అవసరమన్న ఆలోచన చాలా మందికి తెలియదు’’ అనే విషయం వారితో మాట్లాడిన సందర్భంలో తెలియవచ్చిందని మధుమిత వెల్లడించారు.
నేరగాళ్లలో కొందరు తాము చేసింది తప్పేనని అంగీకరించటంతో పాటు అందుకు తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరగాడైతే…శిక్ష పూర్తయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు తాను నిర్ఘాంతపోయానని మధుమిత పేర్కొన్నారు . ఈ వివరాలన్నిటితో త్వరలో తాను తీసుకొచ్చే పుస్తకంపై తీవ్ర విమర్శలు వస్తాయని, ఓ మహిళ అయ్యి ఉండి ఇటువంటి పరిశోధన చేయటమేమిటని ప్రశ్నించే వారూ ఉంటారని మధుమిత అన్నారు. అయినప్పటికీ అత్యాచారాలకు పురిగొల్పుతున్న అసలు కారణాలను అడ్డుకోకుండా కేవలం శిక్షలతోనే వాటిని నిరోధించలేమన్న అభిప్రాయాన్ని మధుమిత పాండే వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఉన్న అత్యాచార నేరగాళ్లు సరే…సమాజంలో ఉన్న మృగాళ్ల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

 

Comments

comments

Share this post

scroll to top